సొంతూరికి వెళ్లేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన ఘనుడు

Man flees with RTC bus from Dharmavaram depot

అనంతపురం జిల్లా ధర్మవరం డిపోలో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సు(ఏపీ02జెడ్ 0552)ను ఓ వ్యక్తి చోరీ చేయడం సంచలనం రేపింది. ఆ వ్యక్తి పట్టపగలే ఆర్టీసీ బస్సుని తీసుకెళ్లిపోయాడు. అయితే సిబ్బంది చూడటం, పోలీసులకు సమాచారం ఇవ్వటం, వెంటనే వారు పట్టుకోవటం జరిగిపోయాయి. ఆర్టీసీ బస్సు తిరిగి దొరికింది. అయితే ఆ వ్యక్తి ఆర్టీసీ బస్సుని ఎందుకు ఎత్తుకెళ్లాలని చూశాడో తెలిసి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అతడి చెప్పిన సమాధానం విని నవ్వాలో ఏడ్వాలో తెలియన పరిస్థితి తలెత్తింది. సొంతూరికి వెళ్లేందుకు నడిచే ఓపిక లేక ఇదిగో ఇలా ఏకంగా ఆర్టీసీ బస్సునే తీసుకెళ్లిపోయాడు ఆ ప్రబుద్దుడు.

సొంతూరికి వెళ్లేందుకు బస్సు చోరీ:
ధర్మవరం డిపోలో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సుని శుక్రవారం(మే 22,2020) మధ్యాహ్నం ముజామిల్‌ఖాన్‌ అనే వ్యక్తి తీసుకెళ్లిపోయాడు. విషయాన్ని సెక్యూరిటీ కానిస్టేబుల్‌ సుష్మ గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమైంది. బస్సు ఆచూకీ కనిపెట్టే పనిలో పడింది. మామిళ్లపల్లి మీదుగా జాతీయ రహదారిపై బస్సు వెళుతున్నట్లు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా ఆర్టీసీ సిబ్బంది గుర్తించి పోలీసులకు తెలియజేశారు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ రమేష్‌బాబు సిబ్బందితో కలసి బస్సును వెంబడించారు. కియా పరిశ్రమ దగ్గర ఎర్రమంచి పోలీసులను అప్రమత్తం చేయడంతో జాతీయ రహదారిపై ఎస్‌ఐ గణేష్‌ కంటెయినర్‌ వాహనాలను అడ్డు పెట్టించారు.

పోలీసుల ఎంట్రీతో దొరికిపోయిన నిందితుడు:
దీంతో ముందుకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ముజామిల్‌ఖాన్‌ బస్సు నిలిపి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని పట్టుకున్నారు. ధర్మవరం పట్టణ ఎస్‌ఐ జగదీష్‌కు అప్పగించారు. కర్ణాటకలోని విజయపురకు చెందిన నిందితుడు తాగిన మత్తులో ఉన్నాడని, సొంతూరికి వెళ్లేందుకు బస్సు తీసుకెళ్లేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ భోజనానికి వెళ్లగా తీసుకెళ్లిపోయాడన్నారు. దాదాపు 40 కిలోమీటర్ల దూరం వరకు బస్సుని తీసుకెళ్లాడు.

నడిచే ఓపిక లేక ఆర్టీసీ బస్సు చోరీ:
ఏదో పని మీద అతడు ధర్మవరంలో ఉండే బంధువుల ఇంటికి వచ్చాడు. లాక్ డౌన్ కారణంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో సొంతూరికి ఎలా వెళ్లాలో అతడికి అర్థం కాలేదు. అదే సమయంలో మందు తాగాడు. అలా కొంత దూరం నడిచాడు. కాళ్లు లాగడం మొదలు పెట్టాయి. నడవలేని పరిస్థితి వచ్చింది. కాగా, ఖాన్ కు బస్సు డ్రైవింగ్ వచ్చు. ఇంకేముంది ఏకంగా ఆర్టీసీ బస్సునే తీసుకెళ్లిపోదామని ప్లాన్ వేశాడు. ఆర్టీసీ బస్సు కనుక ఎవరూ ఆపరని ప్లాన్ వేసి మరీ ఇదిగో ఇలా బస్సు తీసుకెళ్లిపోయాడు. కట్ చేస్తే.. ప్లాన్ ఫెయిల్ అయ్యింది. పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నువ్వు గొప్పోడు సామీ అని జనాలు కామెడీ చేస్తున్నారు.

Read: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తేసిన ఏపీ హైకోర్టు

మరిన్ని తాజా వార్తలు