2019లో ఆ సినిమాలే ఎక్కువ: ఆరబోతలు.. అడల్ట్ కంటెంట్‌తో!

  • Published By: vamsi ,Published On : December 19, 2019 / 06:41 AM IST
2019లో ఆ సినిమాలే ఎక్కువ: ఆరబోతలు.. అడల్ట్ కంటెంట్‌తో!

మేసే గాడిదని కూసే గాడిదని వచ్చి చెడగొట్టినట్లు.. 2018లో కొత్త రకం కథలతో, రికార్డు స్థాయి కలెక్షన్లతో తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరుకోగా.. 2019 మాత్రం కొత్త రకం కథలు కంటే ఎక్కువగా అడల్ట్ కథలే సినిమాలుగా వచ్చాయి. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన కొంతమంది బూతు కంటెంట్‌తో సినిమాలు ఎక్కువగా తీశారు.

డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, హీట్ పెంచే శృంగార సన్నివేశాలను తీసి వాటిని ట్రైలర్, టీజర్‌లో పెట్టుకుని హైప్ పెంచుకున్నవారే ఎక్కువ. కథతో సంబంధం లేకుండా బూతు సీన్లను పెట్టి సినిమాలను వదిలారు. అయితే సినిమాలో కథ ఉంటేనే ఆడుతుందని, బూతు ఉంటే కాదని ఈ సంత్సరంలో దర్శక నిర్మాతలకు తెలిసి వచ్చింది. వాటిని నమ్ముకుని ఈ ఏడాది తీసిన ఏ చిత్రమూ విజయవంతం కాలేదు.

అంతకుముందు సంవత్సరం అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాల ఎఫెక్ట్‌తో.. నిర్మాతలు అదే రకం సీన్లతో సినిమాలు చేశారు. అయితే చివరకు వారి పప్పులు ఉడకలేదు. ఈ చీకటి గదిలో చితక్కొట్టుడు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌నే టైటిల్‌గా పెట్టి సినిమా తీశారు. అయితే ఈ అడల్ట్ హారర్ కామెడీ సినిమాలో బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి కానీ కథ, కథనాలే లేవు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

తర్వాత ఏడు చేపల కథ.. A సర్టిఫికేట్‌తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌లో ఘాటు రొమాన్స్ చూపించారు. పోర్న్ మూవీకి తక్కువ అనేలా ఉందని టీజర్, ట్రైలర్, పోస్టర్స్ విడుదల చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ భానుశ్రీ ఇందులో ముఖ్యమైన పాత్రలో నటించింది. అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలు.. పరిధికి మించి కనిపించాయి. హద్దులు దాటిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బుస్సుమంది.

ఇక పాయల్ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆర్‌డీఎక్స్ లవ్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో వచ్చిన ఫేమ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో వచ్చిందే ఆర్‌డీఎక్స్ లవ్. పాయల్ అందాల ఆరబోతలు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లే తప్పా ఏమీ లేని ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. అలాగే టూ అవర్స్ లవ్.. అంటూ వచ్చిన చిన్న సినిమా.. లక్ష్మీరాయ్ నటించిన వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ ఇలా ఈ సంవత్సరం అంతా ఆరబోతలు దాడి చేశాయి. 

ఇదిలా ఉంటే స్టార్ హీరో నాగార్జున నటించిన మన్మథుడు లాంటి క్లాసిక్ చిత్రాన్ని సీక్వెల్ చేశారు. సినిమా నిండా డబుల్ మీనింగ్ డైలాగ్‌లను పెట్టి చేశారు. మన్మథుడు 2 బోల్డ్ సీన్స్‌తో, బోల్డ్ కంటెంట్‌ను నమ్ముకుని తీశారు. అయితే మితిమీరిన శృంగార సన్నివేశాలు సినిమాను బోల్తా కొట్టించాయి. 2020లో అయినా కొత్తగా వచ్చే దర్శకులు పద్దతులు మార్చుకుని అడల్ట్ కథలను, సీన్లను నమ్ముకోకుండా కొత్త కథలతో సినిమాలు తీస్తారని భావిద్దాం.