తమిళ్ సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్.. మరి టాలీవుడ్ పరిస్థితి?

తమిళ్ సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్.. మరి టాలీవుడ్ పరిస్థితి?

Tamil Cinema: నెలల నిరీక్షణ తర్వాత సినిమా కలలు ఫలించనున్నాయి. కొవిడ్‌ అన్‌లాక్‌ వల్ల అర్ధాకలితో నడుస్తున్న థియేటర్స్‌ కడుపు నింపేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌కు 100 శాతం సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్స్‌లో సినిమా ప్రదర్శించుకోవచ్చని చెప్పేసింది. ‘ఇనియ పొంగల్‌ నల్‌ వాళ్తుగళ్‌’ అంటూ తియ్యని సంక్రాంతి శుభాకాంక్షలనే అర్థం వచ్చేలా విష్ చేసింది. అదే అనుసరిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌కి 100 శాతం సీటింగ్‌ పర్మిషన్ ఇస్తారా..? అనేది వేచి చూడాలి.

కోలీవుడ్‌ ఖుషీ ఖుషీ
సోమవారం కోలీవుడ్‌ ఇండస్ట్రీ ఖుషీగా ఉంది. ‘థియేటర్స్‌ సిస్టమ్‌ తిరిగి పుంజుకోవాలంటే వంద శాతం సీటింగ్‌ కెపాసిటీతో సినిమాల ప్రదర్శనకు అనుమతివ్వాలి’ అని తమిళనాడు ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ కోరింది. ఈ విషయమై తమిళనాడు సీఎం పళనిస్వామిని స్వయంగా కలిశారు తమిళ స్టార్‌ విజయ్‌. ‘మాస్టర్‌’, శింబు ‘ఈశ్వరన్‌’ సినిమాలు పొంగల్‌కి విడుదలవుతున్నాయి. తాజా ప్రకటనపై ఈ రెండు చిత్ర బృందాలు థ్యాంక్స్ చెబుతున్నాయి. దీనిపై తమిళ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది.

మనకూ 100శాతం సీటింగ్‌ ఉంటుందా?
50 శాతం సీటింగ్‌ ఉన్నా కూడా సంక్రాంతికి తెలుగులో పలు సినిమాలు బరిలో ఉన్నాయి. రవితేజ ‘క్రాక్‌’, రామ్‌ ‘రెడ్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్‌’, విజయ్‌ ‘మాస్టర్‌’ (డబ్బింగ్‌), దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘జాంబి రెడ్డి’, ‘క్రేజీ అంకుల్స్‌’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మన నిర్మాతలు కూడా ప్రభుత్వాన్ని ఫుల్‌ కెపాసిటీతో ఓపెన్‌ చేసేందుకు పర్మిషన్ కోరతారా? అనే దానిపై నిర్మాతల స్పందన ఇలా ఉంది.

థియేటర్లు నిండుగా ఉంటే బాగుంటుంది. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయమై సంప్రదించాలనుకుంటున్నాం. సంక్రాంతి రిలీజ్‌కు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. 100 శాతం సీటింగ్‌కి అనుమతి లభిస్తే బాగుంటుంది.
– సి. కల్యాణ్, ప్రెసిడెంట్ ఆఫ్ టాలీవుడ్ మూవీ కౌన్సిల్

యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీ విషయమై హోమ్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఓ లెటర్ అందింది. తమిళనాడు గవర్నమెంట్ అది ఉపయోగించుకుని 100 శాతం సీటింగ్‌ కెపాసిటీకి జీవో పాస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్‌ గురించి 2 ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. – దగ్గుబాటి సురేశ్ బాబు