దుర్గ గుడిలో మూడు సింహాలు ఏమయ్యాయో సాయంత్రంలోగా చెబుతాం, మంత్రి వెల్లంపల్లి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బెజవాడ దుర్గగుడిలో వెండి రథంలో మూడు సింహాలు మాయం అయిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) దుర్గ గుడిలో వెండి రథాన్ని మంత్రి పరిశీలించారు. గుడిలో మూడు వెండి సింహాలు మామం అయ్యాయా? అసలేం జరిగింది? అని ఈవో సురేష్ బాబుని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెండి రథంపై ఉండాల్సిన మూడు సింహాలు కనిపించడం లేదని మంత్రి చెప్పారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

రథం సింహాలు మాయం కావడంపై దర్యాప్తు చేయిస్తామన్న మంత్రి వెల్లంపల్లి, సాయంత్రంలోపు వాస్తవాలు వెలికితీస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసినట్టు తేలితే అధికారులపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు.

దుర్గగుడిలోని రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కార్పెట్‌ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించ లేదని మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదన్నారు. ఇది.. గత ప్రభుత్వం హయాంలో జరిగిందో…లేక ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుందని ఆయన చెప్పారు.

ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీకి ఆలయం భద్రత అప్పగించామని… సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతా లోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

”సోషల్ మీడియాలో వచ్చిందేది నమ్మొద్దు. సింహాలు ఏమయ్యాయి అనే దానిపై సాయంత్రానికి కమిటీ వచ్చి చూస్తుంది. వెరిఫై చేస్తుంది. చూసిన వెంటనే తెలుస్తుంది. మూడు వెండి సింహాలు మాయం అయ్యాయి అనేది నిజమే. ఒకవేళ పోయి ఉంటే, ఏజెన్సీపై చర్యలు తీసుకుంటాం. వాస్తవంగా చెప్పాలంటే ఈ రథాన్ని తీసింది గత ప్రభుత్వంలోనే. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు తియ్యలేదు. కవర్ తో కప్పేసి ఉంది. ఇంతవరకు బయటకు తియ్యలేదు. సింహాలు పోయాయా? మరో చోట భద్రపరిచారా? అనేది వెరిఫై చేశాక దానికి సంబంధించిన రిపోర్టుని మీడియాకు ఇస్తాం.

దాని మీద పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. దొంగతనమే అయితే సెక్యూరిటీ ఏజెన్సీ మీద క్రిమినల్ కేసు పెడతాం. దాంట్లో డౌటే లేదు. ఇన్వెస్టిగేషన్ రిపోర్టు రాకముందే ఒక మంత్రిగా నేను చెప్పడం అనేది భావ్యం కాదు. రిపోర్టు వచ్చాకే పూర్తిగా చెబుతాం. ఏదో ఒకటి చెప్పడానికి నేను సోషల్ మీడియా కాదు. చంద్రబాబు మీడియా కాదు. జరిగింది మాత్రమే చెబుతా.

దగ్ధం చేయడం అంటే చంద్రబాబుకి సరదా.. తుని రైలు, దేవుడి రథాల దగ్ధం వెనుకున్నది ఆయనే


ఆలయాలను పరిరక్షించడానికి జగన్ యజ్ఞం చేస్తున్నారు. దాన్ని భగ్నం చేయడానికి చాలామంది రాక్షసులు ఉంటారు. భగ్నాలను ఎదుర్కొని ముందుకి వెళ్తున్నాం. కొంత సమయం కావాలి. ఆలయాల పరిరక్షణ ప్రభుత్వం బాధ్యత. అధికారులు కమిటీ వేస్తారు. కమిటీ రిపోర్టు ఇస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి అనేది నిర్ణయిస్తాం. అమ్మవారికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కానివ్వం” అని మంత్రి వెల్లంపల్లి అన్నారు.

కాగా, వెండి సింహాలు మాయం కాలేదని, రికార్డులు పరిశీలిస్తామని ఆలయ ఈవో సురేష్ బాబు అంటున్నారు. అంతర్వేది ఘటన జరిగింది కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ లు వస్తున్నాయని ఆయన అన్నారు. రికార్డుల పరిశీలన కోసం మూడు రోజుల సమయం కావాలని ఈవో వెల్లడించారు.

READ  డయాలసిస్ రోగులకు రూ.10వేలు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేల పెన్షన్ : సీఎం జగన్

Related Posts