Home » జగన్ పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారు, చంద్రబాబు విష ప్రచారం ఆపాలి
Published
4 months agoon
By
naveenజగన్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ రైతుల గురించి ఆలోచన చేయని చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే విడ్డూరంగా ఉందన్నారు. చాలా బాధ కూడా వేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు సివిల్ సప్లయ్ కు రావాల్సిన రూ.4వేల కోట్ల నిధులను.. పసుపు-కుంకుమ పేరుతో మళ్లించిన ఘనత చంద్రబాబుది అని మంత్రి విమర్శించారు. అలాంటి వ్యక్తి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు అబద్దాలు చెబుతూ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ మండిపడ్డారు. రైతాంగానికి సంబంధించి ఇప్పటికే రూ.120 కోట్ల దాకా డబ్బు విడుదల చేశామన్నారు. రైతు విషయంలో జగన్ ప్రభుత్వం ఎక్కడా అలసత్వం చూపడం లేదన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కల కనే వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. రైతుకి నష్టం చేసే వ్యక్తి చంద్రబాబు అయి ఉంటాడు.. కానీ.. జగన్ కానే కాదని మంత్రి స్పష్టం చేశారు.
మొద్దు నిద్ర పోతున్నది ప్రభుత్వం కాదు చంద్రబాబే అని మంత్రి అనిల్ విమర్శించారు. చంద్రబాబు పాలనలో వర్షాలు పడేవి కాదని, తీవ్రమైన నీటి ఎద్దడి చూశామన్నారు. అందుకు భిన్నంగా జగన్ పాలనలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
ఏళ్ల తరబడి నీళ్లు చూడని ప్రాంతాల్లోనూ ఇప్పుడు పుష్కలంగా నీరు కనిపిస్తున్నాయని మంత్రి అనిల్ ఆనందం వ్యక్తం చేశారు. నీళ్లు రాక ఇంకిపోయిన రిజర్వాయర్లు సైతం నీటితో కళకళలాడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలని చెప్పడానికి జగన్ నిలువెత్తు నిదర్శనం అన్నారు. జగన్ పరిపాలనకు భగవంతుడి, ప్రకృతి సహకారం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.