Ugadi Pachadi : షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ ఎలాగంటే?

ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం మరియు అశోకకళికా ప్రాశనం గా పిలుస్తారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఔషదంగా ఉగాది పచ్చడిని తినే ఆచారం పూర్వనుండి వస్తోంది.

Ugadi Pachadi : షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ ఎలాగంటే?

Ugadi Pachadi (1)

Ugadi Pachadi : తెలుగు వారి పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్ధానం ఉంది. కొత్త సంవత్సరాదిగా ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది పండుగరోజున పంచాంగ శ్రావణం వినటమే కాకుండా ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడిని రూపొందిస్తారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడి ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడిలో అనేక ఔషదగుణాలు దాగున్నాయి. పచ్చడి తయారీలో బెల్లం, ఉప్పు, వేపపువ్వు, చింతపండు, పచ్చి మామిడి ముక్కుల, మిరపపొడి ఉపయోగిస్తారు. వీటితోపాటు అరటిపళ్ళు, జామకాయలు కూడా వాడతారు.

ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం మరియు అశోకకళికా ప్రాశనం గా పిలుస్తారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఔషదంగా ఉగాది పచ్చడిని తినే ఆచారం పూర్వనుండి వస్తోంది. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఉగాది పచ్చడి తయారీ ;

ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్ధాలు; మామిడికాయ ఒకటి, వేప పువ్వు- 1/2 కప్పు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, కొత్త చింతపండు- 100 గ్రాములు, కొత్త బెల్లం- 100 గ్రాములు , రెండు మిరపకాయలు, ఒక అరటిపండు , చెరకు రసం -1/2 కప్పు, ఉప్పు – సరిపడేంత, తగినన్నినీళ్లు సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం ; ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. అందులో మామిడి కాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. దీంతో ఉగాది పచ్చడి సిద్ధమై పోతుంది. ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత స్వీకరించాలి.