ఇంజనీరింగ్‌కాలేజీల్లో గంజాయి మాఫియా దందా : గంజాయి మత్తుకు అలవాటు పడుతున్న విద్యార్థులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏజెన్సీ ప్రాంతాల్లో అంతరపంటగా సాగవుతున్న గంజాయి.. అంతరాష్ట్రాలకు తరలిపోతోంది. గుట్టుగా గుప్పుమంటున్న గంజాయి క్యాంపస్‌లోకి చొరబడుతోంది. ఇంటర్మీడియట్‌ ఆ పైస్థాయి విద్యార్థులను మత్తులో ముంచెత్తుతోంది. కొన్ని ఇంజనీరింగ్‌కాలేజీల్లో జోరుగా గంజాయి మాఫియా దందా సాగిస్తోంది. గంజాయి దమ్ము కొడుతున్న ప్రతి వంద మందిలో 70 మంది విద్యార్థులే. ఎక్సైజ్‌ఎన్‌ఫోర్స్‌మెంటులోని ఓ విభాగం గంజాయి వినియోగంపై నిర్వహించిన సర్వేలో వెల్లడైన చేదు నిజాలివి. గంజాయి మత్తుకు అలవాటు పడుతున్న విద్యార్థులు క్రమంగా డ్రగ్స్‌వైపు మళ్లుతున్నారని ఈ సర్వేలో తేలింది. ప్రస్తుతానికి కాలేజీలు బంద్‌ ఉన్నప్పటికీ వాళ్లు కోరుకున్న చోటికి గంజాయి వచ్చేస్తుందట.

గంజాయి వాడుతున్న ప్రతి వంద మందిలో 70 మంది విద్యార్థులు, 10 మంది సాఫ్ట్‌వేర్‌ఉద్యోగులు, మిగిలిన వారిలో ఆటో రిక్షా, భవన నిర్మాణ కార్మికులు, జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారన్నది సర్వే సారాంశం. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే రోజుకు 150 కిలోల గంజాయి వినియోగం జరుగుతున్నట్టు తెలుస్తోంది. శివారుల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో గంజాయి వినియోగం భారీగా ఉండేదని సమాచారం. క్యాంపస్‌లోనే ప్రధాన అడ్డాల్లోనూ గంజాయి గుప్పుమంటోంది. నగరానికి వస్తున్న నైజీరియా లాంటి ఆఫ్రికన్‌ దేశాల విద్యార్థుల నుంచి ఈ అలవాటు క్రమంగా తెలుగు విద్యార్థులకు పాకుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి.

గతంలో సిగరెట్‌లో పొగాకు తీసేసి ఖాళీ గొట్టంలో గంజాయి పొడి నింపి పీల్చేవాళ్లు. అయితే ఇది కొంచెం లేట్ ప్రాసెస్‌. పొగాకు బయటకు తీసే క్రమంలో పక్కవాళ్లు పసిగట్టే అవకాశం ఉంది. దీంతో జాయింట్‌ కాగితం ముక్కలు వచ్చాయి. ఇవి వోసీబీ స్లిప్‌పేరుతో మార్కెట్‌లోకి వచ్చాయి. విద్యార్థులు వీటిని జాయింట్‌ అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ స్లిప్స్‌లో గంజాయిని చుట్ట చుట్టి సిగరెట్‌ తరహాలోనే కాల్చి దమ్ము కొడుతున్నారు. కాలేజీల చుట్టూ ఉన్న పాన్‌షాపు, పుస్తకాల దుకాణాల్లో ఈ స్లిప్స్‌ దొరుకుతున్నాయి. వాస్తవానికి ఇవి గంజాయి విక్రయాల అడ్డాలు కూడా. ఇక్కడినుంచే కాలేజీలకు, హోటళ్లకు సప్లయ్ అవుతుంటాయి. 10 గ్రాముల గంజాయి 300 నుంచి 700 వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కల్లోలంతో పోలీసులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో దర్జాగా తమ దందా సాగిస్తోంది గంజాయి మాఫియా.

