ఎమ్మెల్యే గాంధీ వర్సెస్ కార్పొరేటర్లు.. శేరిలింగంపల్లి టీఆర్ఎస్‌లో గ్రూపు తగాదాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

mla AREKAPUDI GANDHI: అధికార పార్టీ అంటే గ్రూపులు కామన్‌ అయిపోతున్నాయి. అందులోనూ వేరే పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన నాయకులపై ఎప్పటి నుంచో ఉంటున్న లీడర్లకు అసంతృప్తి సహజమే. ఇప్పుడు తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ పార్టీలో అదే కనిపిస్తోంది. గ్రేటర్‌ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలు ఎక్కువ అయ్యాయని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి అక్కడి కార్పొరేటర్లకు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పది డివిజన్లున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో టీఆర్ఎస్‌ గెలిచింది. కలసికట్టుగా ఉండాల్సిన నేతల మధ్య గ్రూపు రాజకీయాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి.

తన వర్గం నేతలకు అందలం:
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర మంచి పేరు ఉన్నా క్షేత్రస్థాయిలో నాయకులతో సఖ్యత లేదంటున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఆయన.. తన అనుచరులను మాత్రమే అందలం ఎక్కిస్తున్నారంటూ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయకులు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. కార్పొరేటర్లను లెక్క చేయకుండా తన వర్గం నేతలనే డివిజన్ అధ్యక్షులుగా నియమించారట. దీంతో మాదాపూర్, హఫీజ్‌పేట, శేరిలింగంపల్లి, చందానగర్‌ కార్పొరేటర్లు జగదీశ్వర్‌ గౌడ్, పూజిత, నాగేందర్ యాదవ్, నవతారెడ్డికి ఎమ్మెల్యే గాంధీ మధ్య దూరం పెరిగిందని అంటున్నారు.

టికెట్ల కోసం నాయకుల మధ్య పోటీ:
గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి గాంధీకి, జగదీశ్వర్‌ గౌడ్‌కి మధ్య వైరం ఉందని అంటున్నారు. గాంధీ ఇంటికి ఇప్పటివరకు జగదీశ్వర్ గౌడ్ వెళ్లకపోవడం, ఏ సమస్య ఉన్నా నేరుగా కేటీఆర్‌ను సంప్రదించడం చర్చనీయాంశమైంది. రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో పార్టీ టికెట్ల కోసం అధికార పార్టీ నాయకుల మధ్య పోటీ పెరిగింది. పాత రిజర్వేషన్లతో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించడం ఖాయం కావడంతో ఇప్పటి నుంచే గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే కాకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఉందని అంటున్నారు.

బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు:
అన్ని డివిజన్లలో వార్డు మెంబర్ల ఎంపికలో ఎమ్మెల్యేలు తమ అనుచరులుగా ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. దీంతో కొంతమంది కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారట. పార్టీని నమ్ముకుని ఎలాంటి పదవులు దక్కని నేతలు రగిలిపోతున్నారని అంటున్నారు. ఈ కారణంగా కొందరు నేతలు బీజేపీ లాంటి పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఎం.కృష్ణారావుతో పొసగకపోవడంతో కార్పొరేటర్ హరీశ్‌రెడ్డి, బీజేపీలో చేరి మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి సైతం సొంత పార్టీ నేతలే తనకు నష్టం చేకూర్చేలా వ్యహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. నగర మాజీ మేయర్‌ తీగల కృష్ణా రెడ్డి కూడా సబితా ఇంద్రారెడ్డి తీరు నచ్చనందు వల్లే బీజేపీలో చేరబోతున్నారని అంటున్నారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో అసంతృప్తిని హైకమాండ్‌ ఎలా డీల్‌ చేస్తుందో చూడాలి.

Related Tags :

Related Posts :