నేను ట్రంప్‌ను కాదు.. ప్రజలు బాధపడుతుంటే చూడలేను : మహారాష్ట్ర సీఎం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కాదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శివసేన అధికారపత్రిక “సామ్నా” కోసం పార్టీ ఎంపీ, సామ్నా ఎడిటర్‌ సంజయ్ రౌత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా త్వరలో వెల్లడి కానుంది. ఈ కార‍్యక్రమానికి సంబంధించిన టీజర్ వీడియోను సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ఖాతాలో బుధవారం పోస్టు చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

ఎలాంటి భయం లేదా ఏ ప్రయోజనాలు ఆశించని విధంగా తన నిర్ణయాలు ఉంటాయని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలకు ఎదురవుతున్న కష్టాల గురించి తనకు తెలుసని, అయితే కరోనాతో వారు బాధపడటం తాను చూడలేనని అన్నారు. మహారాష్ట్ర ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. సందర్భంపై పూర్తి స్పష్టత లేనప్పటికీ లాక్‌డౌన్‌ ఎత్తివేత, పాపులర్‌ “వడా పావ్” ముంబై వీధుల్లో మళ్లీ ఎప్పుడు లభిస్తుందని సంజయ్ రౌత్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ఇలా స్పందించినట్టు భావిస్తున్నారు.

లాక్‌డౌన్‌ ఆంక్షల అమలులో కొన్ని మినహాయింపులున్నప్పటికీ లాక్‌డౌన్‌ ఇప్పటికీ కొన్నిచోట్ల కొనసాగుతోందన్నారు. సచివాలయానికి తరచుగా వెళ్లకపోవడంపై వస్తున్న విమర్శలను సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు. కరోనా సంక్షోభ సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు.

కాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్-19 మహమ్మారిని నిలువరించడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కఠినమైన ఆంక్షల అమలు, నిబంధనల ఎత్తివేతలో సరిగ్గా వ్యవహరించని కారణంగానే, రెండవ దశలో కూడా కరోనా విజృంభించిదన్న ఆరోపణలు ట్రంప్‌ సర్కార్‌పై వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Related Posts