అయోధ్యలో మోడీ సాష్టాంగ నమస్కారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వందల ఏళ్ల కల సాకారమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ పడింది. ఆ పవిత్ర స్థలంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం వైభవంగా సాగింది. ముహూర్తం ప్రకారం బుధవారం (ఆగస్టు 5) మధ్యాహ్నం సరిగ్గా 12.44.08కి ఆయన శంకుస్థాపన చేశారు.ఆ అమృత ఘడియల కోసమే కొన్ని తరాలుగా పోరాటం సాగింది. భూమిపూజ అపురూప దృశ్యాలను కోట్లాది మంది భారతీయులు టీవీ తెరలపై వీక్షించి తరించారు. శ్రీరామ నామస్మరణతో భారతావని మార్మోగింది. భారతదేశ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతున్న వేళ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో రామమందిరం ఉండాలని కాంక్షించిన వ్యక్తిగా.. చివరికి తన చేతుల మీదుగానే ఆ తంతును ప్రారంభిస్తున్న వేళ ఆయన భక్తిపారవశ్యంతో పొంగిపోయినట్లు కనిపించింది. ప్రధాని మాటల్లో, చేతల్లో అది ప్రస్ఫుటం అయింది. భారతీయ సనాతన సంప్రదాయ వస్త్రాలంకరణలో ప్రధాని మోదీ ఈ తంతును కొనసాగించారు.

అయోధ్యకు వచ్చే వారు తొలుత హనుమాన్ గఢీ ఆలయాన్ని దర్శించుకోవడం సంప్రదాయం. ప్రధాని మోడీ కూడా ముందుగా ఇక్కడికే వచ్చారు. భూమిపూజకు ముందు హనుమాన్‌గఢీ మందిరంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాముడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ హనుమంతుడే చూసుకుంటాడని.. రామ మందిర నిర్మాణ కార్యక్రమం కూడా ఆయన ఆశీస్సులతో ప్రారంభిస్తున్నామని మోడీ చెప్పారు.ఆ తర్వాత ప్రధాని మోడీ శ్రీరాముడిని దర్శనం చేసుకున్నారు. రాంలల్లా విగ్రహాన్ని చూడగానే.. భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. సాష్టాంగ నమస్కారం చేశారు. భూమిపూజ అనంతరం ప్రసంగిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. దేశమంతా ఇవాళ రామమయం అయిందన్నారు మోడీ .

Related Posts