High Blood Pressure : అధిక రక్తపోటును అదుపులో ఉంచే… యోగాసనాలు

బోర్లా పడుకుని రెండు చేతులూ ముందుకు నిటారుగా చాపాలి. కాళ్లను దగ్గరగానే ఉంచి పాదాల్ని వెనక్కి చాపాలి. అనంతరం కుడికాలు, ఎడమ చేయి తలను శ్వాస తీసుకుంటూ పైకెత్తే ప్రయత్నం చేయాలి.

High Blood Pressure : అధిక రక్తపోటును అదుపులో ఉంచే… యోగాసనాలు

High Bp

High Blood Pressure : ఒకప్పుడు అధిక రక్తపోటు అనేది 40 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో కనిపించేది. అయితే ప్రస్తుతం మారి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయస్సు వారు సైతం అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. దీనిని అదుపులో ఉంచుకునేందుకు వివిధ రకాల చికిత్సలు, మందులు వాడుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే యోగ ఆసానాలు అధిక రక్తపోటును అదుపులో ఉంచటంలో బాగా ఉపకరిస్తాయి. కొన్ని రకాల ఆసనాలను నిత్యం వేయటం ద్వారా అధిక రక్తపోటు సమస్య నుండి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుంది. రక్తపోటునుండి ఉపశమనం కలిగించే యోగాసనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఏకహస్త పాద శలభాసనం ; బోర్లా పడుకుని రెండు చేతులూ ముందుకు నిటారుగా చాపాలి. కాళ్లను దగ్గరగానే ఉంచి పాదాల్ని వెనక్కి చాపాలి. అనంతరం కుడికాలు, ఎడమ చేయి తలను శ్వాస తీసుకుంటూ పైకెత్తే ప్రయత్నం చేయాలి. ఇలా ఐదు నుండి పది సెకన్లు ఉన్న తరువాత శ్వాస వదులుతూ యధాస్ధితి రావాలి. ఇదే విధంగా ఎడమ కాలినీ, కుడిచేతినీ పైకి లేపి చేయాలి. ఇలా మార్చిమార్చి పదిసార్లు చేయాలి. ఈ ఆసనం వల్ల అధిక రక్తపోటు సమస్య సులువుగా అదుపులోకి వస్తుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరం మొత్తం రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.

రుద్రముద్ర ; సుఖాసనం లో నిటారుగా కూర్చుని రెండు చేతుల చూపుడు ఉంగరం వేళ్లను బొటన వేలికి కలపాలి. మధ్య చిటెకెన వేళ్లను నిటారుగానే ఉంచాలి. చేతుల్ని మోకాళ్లపైన ఉంచి కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. నాలుగు నుండి ఐదు నిమిషాల వరకూ ఈ ముద్రలో ఉన్న తరువాత విశ్రాంతి తీసుకోవాలి. ఈ రుద్రముద్రను రోజులో రెండు , మూడుసార్లు చేస్తే మంచిది. దీని వల్ల అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది.

ఏకపాద ధనురాసనం ; బోర్లా పడుకుని ముందుగా కుడికాలిని వెనక్కి మడిచి ఆ కాలి మడమను కుడి చేత్తో పట్టుకోవాలి. తరువాత ఎడమ కాలిని వెనక్కి చాపాలి. అదే సమయంలో ఎడమచేయి ని నిటారుగా ఉండేలా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి , ఎడమ కాలు, కుడి మోకాలు, తలను పైకి లేపాలి. ఈ స్ధితిలో పది నుండి 20 సెకన్లు ఉండాలి. తరువాత శ్వాస వదులుతూ యాధాస్ధితి రావాలి. ఇలా మూడు పర్యాయాలు చేయాలి. ఇదే విధంగా ఎడమకాలితో చేయాలి. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తే అధిక రక్తపోటు సమస్య అదుపులోకి వస్తుంది. ఛాతీ, గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

భుజంగాసనం ; బోర్లా పడుకుని రెండు చేతులు, చాతీ, దగ్గర పెట్టాలి. రెండు కాళ్లను దగ్గరగా ఉంచి చేతుల్ని నేలకు ఆనించాలి. వాటిని ఆసరగా చేసుకుని వ్వాస తీసుకుంటూ తల, భుజాలు పైకి లేపాలి. రెండు కాళ్లను వెనక్కి పైకి మడవాలి. ఈ స్ధితిలో పది నుండి 20 సెకన్లు ఉండాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా యథాస్ధితికి రావాలి. ఈ ఆసనాన్ని మూడుసార్లు చేయాలి. అధిక రక్తపోటు సమస్యతోపాటు గుండెకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కొవ్వు సులభంగా కరుగుతుంది.

గమనిక ; ఈ ఆసనాలు వేశాక వెంటనే లేవటం వంటివి చేయకూడదు. విశ్రాంత స్ధితిలో ఉండి మూడు నిమిషాలు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఆతరువాత మెల్లగా పైకి లేవాలి. యోగా శిక్షకుల పర్యవేక్షణలో వారి సూచనల మేరకు ఈ ఆసనాలు వేయటం మంచిది.