అయోధ్య అంటే… ఒక్క రామమందిరమేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్య అంటే కేవలం రామజన్మభూమి మాత్రమే కాదు. రామ మందిరం కట్టాక.. శ్రీరామచంద్రమూర్తిని మాత్రమే దర్శించుకుంటే సరిపోదు. అయోధ్య నగరిలో.. మనం చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయ్. తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాలూ ఉన్నాయ్. అవేంటి? వాటి చరిత్రేంటి? ప్రాశస్త్యమేంటో.. ఇప్పుడు చూద్దాం.. రామ జన్మభూమిలో.. రాముని జన్మించిన స్థలం ఒక్కటే ప్రసిద్ధి. కానీ.. అయోధ్యలో చూడాల్సినవి, దర్శించు కోవాల్సినవి చాలానే ఉన్నాయి. శ్రీరామ జన్మభూమి ప్రాంతంలోని.. 67 ఎకరాల విస్తీర్ణంలో.. 12 పురాతన ఆలయాలున్నాయి.అయోధ్యలో.. రామ జన్మస్థలితో పాటు సీతా రసోయి కూడా ఉంది. వీటితో పాటు హనుమాన్ ఘర్, దశరథ్ మహల్, రామ్‌కి పైది, తులసీ స్మారక్ భవన్, చక్రహర్జి విష్ణు టెంపుల్ ప్రధానమైనవి. అయోధ్యకు వెళ్లిన ప్రతి రామభక్తుడు.. వీటన్నింటిని దర్శించే వెళ్తారు. అయోధ్యలో ఎక్కువగా సందర్శించుకునే పవిత్ర క్షేత్రాల్లో.. హనుమాన్ ఘర్ ఒకటి.


ఈ పవిత్రస్థలానికి వచ్చిన వారెవరైనా.. ముందుగా శ్రీరామచంద్రుని పరమ భక్తుడు.. హనుమంతుడినే దర్శించుకుంటారు. ఈ ఆలయం ఆంజనేయస్వామికి అంకితమిచ్చారు. అయోధ్యలోని ఒక మట్టి దిబ్బపై నెలకొని ఉన్న ఈ ఆలయాన్ని దూరం కూడా వీక్షించొచ్చు. హనుమాన్ ఘర్ చేరటానికి 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇదొక.. గుహలాంటి ఆలయం. చదరపు ఆకృతి కలిగిన కోట లాంటి భవనంలో ఇది ఉంది. ఈ భవనంలో.. గుండ్రటి కోట బురుజులు నలుమూలలా ఉన్నాయి. ఈ ఆలయంలోని గర్భగుడిలో.. అంజలీదేవీ బాల హనుమాన్‌ని తన ఒడిలో ఉంచుకున్న ప్రతిమ కనిపిస్తుంది. అయోధ్య హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తే.. తమ చిరకాల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందువల్ల.. ఏడాది పొడవునా.. ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

అయోధ్యలో తప్పక చూడాల్సిన మరో ప్రదేశం దశరథ్ మహల్. ఇది.. నగరం నడిబొడ్డున ఉంటుంది. శ్రీరాముని తండ్రి దశరథుడి.. అసలైన రాజమందిరం ఉన్నచోటే దీనిని నిర్మించారని నమ్ముతారు. శ్రీరాముడు తన సోదరులతో కలిసి.. తన బాల్యాన్ని, యవ్వనాన్ని ఈ ప్రదేశంలోనే గడిపారని చెబుతుంటారు. ఈ దశరథ్ భవన్‌లో.. సీతా సమేతుడైన రాముడు, లక్ష్మణుని సమేతంగా ఉన్న విగ్రహాలున్నాయి. దశరథ్ మహల్‌కి.. పెద్ద, రంగులద్దిన ప్రవేశ ద్వారం ద్వారా చేరుకుంటారు. ఈ ఆలయంలో ప్రవేశించగానే.. ఆధ్యాత్మిక పరిమళం ఆవహించినట్లు ఉంటుందని చెబుతారు. శ్రీరాముడు నివసించినట్లుగా భావిస్తున్న ఈ ప్రదేశాన్ని చూసేందుకు.. భక్తజనం విశేషంగా తరలివస్తుంటారు.


