Unwanted Hair : అవాంఛిత రోమాలకు ఈజీగా చెక్ చెప్పండి!..

అవాంఛిత రోమాలను సహజసిద్ధమైన పద్దతుల్లో తొలగించుకోవడానికి ఓట్స్‌, అరటిపండు బాగా ఉపయోగపడతాయి. ఒక పాత్రలో రెండు టేబుల్‌స్పూన్ల ఓట్స్‌ తీసుకుని అందులో ఒక అరటిపండును గుజ్జుగా చేసి వేయాలి.

Unwanted Hair : అవాంఛిత రోమాలకు ఈజీగా చెక్ చెప్పండి!..

Unwanted Hair (2)

Unwanted Hair : శరీరంపై అవాంఛిత రోమాల సమస్యతో చాలా మంది సతమతమౌతుంటారు. చూసేవారికి ఎబ్బెట్టుగా కనిపిస్తాయన్న ఆలోచనతో ఏంచేయాలో అర్ధంకాక చాలా మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా మహిళలు, చేతులు, కళ్లపై రోమాలు ఉండటానికి ఏమంతగా ఇష్టపడరు. స్లీవ్ లెస్ చేతులు ధరించే వారు రోమాలు బయటకు కనిపిస్తుండటాన్నిచూసి చిన్నబోతుంటారు. అవాంఛిత రోమాలు అందమైన ముఖారవిందానికి ఇబ్బంది కరంగా మారతాయి. వాటిని తొలగించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో లభించే తేనె, పంచదార, పసుపు వంటి పదార్థాలతో అవాంఛిత రోమాల సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

ఒక బౌల్‌లో రెండు టేబుల్‌స్పూన్ల శనగపిండి, రెండు టేబుల్‌స్పూన్ల రోజ్‌ వాటర్‌, ఒక టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం వేసి కలపాలి. ఈ పేస్టును ముఖంపై అప్లై చేసి ఆరనివ్వాలి. తరువాత చేతివేళ్లతో రబ్‌ చేస్తూ తొలగించాలి. వారంలో మూడునాలుగు సార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాల సమస్య తొలగిపోతుంది. ఒకబౌల్‌లో రెండు టేబుల్‌స్పూన్ల పంచదార తీసుకుని అందులో అర టీస్పూన్‌ నిమ్మరసం, కొద్దిగా నీళ్లు వేసి పేస్టులా చేయాలి. అవాంఛిత రోమాలున్న చోట ఈ పేస్టును లేయర్‌లా అప్లై చేయాలి. పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. అవాంఛిత రోమాల సమస్యకు ప్రాచీనకాలం నుంచి ఉపయోగిస్తున్న చిట్కా ఇది.

బొప్పాయిలో పాపైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. అవాంఛిత రోమాలు తొలగించేందుకు ఈ ఎంజైమ్‌ సహాయపడుతుంది. అలాగే పసుపు చర్మసౌందర్యాన్ని పెంపొందిస్తుంది. బొప్పొయి ముక్కలను గుజ్జుగా చేసి అర టీస్పూన్‌ పసుపు వేసి కలపాలి. ఈ పేస్టును అవాంఛిత రోమాలు పెరిగే చోట రాయాలి. కొన్ని నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. ఇరవై నిమిషాలు వదిలేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అవాంఛిత రోమాల సమస్యకు తేనె, పంచదార చక్కగా పనిచేస్తాయి. పంచదార చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. అదే సమయంలో తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చిన్న బౌల్‌లో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, రెండు టేబుల్‌స్పూన్ల పంచదార, ఒక టేబుల్‌స్పూన్‌ నీళ్లు వేయాలి. ఈ బౌల్‌ను 30 సెకన్ల పాటు మైక్రోఓవెన్‌లో పెట్టాలి. ఈ పేస్టును అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి. తరువాత పేస్టుపై ఒక కాటన్‌ క్లాత్‌ పెట్టాలి. కాసేపయ్యాక క్లాత్‌ను వేగంగా తీసేయాలి.

అవాంఛిత రోమాలను సహజసిద్ధమైన పద్దతుల్లో తొలగించుకోవడానికి ఓట్స్‌, అరటిపండు బాగా ఉపయోగపడతాయి. ఒక పాత్రలో రెండు టేబుల్‌స్పూన్ల ఓట్స్‌ తీసుకుని అందులో ఒక అరటిపండును గుజ్జుగా చేసి వేయాలి. ఆ మిశ్రమాన్ని కలిపి పేస్టులా చేసి మర్దన చేస్తున్నట్టుగా ముఖంపై రాయాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

కోడిగుడ్డు తెల్లసొన మృతకణాలను తొలగిస్తుంది. దీనికి కార్న్‌స్టార్చ్‌ను కలిపితే అవాంఛిత రోమాల సమస్య దూరమవుతుంది. ఒక కోడిగుడ్డు తెల్లసొన భాగం తీసుకుని, అందులో ఒక అర టేబుల్‌స్పూన్‌ కార్న్‌ స్టార్చ్‌, ఒక టేబుల్‌స్పూన్‌ పంచదార వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ఒక లేయర్‌లా వేసి పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలో లేయర్‌ను లాగుతూ తీయాలి.

బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కోసి పసుపుధాన్యాలతో కలిపి మెత్తగా రుబ్బాలి. రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. రెండు, మూడు వారాల పాటు ఇలా చేస్తే సమస్య దూరమవుతుంది. పసుపులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని ఆరిన త‌ర్వాత‌ చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద అవాంఛిత రోమాలు తొల‌గిపోతాయి. గోధుమపిండిలో కొద్దిగా పసుపు, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను పైపెదవి మీద రాసి పావుగంట త‌ర్వాత‌ నెమ్మదిగా రుద్దాలి. త‌ర్వాత‌ గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తుంటే సహజంగానే అవాంఛితరోమాలను తొలగించుకోవచ్చు.

ఒక స్పూన్‌ పాలలో ఒక స్పూన్ పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పైపెదవిపై రాసి ఆరిన త‌ర్వాత నెమ్మదిగా రుద్ది చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. శెనగపిండిలో కొంచెం నీళ్లు, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన త‌ర్వాత‌ చేతి వేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. ఇలా చేస్తుండడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. ఒక గిన్నెలో పెరుగు, శెనగపిండి, పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను పై పెదవి మీద రాసి 20 నిమిషాల త‌ర్వాత‌ గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.