Megastar Chiranjeevi Speech In ANR National Award Function

ఆ గర్భవతి మా అమ్మే.. కడుపులో ఉన్నది నేనే – చిరంజీవి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సినిమా రంగంలో ఎవరి పట్ల ఎలా ఉండాలి..ఎలా మెలగాలి అనే విషయాలు..క్రమశిక్షణగా మెలుగుతున్నానంటే..దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు అని..ఆయన తనకు గురుతుల్యులు అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మాట్లాడుతుంటే..తాను ఏమి మాట్లడ లేకపోయానని, అంత మహానుభావుడితో తనకు సత్సంబంధం ఏర్పడడం గొప్ప అవకాశమన్నారు.

మానసికంగా..శారీరకంగా ఎంతో ధృడమైన వ్యక్తి అని కొనియాడారు. 2019, నవంబర్ 17వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. 2018, 2019 సంవత్సరానికి గాను శ్రీదేవి, రేఖలకు ఈ అవార్డులు బహుకరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ..దివంగత శ్రీదేవి, రేఖలకు అవార్డు రావడం గొప్ప విషయమని, అవార్డు ఫంక్షన్‌కు హాజరు కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవకాశం కల్పించిన నాగార్జున కుటుంబానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. 

శ్రీదేవి మరణం ఎంతో బాధించిందని, ఇది నిజం కాకపోతే మంచిగా ఉంటే బాగుండేదేమోనని అనిపిస్తుందన్నారు. ఆమె మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. 
అందం..అభినయం ఉన్న నటి రేఖ..ఆమె చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రేఖ కూడా సభ్యురాలిగా ఉండేదన్న విషయాన్ని గుర్తు చేశారు. 

ఈ సందర్భంగా 1955లో జరిగిన ఘటన గురించి సభకు తెలియచేశారు చిరు. ‘పల్లెటూరు..కొత్తగా పెళ్లయిన జంట..ఆమె అప్పటికే గర్భవతి..నవమాసాలు నిండాయి..ఈ సమయంలో ఆమె అభిమాన నటుడి సినిమా విడుదలైంది. వెళ్లి చూడాలి అనుకుంది..తన కోరికను భర్తకు చెప్పింది. ఆ యువకుడు..సరే అన్నాడు..ఆరు కిలోమీటర్లు టౌన్‌కు వెళ్లాలి..అప్పటికీ రవాణా సౌకర్యం లేదు. గతుకుల రోడ్డు మీద జట్కా మీద వెళ్లారు. ఆ సమయంలో అడ్డంగా ఎద్దులు రావడంతో జట్కా బండి కిందపడిపోయింది. ఆ జంట కూడా కిందపడిపోయింది. తన భార్యకు ఏమైందోనన్న ఆ భర్తలో ఆందోళన కనిపించింది. అయినా..సరే సినిమా చూశారు. ఆనందంగా ఇంటికి వచ్చారు.’ ఇది కథ కాదు నిజం.

ఇందులో గర్భిణీ స్త్రీ ఎవరో కాదు. అమ్మ అంజలీ దేవి. ఆ యువకుడు నాన్న వెంకట్రావు. పల్లెటూరు మొగల్తూరు. 1955లో ఈ ఘటన జరిగింది. ఆ సినిమా ‘రోజులు మారాయి’. ఇందులో హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఈయనంటే అమ్మకు అభిమానం’ అని తెలియచేశారు చిరంజీవి. 

అవార్డు ప్రదానోత్సవానికి ప్రముఖులు విచ్చేశారు. వీరికి నాగార్జున కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. శ్రీదేవి భర్త బోనీకపూర్, అవార్డు గ్రహీత రేఖ, నాగార్జున, నాగ సుశీల, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
Read More : ఏఎన్నార్ అవార్డులు : చిరంజీవి ఇంకా 15 ఏళ్లు హీరోగా ఉంటాడు

Related Posts