నన్నే కేర్ చెయ్యరా? ఆగ్రహంతో రగిలిపోతున్న మంత్రి కన్నబాబు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

minister kanna babu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో ముఖ్యమైన వారిలో కురసాల కన్నబాబు ఒకరు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ అయనకు ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుగా సామాజిక, రాజకీయ అంశాలపై ఉన్న పట్టుతో పాటు బలమైన సామాజికవర్గం నుంచి రావడంతో ఇతర నాయకుల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించడంతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై వేసిన పలు సబ్ కమిటీల్లో కన్నబాబును సభ్యునిగా నియమించారు. దీంతో అటు రాజకీయాలు, ఇటు పరిపాలనతో మంత్రి కన్నబాబు బిజీబిజీగా గడపాల్సి వస్తోంది.

మంత్రి బిజీగా ఉండటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులు:
ఈ నేపథ్యంలో కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఆయన తండ్రి లేదా సోదరుడు పర్యవేక్షించాల్సి వస్తోందని అంటున్నారు. అయితే మంత్రి బిజీగా ఉన్నారు కదా పట్టించుకోరన్న ధీమాయో లేక షాడో ఎమ్మెల్యేలుగా వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనో గానీ స్థానిక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు అయితే మంత్రి కన్నబాబును కానీ ఆయన అనుచరులను కానీ అస్సలు లెక్క చేయడం లేదని నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. విద్యా కమిటీల ఎన్నికల నుంచి జగనన్న విద్యా కానుక వరకు అధికారులు ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

కన్నబాబును లైట్ తీసుకున్న విద్యా శాఖాధికారులు:
రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనతో పాటు వ్యక్తిగత, అనారోగ్య కారణాలతో నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్న కన్నబాబును విద్యా శాఖాధికారులు మరింత తేలిగ్గా తీసుకుంటున్నారట. కన్నబాబు సిఫారసుకు విద్యా శాఖ అధికారులు నో చెప్పడంతో పాటు ఆయన కార్యాలయంతో సంప్రదింపులు జరపకుండా జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని కూడా రూపొందించారని అంటున్నారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం డెమో స్కూల్‌లో ఏర్పాటు చేశారు.

కన్నబాబుకి షాక్ ఇచ్చిన అధికారులు:
ఈ కార్యక్రమం, ప్రొటోకాల్ తదితర విషయాల గురించి మంత్రి కన్నబాబు కార్యాలయాన్ని సంప్రదించకుండా నేరుగా ఆహ్వాన పత్రాలతో విద్యాశాఖ అధికారులు ప్రత్యక్షమయ్యారని చెబుతున్నారు. అధికారుల తీరుతో అవాక్కయిన మంత్రి కన్నబాబు సహాయ నిరాకరణ ప్రారంభించారని చెబుతున్నారు. నాడు-నేడు కార్యక్రమం కింద కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా జిల్లాలో మూడు డెమో స్కూళ్లను సిద్ధం చేయగా అందులో ఒకటైన ఇంద్రపాలెం డెమో స్కూల్‌లో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఒక పండుగలా చేయాలని భావించిన కన్నబాబుకు అధికారులు షాక్ ఇచ్చారని పార్టీలో టాక్‌.

మనస్తాపంతో బాయ్ కాట్ చేసిన కన్నబాబు:
అధికారుల తీరుతో మనస్తాపానికి గురైన మంత్రి కన్నబాబు ఆ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశారని చెబుతున్నారు. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పూర్తిగా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌లతో కలిసి విద్యా శాఖ అధికారులు కార్యక్రమాన్ని మమ అనిపించారట. అధికారుల ఆహ్వానంతో కార్యక్రమానికి వచ్చిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంద్రపాలెం స్కూల్ దగ్గర ఏ హడావుడి కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారని అంటున్నారు.

మంత్రి కన్నబాబు అలక పాన్పు:
స్కూలు లోనికి వెళ్లకుండా బయట నుంచి ఆరా తీసేసరికి మంత్రి కన్నబాబు అలక పాన్పు ఎక్కారని పిల్లి సుభాష్‌కు తెలిసిందని చెబుతున్నారు. దీంతో అటు నుంచి అటే కన్నబాబు దగ్గరికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని టాక్‌. మరోపక్క, మంత్రి కన్నబాబు మధ్యాహ్నం కరప మండలంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం చేపట్టారు. కాకినాడ రూరల్, కరప రెండు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఈ కార్యక్రమం నిర్వాహించారు.

అసంతృప్తితో రగిలిపోతున్న మంత్రి:
నియోజకవర్గ పరిధిలో ఓ మండల అధికారి బదిలీ కోసం చేసిన సిఫారసును జిల్లా విద్యా శాఖ అధికారి తోసిపుచ్చడంతో పాటు విద్యా కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వలేదంటున్నారు. వీటన్నింటికీ తోడు నాడు-నేడు పనులపై జిల్లా కలెక్టర్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంపై మంత్రి కన్నబాబు అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు. తాను ఇతర వ్యవహారాలతో బిజీగా ఉన్నంత మాత్రాన తనను అధికారులు తేలిగ్గా తీసుకుంటే ఎలా అంటూ మండిపడుతున్నారట.

ఆగ్రహంతో ఊగిపోతున్న కన్నబాబు అనుచరులు, నాయకులు, కార్యకర్తలు:
మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తో కార్యక్రమాన్ని ప్రారంభించడంపై కన్నబాబు అనుచరులు, నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యం ఉన్నా నియోజకవర్గంలోని అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. విద్యా శాఖ అధికారుల తీరుతో రచ్చ గెలిచిన కన్నబాబు ఇంట గెలవలేకపోతున్నారంటూ పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రభుత్వ, పార్టీ పెద్దలు దీనికి ఎలా చెక్ పెడతారో వేచిచూడాలి.

Related Tags :

Related Posts :