వాట్సాప్‌లో Call Waiting ఫీచర్ : ఈజీగా మరో కాల్ మాట్లాడొచ్చు

  • Published By: sreehari ,Published On : December 7, 2019 / 01:00 PM IST
వాట్సాప్‌లో Call Waiting ఫీచర్ : ఈజీగా మరో కాల్ మాట్లాడొచ్చు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తమ యూజర్లను ఆకట్టకునేందుకు ఆకర్షణీయమైన అప్ డేట్స్ రిలీజ్ చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకించి వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. Call Waiting ఫీచర్. దీని సాయంతో ఇకపై యూజర్లు ఒక వాట్సాప్ కాల్ మాట్లాడుతుండగానే మరో కాల్ కు ఆన్సర్ చేయవచ్చు.

ఇప్పటివరకూ వాట్సాప్ కాల్ మాట్లాడుతున్న సమయంలో మరో కాల్ వస్తే.. ఆటోమాటిక్ గా కాల్ రిజిక్ట్ అయ్యేది. ఇకపై అలా కాదు.. మీ కాల్ హోల్డ్ లో పెట్టాల్సిన పనిలేకుండానే మరో కాల్ కు ఈజీగా మారిపోవచ్చు. ఇప్పటి నుంచి వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు రెండో కాల్ వస్తే అది Waiting Call గా చూపిస్తుంది.

నో కన్ఫ్యూజన్..చాయిస్ ఈజ్ యూవర్స్ :
కాల్ ఆన్సర్ చేయాలా? లేదా రిజెక్ట్ చేయాలా? అని మీకో అలర్ట్ వస్తుంది. సాధారణంగా వాట్సాప్ కాల్ వచ్చిన సమయంలో ఒకేసారి ఎక్కువ మంది కాల్స్ చేసినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ గా అనిపించేది. ఏ కాల్ కనెక్ట్ అయింది. ఏ కాల్ మాట్లాడుతున్నాం.. ఏది డిస్ కనెక్ట్ అయిందో తెలియక విసుగు తెప్పించేది. ఈ కొత్త వెయింటిగ్ కాల్ ఫీచర్ ద్వారా ఒక కాల్ నడుస్తుండగా.. మరో కాల్ వస్తే అది వెయిటింగ్ కాల్ గా మారిపోతుంది. అయితే.. ఇక్కడ మీరు మాట్లాడే కాల్ హోల్డ్ చేయకుండానే మరో కాల్ మాట్లాడాల్సి ఉంటుంది. అంటే.. మరో కాల్ కనెక్ట్ కాగానే.. అంతకుముందు కాల్ ఆటోమాటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది.

స్టేబుల్.. బీటా వెర్షన్ : ప్లే స్టోర్‌లో డౌన్ లోడ్ 
ప్రస్తుతం.. ఈ Call Waiting ఫీచర్.. ఇప్పుడు గతనెలలోనే ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్.. వాట్సాప్ వాడే ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందరికి అందుబాటులోకి వచ్చేసింది. ఈ లేటెస్ట్ వాట్సాప్ అప్‌డేట్.. స్టేబుల్ ఆండ్రాయిడ్, బీటా వెర్షన్ యాప్ అన్నింట్లో వెయిటింగ్ ఫీచర్ ను కంపెనీ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈజీగా వాట్సాప్ Update చేసుకోవచ్చు. 

ప్రస్తుతం.. వాట్సాప్ 2.19.352 వెర్షన్ స్టేబుల్ ఆండ్రాయిడ్ యాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ఇతర బీటా వెర్షన్ యాప్ 2.19.357, 2.19.358 కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ.. ఈ వాట్సాప్ Call Waiting ఫీచర్ ఇప్పటివరకూ మీకు అప్‌డేట్ రాలేదంటే.. APKMirror నుంచి స్టేబుల్ ఆండ్రాయిడ్ వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ నెలలోనే iOS యూజర్ల కోసం వాట్సాప్ v2.19.120 వెర్షన్ లో కాల్ వెయిటింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో పాటు Chat Screen కూడా రీడిజైన్ చేసింది.

Call Waiting ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఈజీగా మరో కాల్ అట్మెంట్ చేయవచ్చు. ఒక ఫోన్ కాల్ మాట్లాడుతుండగా మరో ఫోన్ కాల్ వస్తే. మీ ఫోన్ స్ర్కీన్ పై రెండు బటన్స్ కనిపిస్తాయి. అందులో రెడ్ కలర్ (Decline) బటన్ ఒకటి… రెండోది End & Accpet అని Green బటన్ ఉంటుంది. ఈ రెండింటిలో రెడ్ కలర్ Decline బటన్ నొక్కితే.. ఇన్ కమింగ్ కాల్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్ గోయింగ్ కాల్ అలాగే మాట్లాడుకోవచ్చు. ఒకవేళ End & Accpet బటన్ నొక్కితే.. ఆన్ గోయింగ్ కాల్ కట్ అయిపోయింది. రెండో కాల్ చేసిన వ్యక్తితో మీరు మాట్లాడుకోవచ్చు.

రెండో కాల్.. హోల్డ్ పెట్టలేం :
సెల్యూలర్ నెట్ వర్క్ మాదిరిగా రెగ్యులర్ కాల్ హోల్డ్ లో పెట్టి మరో కాల్ ఆన్సర్ చేసే వీలుంది. కానీ, వాట్సాప్ లో అలా కుదరదు. ఒక కాల్ మాట్లాడుతుండగా రెండో ఇన్ కమింగ్ కాల్ వస్తే దాన్ని హోల్డ్ చేయడం కుదరదు. ఇద్దరితో ఒకేసారి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. రెండింటిలో ఏదొక వాట్సాప్ కాల్ మాత్రమే కొనసాగించవచ్చు. మొదటి కాల్ కట్ చేయడం లేదా రెండో కాల్ ఆన్సర్ చేయడం కానీ చేయాల్సి ఉంటుంది.

గ్రూపు కాల్ ప్రైవసీ ఫీచర్ :
వాట్సాప్ లో కాల్ వెయిటింగ్ ఫీచర్ తో పాటు అదనంగా వాట్సాప్ మరో కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ గ్రూపు ప్రైవసీ ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు ఎవరిని తమ వాట్సాప్ కాల్ కు యాడ్ చేయాలో లేదో నిర్ణయించుకోవచ్చు. వాట్సాప్ Settings menuలోని Account,Privacy Groups ఆప్షన్ ఓపెన్ చేయండి.