సుశాంత్ ఘటన మరువక ముందే, మరో యువ నటుడు ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే(32) ఉరివేసుకుని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం(జూలై 29,2020) సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్‌లో తన ఇంట్లోనే అశుతోష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అశుతోష్ భక్రే.. భకార్, ఇచర్ థార్లా పక్కా చిత్రాల్లో నటించాడు. అతడి భార్య మయూరి కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. ఆమె పలు మరాఠీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

అశుతోష్ భక్రే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది తెలియాల్సి ఉన్నది. కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని.. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని సన్నిహితులు భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అశుతోష్ నెల రోజుల క్రితమే నాందేడ్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో కొందరు, మానసిక ఒత్తిడిని జయించలేక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన అందరినీ కలిచివేసింది. అది మరువకముందే మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకోవడం బాధించింది. సినీ ప్రపంచం రంగుల లోకం. తెరపై నటీనటులు ఎంతో ఆనందంగా కనిపిస్తారు. వారి లైఫ్ రంగులమయంగా అనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో తెర వెనుక నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. అవకాశాలు రాక డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. కొందరు మనో ధైర్యంతో సమస్యలను అధిగమిస్తే, మరికొందరు అది చేతకాక ఈ లోకాన్నే విడిచి వెళ్తున్నారు.

Related Posts