Alcohol : మద్యం తాగే వారిలో మరణాల రేటు ఎక్కువే!..

మితిమీరిన మద్యం.. లివర్‌ క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, అన్నవాహిక క్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌.. ఇలా అనేక రకాల క్యాన్సర్లకు ఇదే మూలంగా మారుతుంది.

Alcohol : మద్యం తాగే వారిలో మరణాల రేటు ఎక్కువే!..
ad

Alcohol : ఇటీవలి కాలంలో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరుగుతుంది. యుక్త వయస్సు వారి నుండి పెద్ద వయస్సు వారి వరకు నిత్యం మద్యం సేవించనిదే ఉండలేని పరిస్ధితి. మహిళలు సైతం దీనికి బానిసలుగా మారుతున్నారు. మద్యం సేవించటం ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తుంది. శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. మద్యంపై వైద్యపరంగా జరిగిన అనేక అధ్యయనాల్లో సాధారణ వ్యక్తులతో పోలిస్తే మద్యం తాగే వారిలో మరణాల రేటు అధికంగా ఎన్నట్లు నిర్ధారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మరణాల్లో 4%, అన్ని జబ్బుల్లో 5%.. కేవలం ఆల్కహాల్‌ వల్ల చోటు చేసుకుంటున్న మరణాలే అధికంగా ఉన్నాయి.

మద్యం తాగటం వల్ల వచ్చే జబ్బులు…

మద్యం తాగటం వల్ల వచ్చే దీర్ఘకాలిక లివర్‌ వ్యాధిలో ప్రధానంగా నాలుగు దశలున్నాయి. వీటిలో సర్వసాధారణమైనది, కాలేయాన్ని ఓ మోస్తరుగా దెబ్బతీసేది- కొవ్వు పట్టటం! దీన్నే ‘ఫ్యాటీ లివర్‌’ అంటారు. ఈ సమస్యను అల్ట్రాసౌండ్‌ పరీక్ష ద్వారా తేలిగ్గానే గుర్తించొచ్చు. ఈ దశలో మద్యం మానేస్తే దెబ్బతిన్న లివర్‌ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే అవకాశం ఉంటుంది. అప్పటికీ మానకుండా తాగుతూ ఉంటే దీర్ఘకాలిక వ్యాధులైన హెపటైటిస్‌, లివర్‌ సిరోసిస్‌ వంటివాటికి దారి తీస్తుంది.ఈ లివర్‌ సిరోసిస్‌ కారణంగా పేగుల్లో రక్తస్రావం, పొట్టలో నీరు చేరటం, కామెర్లు, మతి భ్రమణం వంటి సమస్యలూ ఎక్కువవుతాయి. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. అందుకే ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చిన తర్వాత కూడా ఇంకా తాగటమన్నది చాలా ప్రమాదకరమని గుర్తించాలి. మద్యానికి బానిసలైన ప్రతి 10 మందిలో కనీసం ఇద్దరికి లివర్‌ దెబ్బతినే ఉంటోంది. మద్యాన్ని కేవలం భోజన సమయంలో మాత్రమే తాగితే లివర్‌ దెబ్బతినే రిస్కు కొంత తక్కువని గుర్తించారు.

మితిమీరిన మద్యం.. లివర్‌ క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, అన్నవాహిక క్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌.. ఇలా అనేక రకాల క్యాన్సర్లకు ఇదే మూలంగా మారుతుంది. ముఖ్యంగా నోరు, జీర్ణ అవయవాల్లో వచ్చే క్యాన్సర్లకు పొగ తర్వాత మద్యం సేవించటమే అతి ముఖ్య కారణం. ఇక మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాల్లో 20% వరకూ క్యాన్సర్ల రూపంలో వస్తున్నవే.. పట్టణ ప్రాంతాల్లో స్త్రీలు, యువతుల్లో మద్యం అలవాటు పెరుగుతోంది. దీనితో పాటే రొమ్ము క్యాన్సర్‌ కేసులూ పెరుగుతుండటం గమనించాల్సిన అంశం. హెపటైటిస్‌-బి, సి వంటివి ఉన్నవారు మద్యం తీసుకుంటుంటే వారిలో లివర్‌ క్యాన్సర్‌ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది.

