లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

తిరుపతిలో రాజకీయ వేడి..లోక్‌సభ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల దృష్టి

Published

on

Tirupati Lok Sabha by-election : తిరుపతిలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఉప ఎన్నికలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అటు …తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి ఏపీలో సత్తా చాటాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది….ఒకప్పుడు కంచుకోటగా ఉన్న స్థానాన్ని..మళ్లీ కైవసం చేసుకుని…పార్టీకి మళ్లీ పునర్‌వైభవం తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా అన్ని పార్టీలు ఉప ఎన్నికపై దృష్టిసారించడంతో…తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ప్రజాప్రతినిధి మరణిస్తే….ఉప ఎన్నికలో పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాటించడం లేదు. అన్ని పార్టీలూ ఉప ఎన్నికల బరిలో నిలస్తున్నాయి. తిరుపతిలోనూ ఉప ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఎన్నిక జరిగే అవకాశం లేకపోయినప్పటికీ…ఇప్పటి నుంచే పార్టీలన్నీ గెలుపు లెక్కల్లో మునిగిపోయాయి.సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ అందరికన్నా ముందుగా ఉప ఎన్నిక అభ్యర్ధిని ప్రకటించి షాకిచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మళ్లీ బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు. పనబాక బీజేపీలో చేరతారని, ఆ పార్టీ తరపున తిరుపతి నుంచి పోటీచేస్తారని జరుగుతున్న ప్రచారానికి ఈ ప్రకటనతో తెరపడింది. టీడీపీ అభ్యర్ధిని ప్రకటించిన కొన్ని రోజులకే అధికార వైసీపీ కూడా అనూహ్యంగా ఉప ఎన్నిక బరిలో కొత్త అభ్యర్ధిని నిలుపుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.సిట్టింగ్ ప్రజా ప్రతినిధి చనిపోతే…వారి కుటుంబ సభ్యులకు ఆ టికెట్ ఇవ్వడం సహజం. అలాగే తిరుపతి టికెట్ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్‌ చక్రవర్తికి వస్తుందని అందరూ భావించారు. కానీ కళ్యాణ్‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి….తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తికి టికెట్ కేటాయించారు సీఎం జగన్‌. పాదయాత్ర నుంచి సీఎం వెంట ఉండడంతో పాటు…గురుమూర్తిది శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం..మన్న సముద్రం గ్రామం కావడం..ఆయనకు కలిసి వచ్చింది.ఇక తిరుపతి ఉప ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది బీజేపీ. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినట్టుగానే…ఏపీలో తిరుపతి ఎంపీ స్థానంలో గెలుపొంది….పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మిత్రపక్షమైన జనసేన తిరుపతి టిక్కెట్ కోసం పట్టుబడుతున్నప్పటికీ….బీజేపీ.. సొంత అభ్యర్ధిని పోటీలో నిలబెట్టడానికే ఆసక్తి చూపుతోంది. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కపోయినప్పటికీ…ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో కాషాయ జెండాను రెపరెపలాడించడం…అంత కష్టం కాదన్నది బీజేపీ అభిప్రాయం.అభ్యర్ధి విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ..కొంతమంది రిటైర్డ్‌ ఉన్నతాధికారుల పేర్లను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఉప ఎన్నికపై కాంగ్రెస్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. గతంలో అనేకసార్లు చింతామోహన్ ఇక్కడి నుంచి గెలిచారు. ఆయన కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఆయన్నే ఉప ఎన్నిక అభ్యర్ధిగా బరిలోకి దించి గెలుపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. తిరుపతిలో గెలిస్తే….ఏపీలో మళ్లీ పార్టీకి పునరుత్తేజం వస్తుందన్నది ఆ పార్టీ నేతల ఆశ.తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అయితే వైసీపీ ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అది తమ గెలుపుకు దోహదపడుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అన్ని పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలతో తిరుపతిలో రాజకీయ సందడి ఊపందుకుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *