ట్రెండ్ సెట్టింగ్ లవ్‌స్టోరి ‘నువ్వే కావాలి’ కి 20 ఏళ్ళు..

  • Published By: sekhar ,Published On : October 13, 2020 / 03:59 PM IST
ట్రెండ్ సెట్టింగ్ లవ్‌స్టోరి ‘నువ్వే కావాలి’ కి 20 ఏళ్ళు..

Nuvve Kavali Movie: సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఇదే రోజున (అక్టోబర్ 13) కొత్తవాళ్లు లీడ్ రోల్స్‌లో నటించిన ఓ యూత్ సినిమా విడుదలైంది. మ్యాట్నీ నుంచి మౌత్ టాక్ పెరిగింది. యువత అంతా టికెట్ల కోసం క్యూ కట్టారు. కట్ చేస్తే థియేటర్లకు హౌస్‌ఫుల్ బోర్డులు వేలాడడం మొదలయ్యాయి.

ఆ సినిమానే ‘నువ్వే కావాలి’.. అప్పటివరకు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన తరుణ్‌ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. రిచా, సాయికిరణ్‌ లకు కూడా ఇదే తొలి చిత్రం. ‘నువ్వే కావాలి’ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా విశేషాలు ఓసారి చూద్దాం.


చిన్న బడ్జెట్.. ఎంత కలెక్ట్ చేసిందంటే..
మళయాళంలో యూత్‌ను అలరించిన ‘నిరమ్’ (Niram) ఆధారంగా ‘నువ్వే కావాలి’ చిత్రం రూపొందింది. మొదట ఈ సినిమా చూసిన ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారు. అయితే అప్పటికే తెలుగు రీమేక్ రైట్స్ మరో ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ కొనుక్కున్నారు. ఎమ్మెస్ రెడ్డి ద్వారా ఆ సినిమా గురించి విన్న ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు, స్రవంతి రవి కిషోర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

సినిమాను రామోజీ ఫిలింసిటీలోనే నిర్మించమని, మొత్తం ఖర్చంతా తమదేనని చెప్పారు. దాంతో ఈ చిత్రానికి రవి కిషోర్ అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి, సినిమా పూర్తయిన తర్వాత తన వాటా తీసుకున్నారు. అతి తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన ‘నువ్వే కావాలి’ దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసి సంచలన విజయం సాధించింది.


దర్శక-రచయితల ద్వయం
‘నువ్వే కావాలి’ చిత్రానికి ముందు ‘స్వయంవరం’తో మంచి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు విజయభాస్కర్, రచయిత త్రివిక్రమ్. ఆ సక్సెస్‌తోనే ‘నువ్వే కావాలి’ రీమేక్ వారి దగ్గరకు వచ్చింది. ఈ చిత్ర ఘనవిజయంతో వీరిద్దరూ కొన్నేళ్ళపాటు మంచి సినిమాలు అందించారు.

బాలనటునిగా అలరించిన తరుణ్‌కు హీరోగా ఎనలేని పేరు లభించింది. ఇక ఈ చిత్ర నాయిక రిచా టాలీవుడ్‌లో కొన్నాళ్ళు తన హవా కొనసాగించింది. ప్రముఖ గాయకుడు వి.రామకృష్ణ తనయుడు సాయికిరణ్ కూడా ఈ సినిమాతోనే నటుడిగా పరిచయమయ్యాడు. ఇలా పలువురికి ‘నువ్వేకావాలి’ మరపురాని విజయాన్ని అందించింది.


ఈ రీమేక్‌కు కోటి సంగీతం ఓ ఎస్సెట్‌గా నిలిచింది. అనగనగా ఆకాశం ఉంది.. కళ్లల్లోకి కళ్లుపెట్టి.. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే.. వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అనేక కేంద్రాలలో ‘నువ్వే కావాలి’ ద్విశతదినోత్సవాలు జరుపుకోవడం విశేషం. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది ‘నువ్వే కావాలి’..