Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!

ఒకసారి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వారిలోనే ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపునా, కుడివైపు వస్తే వారికి ఎడమవైపునా మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!

Colon Cancer

Colon Cancer : మనిషి శరీరంలో పెద్దపేగు ప్రాధాన్యత అంతాఇంతాకాదు. జీర్ణవ్యవస్థలో చివరన ఉండే పెద్దపేగు కీలకమైన విధులు నిర్వహిస్తుంది. ఆహారంలోని నీటిని, పొటాషియమ్ వంటి లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించి శరీరానికి అందిస్తుంది. దాంతోపాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపటంలో దోహదపడుతుంది. పెద్దపేగును వైద్యపరిభాషలో కోలన్ అంటారు. సాధారణ నీళ్ల విరేచనాలు మొదలుకొని ప్రమాదకర క్యాన్సర్ల వరకు ఎన్నో సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తాయి. ఇందులో వచ్చే వ్యాధులను ముందుగానే పసిగట్టి సకాలంలో చికిత్స చేయించుకోవటం మంచిది. పెద్దపేగులో క్యాన్సర్‌ వస్తే కొన్ని లక్షణాల ద్వారా ముదుగానే తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పెద్ద పేగు క్యాన్సర్ తో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 50 ఏళ్లు దాటిన తర్వాత విసర్జనలో మార్పులుంటే అనుమానించాలి. మల విసర్జనలో రక్తం పడుతున్నా. మలబద్ధకం తీవ్రంగా ఉన్నా ఆగకుండా నీళ్ల విరేచనాలు అవుతున్నా, తరచుగా కడుపులో నొప్పి ఉన్నపుడు వైద్యులను సంప్రదించాల్సిందే. ఏ మాత్రం అనుమానం ఉన్నా కొలనోస్కోపీ చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్థారణ సమస్యను గుర్తించవచ్చు. మల విసర్జనకు వెళ్లినా ఇంకా మళ్లీ వెళ్లాలని అనిపించడం, క్రమంగా బరువు తగ్గడం, పొట్ట కింది భాగంలో నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ ఎక్కువగా పోతూ ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఒకసారి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వారిలోనే ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపునా, కుడివైపు వస్తే వారికి ఎడమవైపునా మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయం ఉండటం, పీచు పదార్థాలు లేని జంక్‌ఫుడ్, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం పెద్ద పేగు క్యాన్సర్‌కు ముఖ్యకారణంగా వైద్యులు చెబుతున్నారు. గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొలనోస్కోపీ చేయించాలి. ఇది పెద్ద పేగులో క్యాన్సర్‌ ఉందో లేదో తేల్చుతుంది.

కొలొరెక్టల్ క్యాన్సర్‌కు ఉపయోగించే చికిత్సలలో శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కెమోథెరపీ,టార్గెటెడ్ థెరపీ కలయికతో కూడిన చికిత్సలను వైద్యులు అందిస్తారు. పెద్దప్రేగు గోడ లోపల పరిమితంమైన క్యాన్సర్లను శస్త్రచికిత్సతో నయం చేయవచ్చు. అయితే విస్తృతంగా వ్యాపించిన క్యాన్సర్ సాధారణంగా నయం కాదు, జీవిత నాణ్యతను , లక్షణాలను మెరుగుపరిచే దిశగా వైద్యులు తగిన చికిత్సను అందిస్తారు.