కరోనా వేళ నటుడి పెళ్లి బాజా.. ఖర్చంతా సీఎం సహాయనిధికే..

మలయాళ నటుడు, కేరళ ఫిల్మ్‌ అవార్డ్‌ విజేత మణికందన్ వివాహం అంజలితో జరిగింది..

కరోనా వేళ నటుడి పెళ్లి బాజా.. ఖర్చంతా సీఎం సహాయనిధికే..

 

కరోనా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారి ధాటికి తట్టుకోలేక ప్రపంచ దేశాలు గజగజ వణుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శుభకార్యాల మాటే వినబడడం లేదు. అయితే ఓ మలయాళ నటుడు మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలను గౌరవిస్తూ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. పాపులర్ నటుడు, కేరళ ఫిల్మ్‌ అవార్డ్‌ విజేత మణికందన్‌​ ఏప్రిల్ 26(ఆదివారం) ఓ ఇంటి వాడయ్యాడు. కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన కొచ్చిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లికి వచ్చిన వారంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించారు. ఆరు నెలల క్రితమే మరదుకు చెందిన అంజలితో మణికందన్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్‌ 26న పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అయితే పెళ్లి తేదీని మార్చటానికి మణికందన్‌ ఇష్టపడలేదు. కానీ, ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పెళ్లి ఘనంగా చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు.

Malayalam actor Manikandan gets Married

అలాగే పెళ్లి కోసం వెచ్చించాల్సిన డబ్బు మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 2016లో ‘కమ్మటిపడ’(Kammatipada) సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన మణికందన్‌ మొదటి సినిమాతోనే బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కేరళ ఫిల్మ్‌ అవార్డు అందుకోవడం విశేషం.