minister vellam pally srinivas on temples darshans

శఠగోపం, అక్షింతలు, ప్రసాదాలు ఉండవు.. ఆరోగ్యసేతు యాప్ మస్ట్.. ఏపీలో ఆలయాల్లో కొత్త నిబంధనలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జూన్ 8 నుంచి ఏపీలో ఆలయాలు తెరుస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. 8,9 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఆలయాల్లో పని చేసే సిబ్బంది, స్థానికులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. 10వ తేదీ నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామన్నారు. విజయవాడ దుర్గగుడి కంటైన్మెంట్ జోన్ లో లేదన్న మంత్రి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మాత్రం కంటైన్మెంట్ జోన్ లో ఉందన్నారు. ఆలయాలకు వెళ్లే భక్తులు ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని మంత్రి సూచించారు. కచ్చితంగా మాస్క్ లు ధరించాలన్నారు. కరోనా నియమ నిబంధనల ప్రకారమే దర్శనం కల్పిస్తామన్నారు. 

కంటైన్ మెంట్ జోన్లలో ఉండే వారికి ఆలయాల్లోకి అనుమతి లేదు:
కాగా, కరోనా నేపథ్యంలో భక్తులు ఎక్కువ మంది ఒకేసారి దర్శనాలకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. స్లాట్ ప్రకారమే దర్శన అవకాశం ఇస్తామన్నారు. ఆన్ లైన్ లో దర్శనం టికెట్స్ తీసుకోవాలన్నారు. పదేళ్ల లోపు పిల్లలు, వృద్దులు ఆలయాలకు రావొద్దని మంత్రి కోరారు. కేశఖండన శాలలో పని చేసే వారికి మరింత ఆర్ధిక సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అంతరాలయ దర్శనాలు రద్దు చేశామన్నారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉండే భక్తులకు ఆలయాల్లోకి ప్రవేశం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆలయాల్లో శఠగోపం, ప్రసాదాలు, అక్షింతలు చల్లడం ఉండదని తేల్చి చెప్పారు. దుర్గగుడి లోపలికి 300మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

రెండు నెలల తర్వాత దర్శన భాగ్యం:
కరోనా లాక్‌డౌన్‌తో దాదాపు రెండున్నర నెలలుగా ఆలయాలు మూతపడ్డ సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 5వ దశలో తాజా సడలింపులతో జూన్ 8 నుంచి ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. భక్తులకు దర్శనాలకు అనుమతిస్తారు. భక్తులు భౌతికదూరం పాటిస్తూ గుడిలోని మూలవిరాట్ ను దర్శించుకొని వెళ్లిపోవడమే కొంతకాలంపాటు నిత్యకృత్యం కానుంది. తీర్థప్రసాదాలే కాదు.. చివరకు ఘంటా నాదం, శఠగోప ఆశీర్వచనాలనూ నిర్వహించ వీల్లేని అనివార్య పరిస్థితి ఎదురుకానుంది.

కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం:
సోమవారం(జూన్ 8,2020) నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించడంతో రాష్ట్రంలోనూ ఆలయాల్లో దర్శనాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దండంతో సరిపెట్టుకునేలా నిబంధనలు ఏర్పాటు చేసింది. చాలా కాలం తర్వాత దేవుళ్ల దర్శనం కలుగుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read: నాగబాబు కొత్త డిమాండ్: గుడులు వారి చేతుల్లోనే ఉండాలి

READ  ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. గొడుగులతో క్యూలైన్‌లో వేచి ఉన్న మందుబాబులు

Related Posts