Madhya Pradesh Man Who Threw A Feast For 1,500 Tests Coronavirus+

దారుణం, 1500మందికి విందు ఇచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి 1500మందికి భోజనాలు పెట్టించాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కరోనా బారిన పడ్డాడు. ఆ వ్యక్తితో పాటు అతడి కుటుంబసభ్యులు 11మందికి కరోనా సోకింది. ఇప్పుడీ న్యూస్ సంచలనంగా మారింది. విందుకు హాజరై భోజనాలు చేసిన బంధుమిత్రులు, కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. తమకూ కరోనా సోకుతుందేమో అనే అనుమానంతో కూడిన భయంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేనా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి మరణించడంతో మార్చి 20న దశ దిన కర్మ జరిపించాడు. ఆ రోజు 1500మందికి భోజనాలు పెట్టించాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తికి కరోనా సోకిన విషయం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన అధికారులు విందు ఇచ్చిన ప్రాంతం మొత్తాన్ని సీల్ చేశారు. ఆ ప్రాంతం కరోనా హాట్ స్పాట్ గా మారకుండా చర్యలు చేపట్టారు. భోజనాలు పెట్టించిన వ్యక్తిని అధికారులు సురేష్ గా గుర్తించారు. సురేష్ దుబాయ్ లో వెయిటర్ గా పని చేస్తాడు. కొన్ని రోజుల క్రితం సురేష్ తల్లి చనిపోయింది. మార్చి 17న సురేష్ తన స్వస్థలం మొరేనా వచ్చాడు. మార్చి 20న కర్మకాండ జరిపించాడు. సామూహిక భోజనాలు పెట్టించాడు. దీనికి బంధుమిత్రులు, కాలనీ వాసులు అంతా కలిసి 1500మంది హాజరయ్యారు.

అయితే, మార్చి 25న సురేష్ కి జ్వరం వచ్చింది. ఓ నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రికి వెళ్లాడు. అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో డాక్టర్లు అతడిని, అతడి భార్యను క్వారంటైన్ లో ఉంచారు. వారి నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపారు. అతడికి, అతని భార్యకు కరోనా సోకినట్టు గురువారం(ఏప్రిల్‌ 2,2020) న బయటపడింది. అలర్ట్ అయిన అధికారులు సురేష్ కుటుంబానికి చెంది 23కి టెస్టులు చేశారు. వారిలో 10మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

”సురేష్ కుటుంబానికి చెందిన 23మంది శాంపుల్స్ ల్యాబ్ కి పంపారు. వారి రిపోర్టులు శుక్రవారం వచ్చాయి. అందులో 10మందికి (8మంది మహిళలు) కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. 12మందిని ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉంచాము. నెగిటివ్ వచ్చిన వారందరిని 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంచాము. వీరంతా మొరేనా జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు” అని మెరేనా చీఫ్ మెడికల్ ఆఫీసర్ బండిల్ చెప్పారు.

సురేష్ దుబాయ్ నుంచి వచ్చినప్పుడు అతడిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. కాగా మొరేనాకు వచ్చే ముందు తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సురేష్ చెప్పాడు. దుబాయ్‌ నుంచి బయల్దేరేముందే అతనికి వైరస్‌ సోకిందని డాక్టర్లు అంటున్నారు. ఇక సురేష్ భోజనాలు ఏర్పాటు చేసిన కాలనీ మొత్తాన్ని సీజ్ చేసిన అధికారులు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు.

READ  ఆ రోజుకి ఒక్క కరోనా కేసు కూడా ఉండదు: స్టడీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3వేల 108 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 90 మంది మరణించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 500మంది కరోనా బారిన పడ్డారు. మధ్యప్రదేశ్ లో 150 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌ ఉదంతం ‍మరువకముందే మధ్యప్రదేశ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకోవడం కలకలం రేపింది. విందుకు హాజరైన 1500మందిలో ఇంకా ఎంతమందికి కరోనా సోకిందో అనే ప్రశ్న ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Related Posts