కోర్టుకెక్కిన మహిళ : నా భర్త అతి ప్రేమ భరించలేను.. విడాకులు కావాలి!

భర్త అంటే ఇష్టం లేదా అంటే ఇష్టమే అంటుంది. అతి ప్రేమ నాకొద్దు అంటుంది. కొట్టడం లేదు.. తిట్టడం లేదని సాకులు చెబుతోంది. 

  • Published By: sreehari ,Published On : August 24, 2019 / 01:11 PM IST
కోర్టుకెక్కిన మహిళ : నా భర్త అతి ప్రేమ భరించలేను.. విడాకులు కావాలి!

భర్త అంటే ఇష్టం లేదా అంటే ఇష్టమే అంటుంది. అతి ప్రేమ నాకొద్దు అంటుంది. కొట్టడం లేదు.. తిట్టడం లేదని సాకులు చెబుతోంది. 

ఆమె భర్త చాలా మంచోడు. అన్నీ తానై ఏ లోటు లేకుండా చక్కగా భార్యను దేవతలా చూసుకుంటున్నాడు. ఏ చిన్న కష్టం వచ్చినా అల్లాడిపోయేవాడు. భార్యకు ఇంట్లో చిన్న పని కూడా చెప్పేవాడు కాదు. ఏ చిన్న పని చేయబోయినా నీకెందుకు ఆ శ్రమ.. నేనున్నానుగా అంటూ చెప్పేశాడు. ఆమె బాధపడితే అతడి కంట్లో నీళ్లు వచ్చేవి. అడగకుండానే అన్ని తెచ్చిపెట్టేవాడు. ప్రతిరోజు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసేవాడు. ఏడాది కాపురంలో ఒకసారి కూడా ఆమెపై కోపడలేదు. భర్త అంటే ఇష్టం లేదా అంటే ఇష్టమే అంటుంది. అతి ప్రేమ నాకొద్దు అంటుంది. కొట్టడం లేదు.. తిట్టడం లేదని సాకులు చెబుతోంది. 

ఎన్నో పూజలు చేస్తే గానీ ఇలాంటి మంచి భర్త దొరికాడని సంబరపడాల్సిందిబోయి పిచ్చితనంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఎంతమంది చెప్పినా వినలేదు. అతి మంచి భర్త నాకొద్దు అంటూ తెగేసి చెప్పేసింది. ఎవరైనా భర్త తాగి ఇంటికి వచ్చి కొడుతున్నాడని, చిత్రహింసలు పెడుతున్నాడని లేదా ప్రతిదానికి తనను అనుమానిస్తూ సూటిపోటు మాటలతో మానసికంగా వేధిస్తున్నాడంటూ చాలామంది భార్యలు విడాకులు కోరడం ఎన్నో విన్నాం. కానీ, యూఏఈలో ఉండే ఈ మహిళ కాస్త డిఫరెంట్. భర్త అందించే అతి ప్రేమ తనకు అక్కర్లేదంటోంది. మంచితనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని చెబుతోంది. 

ఇంత మంచితనాన్ని తాను భరించలేను బాబోయ్ అంటోంది. ఎంత గొడవ పడదామని చూసినా కోపడటం లేదని, గిల్లికజ్జాలు, అలగడం, బతిమిలాడటం వంటి లేకపోవడం తన లైఫ్ చాలా బోరుగా అనిపిస్తుందనే కారణంతో విడాకులు కోసం ఫ్యూజైరహ్ లోని ఓ కోర్టులో అప్పీల్ చేసింది. సాధారణంగా ప్రతి కుటుంబంలో భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం కామన్. అలాంటిది ఏడాది వరకు ఎలాంటి గిల్లికజ్జాలు కూడా లేకుండా సాగిన సంసారాన్ని ఎందుకు ఇలా పాడుచేసుకుంటున్నావంటూ బంధువులు నచ్చచెప్పారు అయినా వినలేదు. విడాకులు కావాల్సిందే అంటూ  పట్టుబట్టింది. మరోవైపు భర్త కూడా తన భార్య తనకు కావాలంటూ కోర్టులో గట్టిగా చెప్పాడు. 

తన భార్య లేకుండా నేను ఉండలేనని, ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమన్నాడు. వీరిద్దరి వాదనలు విన్న కోర్టు జడ్జీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలో అర్థం కాలేదు. భర్త గురించి చెప్పిన ప్రతి విషయంలో అంతా మంచే చెప్పింది. ఎక్కడా కూడా తన భర్తను తప్పుబట్టలేదు. అంత మంచి భర్తను ఎందుకు కాదనుకుంటుందో న్యాయమూర్తికి బోధపడలేదు. వీరిద్దరిని వీడదీసి ఇష్టం లేని జడ్జీ.. మరింత సమయం ఇచ్చారు. అప్పటివరకూ ఈ కేసును వాయిదా వేశారు. ఇలోగా భార్యభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు నెటిజన్లు కూడా ట్విట్టర్ వేదికగా దీనిపై ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.