అయోధ్యలో మరో కీలకమైన ప్రాంతం సీతాకి రసోయి. రాచరికపు వంటగదిగా కంటే.. ఒక దేవాలయంగానే సీతాకి రసోయికి ప్రసిద్ధి. అయోధ్యలోని రామ్‌కోట్‌లో.. రామ జన్మభూమికి వాయువ్య దిశలో ఉన్న ఈ ప్రదేశం.. రామ్‌చబుత్ర టెర్రస్‌కి సమీపంలో ఉంటుంది. ఈ దేవాలయంలో.. రామలక్ష్మణ, భరత శత్రుఘ్నులు వారి..వారి.. సతులైన సీతా, ఊర్మిళ, మాండవి, శ్రుతికీర్తి సమేతంగా ఉన్న విగ్రహాలున్నాయి.

READ  నిమ్మగడ్డ రమేష్ వ్యవహారాన్ని సాగదీయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వానిది: ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

సీతాకి రసోయిలో.. చపాతీ పీట, కర్ర వంటివి.. ఈ రాచరికపు వంటశాలలో కనిపిస్తాయి. ఆనాటి కాలంలో.. వారి ఆచారం ప్రకారం కొత్తగా వచ్చిన కోడలు.. కుటుంబం మొత్తానికి వంట చేయాల్సి ఉంటుంది. పురాణాల ప్రకారం.. సీతమ్మ అన్నపూర్ణాదేవిలాగా.. కుటుంబానికే కాకుండా.. పూర్తి మానవ జాతికే సరిపడే విధంగా ఆహారాన్ని వండారని పురాణాలు చెబుతున్నాయ్.

అయోధ్యలోని సరయూనది ఒడ్డున.. రామ్ కి పైది అనే ప్రదేశం ఉంటుంది. ఎంతో మంది భక్తులు.. ఈ చరిత్రాత్మక నదిలోని పవిత్ర జలాల్నో స్నానమాచరిస్తారు. సరయూ నదిలో స్నానం చేయడం ద్వారా.. వారి వారి పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. సరయూ నది నుంచి ఈ ఘాట్‌కి.. నీటిని పంపుల ద్వారా చేరవేస్తారు. ఉత్తర్‌ప్రదేశ్ నీటి పారుదలశాఖ నిరంతరాయ నీటి సరఫరాతో పాటు ఘాట్ పర్యవేక్షణను చూసుకుంటుంది.


పండగ వేళల్లో.. శ్రీరామ భక్తులను.. రామ్ కి పైది విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీరామ భక్తుడు, రామాయణం రచించిన కవి.. గోస్వామి తులసీదాస్‌కి నివాళిగా.. అయోధ్యలో తులసి స్మారక్ భవన్‌ని నిర్మించారు. ఇక్కడే తులసీదాస్ రామాయణాన్ని రచించారని నమ్ముతారు. ఇక్కడున్న గ్రంథాలయం.. చరిత్రకారులకు, పండితులకు అత్యంత విలువైనది. శ్రీరాముని చరిత్రతో.. ముడిపడిన విశేషాలను ఇక్కడ సేకరిస్తారు. ఇక్కడే.. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తులసి జయంతిని ఘనంగా జరుపుతారు.

సరయూ నది ఒడ్డున ఉన్న గుప్తర్ ఘాట్ దగ్గర.. ఫైజాబాద్‌లో ఉన్న ఈ చక్రహర్జి విష్ణు ఆలయం.. హిందువుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఇందుకు.. రెండు విషయాలు కారణం. మొదటిది.. ఇక్కడ చక్రాన్ని ధరించిన విష్ణుమూర్తి విగ్రహం అనేకమంది భక్తులను ఆకర్షిస్తోంది. సాధారణంగా సుదర్శన చక్రాన్ని.. శ్రీకృష్ణుడు రాక్షసులను హరించేందుకు వాడతాడు. విష్ణుమూర్తి చక్రాన్ని ధరించడమనేది అరుదుగా ఉన్న అంశం.

మరో విశేషమేమిటంటే.. ఇక్కడే శ్రీరాముని పాదముద్రలు ఉంటాయి. ఇవి.. నిజమైన శ్రీరాముని పాదముద్రలను భక్తులు విశ్వసిస్తారు. వాటిని దర్శించుకోవడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వీటితో పాటు అయోధ్యలో ఇంకా చాలా పురాతన ఆలయాలున్నాయి. చాలా వరకు శిథిలావస్థకు చేరినట్లు కనిపిస్తున్నాయి. రామమందిర నిర్మాణంలో భాగంగా.. వాటిని పునరుద్ధరిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వీటిపై.. రామజన్మభూమి ట్రస్టు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Related Posts