బొమ్మ ఆడట్లేదు.. బువ్వ లేదు.. వంద రోజులు..

  • Edited By: vamsi , June 25, 2020 / 03:44 AM IST
బొమ్మ ఆడట్లేదు.. బువ్వ లేదు.. వంద రోజులు..

అతనొక సైకిల్ స్టాండ్ నడిపించే వ్యక్తి.. థియేటర్ దగ్గర సైకిళ్లు, మోటారు వాహనాలు, కార్లు పెట్టుకున్నందుకు డబ్బులు వసూలు చేసి థియేటర్‌లో డిపాజిట్ చేస్తాడు.. అందుకు గాను అతనికి రోజుకు వచ్చే కూలీ రూ.150. అతనికి రూపాయి వచ్చే మరో మార్గమే లేదు.. లాక్ డౌన్ కష్టాల్లో లైఫ్ కష్టంగా భరించేస్తున్నారు. అటువంటి జివనాలు అస్తవ్యస్తమై వంద రోజులు. 

ఏదైనా సినిమా హీరో బొమ్మ వంద రోజులు ఆడితే సినిమా వాళ్ల ఆనందం, ఆ సినిమా హీరో అభిమానుల ఉత్సాహం చూపించే సినిమా థియేటర్‌లు వందరోజులుగా మూగబోయాయి. థియేటర్లు ‘లాక్‌డౌన్‌ సెంచరీ’ కొట్టాయి. దేశవ్యాప్తంగా థియేటర్‌లు బంద్‌లో ఉండగా.. వెండితెర పరదాల మాటుకు వెళ్లిపోయింది. శతదినోత్సవ చిత్రాల వేడుకలు జరుపుకుంటే ఆనందించేవాళ్లు.. ఆకలి ఆర్తనాదాలె చేస్తున్నారు. 

కరోనా మహమ్మారి సృష్టించిన అవాంఛిత వైచిత్రి కారణంగా థియేటర్లకు తాళం పడి వందరోజులు అయ్యింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యలలో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి రెండో వారంలో థియేటర్లను మూసివేశారు. వాటి పునఃప్రారంభం ఎప్పుడనే సస్పెన్స్‌ ఇప్పటికీ వీడలేదు. కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదు.. థియేటర్‌లో బొమ్మ పడాలంటే ఇంకాస్త సమయం కచ్చితంగా పడుతుంది. 

ఈ థియేటర్లలో పనిచేసేది దిగువ మధ్యతరగతి, పేదరికం అనుభవిస్తున్న నిరుపేదలు. సమోస అమ్ముకునేవారి దగ్గరి నుంచి టిక్కెట్టు చింపి లోపలికి పంపేవారి వరకు కోవిడ్-19 కారణంగా ఉపాధి లేదు.. పనిలేదు కాబట్టి బువ్వ లేదు. 135 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనా కారణంగా 45 కోట్ల మంది ఉపాధి సంక్షోభంలో పడినట్లు ఒక అంచనా. పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తే కానీ వారి పరిస్థితులు మెరుగుపడవు.. పేదరికం కంటే పెద్ద రోగముందా? ఈ రోగం కారణంగా ఆకలి చావులు చస్తున్న, చచ్చేవారెందరో? 

వాస్తవానికి చిత్ర పరిశ్రమకు వేసవికాలం చాలా ముఖ్యమైన సీజన్. ఈ సీజన్‌లోనే ఎక్కువగా థియేటర్లు కలకలలాడుతుంటాయి. సమ్మర్‌లో ప్రతివారం నాలుగైదు సినిమాలు విడుదల అవుతాయి. అయితే కరోనా ప్రభావంతో వంద రోజులుగా థియేటర్లు మూతపడగా.. వేసవి సీజన్‌ ఆవిరైపోయింది. చిత్ర నిర్మాతలతో పాటు కోట్లాది రూపాయల్లో థియేటర్ల ఓనర్లు నష్టపోతున్నారు. గతంలో ఒకటి, రెండు రోజుల మినహా ఎక్కువ రోజులు థియేటర్లు బంద్‌ ఉన్న దాఖలాలు లేవు. దేశవ్యాప్తంగా సినిమాల ప్రదర్శనను వందరోజులకు పైగా నిలిపివేయడం ఇదే మొదటిసారి. 

అయితే థియేటర్లను ఇప్పటికిప్పుడు ప్రారంభించినా ఒకటి అరా మినహా పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు సిద్ధంగా లేవు. దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉండగా.. అది ఎప్పుడు అనేది మాత్రం ఇప్పట్లో తేలేది కాదు. మన దేశంలోనే కాదు.. దాదాపు ప్రతి దేశంలోనూ ఇదే పరిస్థితి. న్యూజిలాండ్‌, దుబాయ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఇటీవల థియేటర్లను ప్రారంభించారు. అయితే అక్కడ కూడా పాత సినిమాల్ని ప్రదర్శిస్తున్నారు.

Read: టీవీ పరిశ్రమలో కరోనా కలకలం.. మళ్లీ షూటింగ్స్ బంద్!