ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వర్సెస్ మంత్రి శంకర్ నారాయణ.. అనంత వైసీపీలో అసమ్మతి మంటలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

raptadu mla thopudurthi prakash reddy.. అనంతపురం అధికార పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి శంకర్ నారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మధ్య వివాదాలు ముదురు పాకాన పడ్డాయి. మంత్రి శంకర్ నారాయణను వ్యతిరేకిస్తున్న వారికి మద్దతుగా ప్రకాశ్ రెడ్డితో పాటు ఎంపీ మాధవ్‌ నిలుస్తున్నారు. అసమ్మతి నేతలతో ప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ కాల్‌ ఆడియో టేప్‌ను మంత్రి వర్గీయులు లీక్‌ చేయడంతో వివాదం మరింత రాజుకుందని అంటున్నారు.

ఈ ఆడియోను ఎడిట్ చేసి విడుదల చేశారంటూ మంత్రి వర్గీయలపై ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి నేతల పూర్తి ఆడియో టేప్‌ను ప్రకాశ్‌రెడ్డి వర్గీయులు విడుదల చేశారు.

అసమ్మతివాదులను అండగా ఉంటామన్న ఎమ్మెల్యే, ఎంపీ:
అనంతపురం జిల్లా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో అధిష్టానం కూడా అంత సీరియస్‌గా తీసుకోవడం లేదంటున్నారు. కొందరు అసమ్మతివాదులపై వేటు వేసింది. దీంతో అధిష్టానం వైఖరిపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్‌ అసమ్మతివాదులను సస్పెండ్ చేసినా.. వారికి అండగా ఉంటామంటూ ప్రకటించారు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ మాధవ్‌. దీంతో ఈ వివాదం మరింత ముదిరిపోయేలా కనిపిస్తోందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఆడియో టేపులు లీక్ చేసిన మంత్రి శంకర్‌నారాయణ వర్గీయులు:
ఇరు నేతల పోన్ కాల్ ఆడియో టేపుల లీకేజీతో వైసీపీలో ఏ స్థాయిలో విభేదాలు ఉన్నాయో అన్న విషయం బహిర్గతం అయ్యాయి. అసమ్మతి నేతలకు ప్రకాశ్‌రెడ్డి అండగా ఉన్నారంటూ మంత్రి శంకర్‌నారాయణ వర్గీయులు ఆడియో టేపులను సోషల్ మీడియాలో లీక్ చేశారు.

దీంతో ప్రకాశ్ రెడ్డి వర్గీయులు కూడా తాము మాట్లాడిన పూర్తి ఆడియో టేపును విడుదల చేస్తూ పార్టీ పటిష్ఠం కోసమే తాము ప్రయత్నిస్తున్నామని, మంత్రి కావాలనే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అసమ్మతి నేతలకు అండగా ఉంటానంటూ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి పేర్కొనడం కాక పుట్టిస్తోంది. దీనిపై అదిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఈ వివాదాలు ఎక్కడికి దారి తీస్తాయోనని కార్యకర్తల ఆందోళన:
ఇప్పటికే తమ నియోజకవర్గంలో గొడవలకు రాప్తాడు ఎంఎల్ఏ ప్రకాశ్‌రెడ్డే కారణమంటూ మంత్రి శంకర్‌నారాయణ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. ఈ క్రమంలో ఆడియో లీక్ కూడా సంచలనానికి కారణమైంది. మరి ఇద్దరు నేతల మధ్య ఈ వివాదాలు ఎక్కడికి దారి తీస్తాయోనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సమస్యను పరిష్కరించేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని అంటున్నారు.Related Posts