క్లోమం అనేది మన జీర్ణప్రక్రియకు అత్యంత కీలకమైన ఎంజైములను, రక్తంలో గ్లూకోజును నియంత్రించేందుకు అవసరమైన హార్మోన్లను స్రవించే ముఖ్యమైన గ్రంథి. అతిగా మద్యం తాగటం వల్లఈ క్లోమ గ్రంథి వాచిపోయి, ఇందులోని కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.  దీన్నే ‘పాంక్రియాటైటిస్‌’ అంటారు. ఇది ఉన్నట్టుండి ఉద్ధృతంగా రావచ్చు, లేదంటే క్లోమం ఎప్పుడూ వాచే ఉండి.. దీర్ఘకాలికంగా కూడా వేధించొచ్చు. ఇది ఉద్ధృతంగా వచ్చినప్పుడు కొంతమందిలో కీలక అవయవాలు విఫలమైపోవటం, క్లోమం క్షీణించిపోవటం, దాని మీద చీముగడ్డలు, నీటితిత్తులు రావటం వంటి తీవ్రస్థాయి ప్రమాదాలూ ముంచుకొస్తాయి. కొద్దిమందిలో ఎన్ని చికిత్సలు చేసినా సమస్య ప్రాణాంతకంగా కూడా తయారవుతుంటుంది.

మద్యం తాగటం వల్ల హాయిగా ఉంటుందని, ఆందోళనలన్నీ తగ్గిపోతాయనీ, ఆత్మవిశ్వాసం పెరిగినట్లుంటుందని, బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుందనీ ఇలా రకరకాల కారణాలతో తాగుతుంటారు. ఈ విధంగా ఎక్కువగా తాగేవారిలో వ్యసనాలే కాదు, మానసిక సమస్యలు, వ్యాధులు కూడా ఎక్కువేనని గమనించాలి. దీర్ఘకాలం మద్యం తాగటం వల్ల మెదడులోని రసాయనాల్లో మార్పులు వస్తాయి. అతిగా తాగేవారిలో ఆందోళన, కుంగుబాటు చాలా ఎక్కువ. ఆత్మహత్య భావనలు కలుగుతాయి.

మద్యం ద్వారా చాలా క్యాలరీల శక్తి అదనంగా వస్తుంది. వైన్‌, బీరు వంటివన్నీ కూడా దాదాపు పిండి పదార్థాలు, చక్కెరలను పులియబెట్టటం ద్వారా తయారయ్యేవే. చక్కెరలు ఎక్కువ కాబట్టి వీటి ద్వారా క్యాలరీలూ ఎక్కువే వస్తాయి. కొన్నింటిలో దాదాపు ఇది కొవ్వులతో సరిసమానంగా కూడా ఉంటుంది. పైగా మద్యంతో పాటేనంజుకోవటానికి చికెన్‌ 65, జీడిపప్పు, వేయించిన చేప ముక్కల్లాంటి కొవ్వులు ఎక్కువగా ఉండే స్నాక్స్‌ కూడా తినాలనిపిస్తుంది. వీటివల్లా క్యాలరీలు ఎక్కవ వస్తాయి. చివరకు ఊబకాయం బారిన పడాల్సి వస్తుంది.

ప్రతిరోజు మితంగా మద్యం తీసుకోవటం గుండె జబ్బులు రాకుండా నివారించేందుకు దోహదం చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు గుర్తించిన మాట నిజమేగానీ వాస్తవమే అయినప్పటికీ ఇది కాలక్రమంలో ఎంత తాగుతున్నారన్న దాని మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనం తాగే అలవాట్లు, కుటుంబ చరిత్ర, వయస్సు, జన్యుపరమైన అంశాల వంటివీ కీలకమే. మితి మీరి తాగితే ఇది ప్రత్యక్షంగా గుండె జబ్బుకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది.

మద్యం మానుకునే ప్రయత్నాలు…

మద్యానికి బానిసైన వారు ఆ వ్యాపకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. రోజూ వ్యాయామం చెయ్యండి. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అంతమంచిది. నిత్య వ్యాయామాలు ఆల్కహాల్‌ తాగాలన్న కాంక్ష తగ్గిపోయేలా చేస్తాయి. మంచినీళ్లు ఎక్కువగా తాగే అలవాటు చేసుకోండి. ఆల్కహాల్‌ వ్యసనాన్ని పోగొట్టటంలో ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన సైకియాట్రిస్ట్‌లను సంప్రదించి మెరుగైన చికిత్స పొందటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.