ఏజెన్సీ ప్రాంతాల్లో పండే గంజాయి సిటీదాకా రావడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనుక చాలా గ్యాంగ్‌లు పనిచేస్తుంటాయి. పంట వేసేందుకు అడ్వాన్స్‌లు ఇవ్వడం.. పంటలను ఇంటికి తీసుకెళ్లడం.. అక్కడ పవర్‌ఫుల్‌గా ప్యాకింగ్‌ చేయడం.. ఆపై వాహనాలు సిద్ధం చేయడం.. అక్కడినుంచి వాహనాల్లో గంజాయి తరలించడం. ఇవన్నీ మూడోకంటికి తెలియకుండా చాలా సీక్రెట్‌గా నిర్వహిస్తారు. కుదిరితే హైవేలపై లేదంటే అడ్డదారుల్లో గంజాయిని తరలిస్తారు. ఇది కూడా మామూలుగా ఉండదు. ఎస్కార్ట్‌లా ముందు మరో వాహనం వెళ్తుంది. చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు, పోలీసుల నిఘా ఎలా ఉందో ఎప్పటికప్పుడు వెనకాల వచ్చే వాళ్లకు సమాచారం చేరవేస్తుంటారు. ఏమాత్రం అనుమానం వచ్చినా సైడ్‌ అయిపోవాలని సిగ్నల్స్‌ ఇస్తారు. ఇదీ గంజాయి మాఫియా మోడస్ ఓపెరాండి.

వాహనాల్లో వెళ్లే వాళ్లంతా పాత్రధారులే. సూత్రధారులంతా ఎక్కడో ఉంటారు. వీళ్ల మధ్య క్విడ్‌ ప్రో కో వ్యవహారం నడుస్తుంది. మీకేం కావాలి.. మాకేం ఇస్తామన్న డీలింగ్స్ ఉంటాయి. వాహనం స్టార్ట్ అయినప్పటి నుంచి సరుకు అప్పగించే వరకు చాలా చాకచాక్యంగా వ్యవహరిస్తారు. ఒకవేళ మధ్యలో పట్టుబడితే సరుకు అక్కడే వదిలేసి పారిపోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో పట్టుబడితో ఎలాంటి సమాచారం పోలీసులకు చెప్పొద్దనే కండిషన్స్ విధిస్తారు. అలాగని వాళ్లను వదిలేయరు. బయటకు తీసుకొచ్చేలా అరెంజ్‌మెంట్స్‌ చేస్తారు. వచ్చాక రిస్క్‌కి తగ్గట్టు రేట్‌కూడా ఫిక్స్‌ చేసి ముట్టజెబుతారు.

పల్లె నుంచి పట్నం వచ్చే గంజాయి గంటల వ్యవధిలోనే అడ్డాలకి చేరిపోతుంది. దీని వెనుక డీలర్‌ వ్యవస్థ యాక్టివ్‌గా పనిచేస్తుంది. డీలర్లే విశాఖ, నారాయణఖేడ్‌, ఆదిలాబాద్‌జిల్లాల నుంచి గంజాయి తెప్పిస్తారు. ఒక్కో డీలర్ దగ్గర 15 నుంచి 20 మంది వర్కర్లు ఉంటారు. వీళ్ల స్థాయిని బట్టి జీతం.. లేదంటే కమీషన్‌ ఇస్తుంటారు. మెయిన్‌ డీలర్లు సేలింగ్‌ పాయింట్‌కు గంజాయి సరఫరా చేస్తుంటారు. ధూల్‌పేట, శంషాబాద్, ఆరాంఘర్, అత్తాపూర్‌, లంగర్‌హౌస్, టోలీచౌకీ, గోల్కొండ, నానల్‌నగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గంజాయి విక్రయ స్థావరాలున్నాయి. గంజాయి కూడా కొత్త వ్యక్తులకు విక్రయించరు. పాత పరిచయాలు, తెలిసినవాళ్లకే అమ్ముతుంటారు. స్పాట్..

లాక్‌డౌన్ పిరియడ్‌లోనూ వీళ్ల దందా ఆగలేదంటే.. గంజాయి మాఫియా ఎంత న్యాక్‌గా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌.. బ్రోకర్ల వ్యవస్థతో సప్లయ్ పక్కన పెడితే.. అసలు మూలాలపై పోలీసులు దెబ్బ తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు వేసే పంటలపై నిఘా పెట్టడంతో పాటు అసలైన సూత్రధారుల్ని అరెస్ట్‌ చేయాలనే వాదనలు ఉన్నాయి. పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది చూడాలి.

Related Tags :

Related Posts :