ఏపీలో మరో ప్రేమోన్మాదం.. పెళ్లి చేసుకోమన్న పాపానికి ముక్కలుగా నరికేశాడు, రెండేళ్ల తర్వాత వెలుగులోకి హత్యోదంతం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Lover kills woman: ప్రేమన్నాడు.. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమన్న పాపానికి కిరాతకంగా కడతేర్చాడు. పక్కా ప్లాన్‌ ప్రకారం హతమార్చి… ఆధారాల్లేకుండా చేశాడు. పోలీసులకు చిక్కకుండా రెండేళ్లు ఎంజాయ్‌ చేశాడు. చేసిన నేరం ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందేగా.. ఇక్కడ అదే జరిగింది. ఖాకీల వలకు చిక్కాడు. మరి పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు..? ఏ ఆధారాలతో అతడే హంతకుడని తేల్చారు..?

పెళ్లి చేసుకోమన్న పాపానికి ఉన్మాది చేతిలో బలి:
మరో ప్రేమోన్మాదం.. పెళ్లి చేసుకోమన్న పాపానికి ముక్కలుగా నరికేశాడు.. మూడో కంటికి తెలియకుండా తగలబెట్టేశాడు.. రెండేళ్ల తర్వాత వెలుగులోకి హత్యోదంతం.. పోలీసుల అదుపులో ఉన్మాది కరీమ్..
గుంటూరులో వెలుగు చూసిన దారుణం.. ఏపీలో సంచలనం రేపిన విజయవాడ, విశాఖ.. ప్రేమోన్మాద ఘటనలు మరవకముందే…గుంటూరులో మరో ప్రేమోన్మాదం వెలుగు చూసింది. ఇక్కడ పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఓ యువతి…ఉన్మాది చేతిలో బలైంది. 2018లో జరిగిన ఈ దారుణం…ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2009లో చదువుకునే రోజుల్లో ప్రేమ.. శారీరకంగా దగ్గరైన కరీం, నజీమా బేగం:
అల్లీనగర్‌ లో నివాసం ఉండే కరిముల్లా కుమార్తె షేక్‌ నజీమా బేగం బీటెక్‌ చదివి ఇంటి దగ్గరే ఖాళీగా ఉండేది. అదే ప్రాంతానికి చెందిన షేక్‌ కరీమ్‌ అలియాస్‌ నాగూర్‌తో నజీమా బేగం ప్రేమలో పడింది. వీరిద్దరికి చదువుకునే రోజుల్లో 2009లో పరిచయం..ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ..ఏదో కారణంతో దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ దగ్గరయ్యారు. ఆ క్రమంలోనే శారీరకంగా కూడా దగ్గరయ్యారు. తరచూ పాత గుంటూరులోని ఓ రూమ్‌లో ఇద్దరు కలుసుకునేవారు.

పెళ్లి ఒత్తిడి చేయడంతో చంపేయాలని నిర్ణయం:
సీన్‌కట్‌ చేస్తే…కొద్ది రోజులకు తనను పెళ్లి చేసుకోమని నజీమా బేగం…ప్రియుడు కరీంను కోరింది. రేపు..మాపంటూ…తన సంబంధాన్ని కొనసాగించాడు కరీం. అయితే రాను రాను..నజీమా బేగం నుంచి పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి పెరిగింది. వెంటనే పెళ్లి చేసుకోవాలని, లేదంటే..మన మధ్య ఉన్న సంబంధాన్ని బయట పెడతానని బెదిరించింది. దీంతో నజీమా బేగం అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు కరీం. ఎప్పటిలాగే  2018 మే 25న నజీమాబేగం, కరీం…ఇద్దరూ రూమ్‌కు వెళ్లారు. అనంతరం కాసేపు ఏకాంతంగా గడిపారు. అక్కడ మళ్లీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. అప్పటికే చంపేయాలనే ప్లాన్‌ వేసిన కరీం…నజీమా బేగంను బలంగా గోడకేసి కొట్టాడు. సృహ కోల్పోయిన తరువాత గొంతు నులిమి చంపేశాడు.

మృతదేహాన్ని ముక్కలు చేసి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసి, రెండు రోజుల తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పు:
నజీమా బేగంను హత్య చేసిన తర్వాత..ఆ రాత్రి వరకు మృతదేహాంతో అక్కడే ఉన్నాడు కరీం. అనంతరం గోడలను కట్‌ చేసే మిషన్‌తో శరీర భాగాలను ముక్కలు చేశాడు. ముక్కలు చేసిన డెడ్‌బాడీని ఓ సంచిలో పెట్టాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. మళ్లీ రెండు రోజల తర్వాత వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టాడు.

కరీంను విచారించగా వెలుగులోకి ప్రేమోన్మాదం:
బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన కూతురు తిరిగిరాకపోవడంతో…ఆమె తల్లిదండ్రులు అన్నీ చోట్ల గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో అదే ఏడాది జూన్‌ 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించినా…ఆచూకీ లభించ లేదు. ఇదిలా ఉంటే..నజీమా బేగం అదృశ్యమైన కొద్ది రోజులకు…ఓ మహిళ డెడ్‌బాడీ లభ్యమైంది. ఆ డెడ్‌బాడీ డీఎన్‌ఏను..నజీమా బేగం తల్లిదండ్రుల డీఎన్‌ఏతో సరిపోల్చారు. డీఎన్‌ఏ మ్యాచ్‌ అయ్యింది. ఇలా ఓవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే హత్య నాటి నుంచి పరారీలో ఉన్న కరీం…ఇటీవల మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. నవంబర్ 4న రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో కరీంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం తమదైన స్టైల్‌లో విచారించగా కరీం ప్రేమోన్మాదం వెలుగులోకి వచ్చింది.

అదృశ్యమైందనుకున్న కూతురు హత్యకు గురైందన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రేమ పేరుతో ప్రాణాలు తీసిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను వేడుకున్నారు. మొన్న విజయవాడ..నిన్న విశాఖ…తాజాగా గుంటూరు.. ప్రేమోన్మాద ఘటనలు సంచలనంగా మారాయి. ప్రేమ ముసుగులో ప్రాణాలు తీస్తున్న ఈ కిరాతకులను కఠినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.

Related Tags :

Related Posts :