నయనతార ‘అమ్మోరు తల్లి’ – రివ్యూ

  • Published By: sekhar ,Published On : November 15, 2020 / 06:28 PM IST
నయనతార ‘అమ్మోరు తల్లి’ – రివ్యూ

Ammoru Thalli Review: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్ నయనతార ఆదిశక్తి అవతారంలో నటించిన Mookuthi Amman చిత్రం తెలుగులో తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార తొలిసారి అమ్మవారి పాత్రలో నటించిన ఈ సినిమాతో కోలీవుడ్‌లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న RJ బాలాజీ దర్శకుడిగా పరిచయమయ్యాడుAmmoru Thalli లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఈ సినిమాను ఓటీటీ వేదికగానే విడుదల చేయాలని నిర్ణయించుకున్న చిత్రయూనిట్
దీపావళి సందర్భంగా డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా తమిళ్, తెలుగు భాషల్లో ‘అమ్మోరు తల్లి’ (మూకుత్తి అమ్మన్) చిత్రాన్ని విడుదల చేసింది. అమ్మవారి పాత్రలో ప్రేక్షకులను నయనతార ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.


కథ
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ తాలుకు ఆకులపల్లిలో ఉండే ఎంగేల్‌ రామస్వామి(ఆర్‌.జె.బాలాజీ) దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పుడే తండ్రి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోవడంతో.. తాతయ్య, తల్లి, ముగ్గురు చెల్లెళ్లున్న కుటుంబాన్ని ఓ లోకల్‌ ఛానెల్‌లో పనిచేస్తూ పోషిస్తుంటాడు. తన గ్రామంతో సహా చుట్టు పక్కల 118 గ్రామాలకు చెందిన 11 వేల ఎకరాల భూమిని దేవుడు పేరుతో ఆక్రమించుకోవాలని భగవతి బాబా(అజయ్ ఘోష్‌) ప్రయత్నిస్తుంటాడు.

రామస్వామి తల్లి బంగారం(ఊర్వశి)కి తిరుమల వెళ్లాలనే కోరిక. ఆమె ఎప్పుడు తిరుమల వెళ్లాలని అనుకున్నా ఏదో ఒక సమస్య వస్తుంటుంది. ఆ సమయంలో వారి కులదైవం అయిన మూడు పుడకల అమ్మవారిని దర్శించుకోమని ఓ పెద్దాయన సలహా ఇస్తాడు.దీంతో బంగారం కుటుంబంతో సహా వాళ్ల ఇంటి కుల దైవం ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకుంటుంది. అక్కడ రామస్వామికి అమ్మవారు దర్శనమిస్తుంది. తన గుడిని తిరుపతిలా ఫేమస్ చేయాలని కోరుతుంది. అసలు అమ్మవారు ఎందుకు అలా అడిగింది.? దీనికి రామస్వామి ఒప్పుకున్నాడా.? వీరిద్దరి కథలో భగవతి బాబా( అజయ్ ఘోష్) అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..


నటీనటులు
మధ్య తరగతి కుర్రాడు రామస్వామిగా ఆర్. జె. బాలాజీ అద్భుతంగా నటించాడు. అమ్మవారిగా నయనతార నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు దైవత్వాన్ని ప్రదర్శిస్తూ.. ఇటు వినోదాత్మక సన్నివేశాల్లో ప్రేక్షకులను నవ్వించింది. దొంగ బాబాగా అజయ్ ఘోష్ ఆకట్టుకున్నాడు. అతడి మేనరిజమ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.

ఇక బాలాజీ తల్లి పాత్రలో ఊర్వశి నటన బాగుంది. ఒకవైపు నలుగురి పిల్లలకు తల్లిగా.. మరోవైపు తన భర్త కోసం చాలా రోజుల నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భార్యగా చక్కటి హావభావాలు పలికించిందామె. కొన్ని సీన్స్‌లో అయితే కన్నీళ్లు తెప్పిస్తుంది కూడా.

సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ మరో ప్లస్ పాయింట్. ఎడిటింగ్, ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్. జె. బాలాజీ అండ్ టీం కథ, కథనాన్ని పకడ్బందీగా సిద్దం చేశారు. డైలాగులు ఆకట్టుకుంటాయి. ఆర్. జె. బాలాజీ, ఎన్. జె. శరవణన్‌లకు ఇదే తొలి సినిమా అయినా కూడా మెప్పించారు.


ఎలా ఉందంటే
భక్తి పేరుతో దేవుడి మాన్యాలను దోచేసే దొంగ బాబా ఆటను అమ్మవారు స్వయంగా భూమికి దిగి వచ్చి ఎలా ఆట కట్టించింది అనేది ఈ సినిమా కీలకాంశం. రొటీన్‌గా కాకుండా కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. కథకు కామెడీని యాడ్ చేయడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

ఇక అమ్మవారి పాత్రలో నయనతార సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేకుండా ఆమె పాత్రను దర్శకులు చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఓవరాల్‌గా ‘అమ్మోరు తల్లి’ మూవీ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉందని చెప్పొచ్చు.