కరెన్సీ నోట్లపై కరోనా ఉంటుంది జాగ్రత్త : జేబుల్లో, పర్సుల్లో డబ్బులు ముట్టుకున్నాక చేతులు కడుక్కోండి!

  • Published By: sreehari ,Published On : March 22, 2020 / 12:43 PM IST
కరెన్సీ నోట్లపై కరోనా ఉంటుంది జాగ్రత్త : జేబుల్లో, పర్సుల్లో డబ్బులు ముట్టుకున్నాక చేతులు కడుక్కోండి!

కరోనా వైరస్ ఎక్కడైనా ఉండొచ్చు.. గాల్లోనూ ఏదైనా వస్తువు ఉపరితలాలపై కూడా కరోనా బతికే ఉంటుంది. ప్రతిఒక్కరూ జేబుల్లో పర్సుల్లో కరెన్సీ నోట్లు పెట్టుకుంటుంటారు. ప్రతిరోజు ఎన్నో కరెన్సీ నోట్లు ఎందరో చేతులు మారుతుంటాయి. ఒకరి చేతిలో నుంచి మరొకరికి నోట్లు మారుతుంటాయి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, బయటకు వెళ్లలేదు కదా? అనుకుంటే సరిపోదు.. కరెన్సీ నోట్లపై కూడా ఓ కన్నేసి ఉంచాలని హెచ్చరిస్తోంది ఇండియన్స్ బ్యాంకు అసోసియేషన్ (IBA). కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతుండటంతో ఐబీఏ ఈ దిశగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. కరెన్సీ నోట్లపై కూడా కరోనా వైరస్ ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. 

అందుకే కరెన్సీ నోట్లను ముట్టుకున్నాక ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తోంది. బయటకు వెళ్తే కరెన్సీ లేకుండా పని పూర్తికాదు.. ఏ వస్తువు కావాలన్నా డబ్బులు ఉండాల్సిందే.. పది నోట్ల నుంచి రెండు వేల నోట్ల వరకు ఒకరి చేతుల్లో నుంచి మరొకరి చేతుల్లోకి మారిపోతుంటాయి. ఒకవేళ కరెన్సీ నోట్లు ఇచ్చినవారికి కరోనా వైరస్ ఉండి ఉంటే వారి చేతుల ద్వారా తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉంది.

కరెన్సీ నోట్లను తాకడం లేదా నోట్లను లెక్కపెట్టిన తర్వాత తప్పనిసరిగా చేతులను శానిటైజర్ లేదా ఏదైనా సబ్బుతో 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలని ఐబీఏ సూచిస్తోంది. కరెన్సీ నోట్లను వినియోగించడానికి బదులుగా అందరూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు, పేమెంట్స్, మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవడం ఎంతో ఉత్తమమని ఐబీఏ తమ కస్టమర్లకు సూచిస్తోంది. బ్యాంకు బ్రాంచులకు కస్టమర్లు ఎవరూ వెళ్లొద్దని సూచిస్తోంది. ఫిజికల్ బ్యాంకింగ్/కరెన్సీ కౌంటింగ్/AEPS (ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ) లావాదేవీలకు ముందు తర్వాత కచ్చితంగా ప్రతిఒక్కరూ కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఐబీఏ విజ్ఞప్తి చేస్తోంది. 

కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు బ్యాంకింగ్ అసోయేషన్ Corona Se Daro Na, Digital Karo Na అనే అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అంతేకాదు.. కస్టమర్లు అందరూ కరెన్సీకి బదులుగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ట్రాన్సాక్షన్లకు వినియోగించేలా ప్రోత్సహిస్తోంది. బ్యాంకు సంబంధిత సర్వీసుల్లో ఏదైనా సమస్యలు తలెత్తితే అత్యవసరమైతే తప్పా బ్యాంకు బ్రాంచులను సందర్శించరాదని సూచిస్తోంది. ఎవరైనా కస్టమర్లు బ్యాంకులకు వచ్చిన క్రమంలో బ్యాంకు సిబ్బందిపై కరోనా ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలిపింది. 

అన్ని నాన్ ఎసిన్సియల్ బ్యాంకింగ్ సర్వీసులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆప్షన్లలో RTGS, NEFT వంటి సర్వీసులను బ్యాంకు అకౌంట్ దారులు వినియోగించుకోవచ్చు. అన్ని తమ డిజిటల్ ఛానల్స్ అందరికి నిత్యం అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడూ అప్ టూ డేట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఐబీఏ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను కూడా ఐబీఏ సూచించింది.