K Viswanath : కళాతపస్వి వచ్చి అభిమానితో మాట్లాడితే.. వైరల్ అవుతున్న ఓ అభిమాని ఆవేదన..

సోషల్ మీడియాలో కవనమాలి అనే పేరుతో ఓ అభిమాని రాసిన పోస్ట్ వైరల్ గా మారింది. సాక్ష్యాత్తు ఆ కళాతపస్వి విశ్వనాధ్ గారే వచ్చి అభిమానితో మాట్లాడితే ఎలా ఉంటుందనే ఊహతో రాసిన ఈ వాక్యాలు ఆయన ప్రతీ అభిమానిని కదిలిస్తున్నాయి...............

K Viswanath : కళాతపస్వి వచ్చి అభిమానితో మాట్లాడితే.. వైరల్ అవుతున్న ఓ అభిమాని ఆవేదన..

A fan special post on K Viswanath in Social media goes viral

K Viswanath :  మన సినీపరిశ్రమకు ఎన్నో క్లాసిక్ సినిమాలని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కి తరలిస్తుండగా కన్నుమూశారు. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. ఇక అయన అభిమానులు, నెటిజన్లు వారికి తోచిన రీతిలో ఆయనపై ఉన్న అభిమానాన్ని చూపిస్తూ సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సినిమాలని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కవనమాలి అనే పేరుతో ఓ అభిమాని రాసిన పోస్ట్ వైరల్ గా మారింది. సాక్ష్యాత్తు ఆ కళాతపస్వి విశ్వనాధ్ గారే వచ్చి అభిమానితో మాట్లాడితే ఎలా ఉంటుందనే ఊహతో రాసిన ఈ వాక్యాలు ఆయన ప్రతీ అభిమానిని కదిలిస్తున్నాయి.

………………………………………
ఏరా..! నిద్రపోతున్నావా ?
రేపు ఉదయం లేచేసరికి నా గురించి వార్త తెలిసి ఏమైపోతావో అని కాస్త భయంగా ఉందిరా ! పైకి కనపడనివ్వకుండా ఎంతలా ఏడుస్తావో అంచనా వేయగలనురా !
కానీ తప్పదురా..!
సుందరుడు వెళ్ళిపోయాడు,
సుబ్రమణ్యం వెళ్ళిపోయాడు,
సీతారాముడు వెళ్ళిపోయాడు.
ఇదిగో నిన్ను అప్పుడే మళ్లీ భాధపెట్టడం నచ్చక ఊపిరికి ఊపిరి ముడివేస్తూ ఈ కొన్నాళ్ళు నీ మనసుకి కాస్త స్వాంతన చేకూర్చ ప్రయత్నించానురా.. ఇక సమయమైంది. ఈ ఒంటరితనానికి ఇక ఉద్వాసన పలికి ఊపిరి నిలిపేస్తున్నాను.వెళ్ళాలి తప్పదు.. వెళ్తున్నా మరి.. వెళ్ళొస్తా మరి..

ఉదయం బయలుదేరితే నీకు వెంటనే తెలిసిపోతుంది. నన్ను వెళ్ళనివ్వవు. నీ కన్నీళ్లు నన్ను మబ్బుల్ని దాటనివ్వవు. నీ ప్రేమ ఆ స్వర్గరథాన్ని కూడా ఆపేస్తుంది. నాకు తెలుసు.. అందుకే అర్థరాత్రి ఈ ఆఖరియాత్రకి పూనుకున్నాను. మా సీతారాముడు చెప్పినట్టు నమ్మకు నమ్మకు ఈ రేయిని అని ఎంత తిట్టుకుంటావో రేపటి నుండి ఈ చీకటిని..

అయినా ఒక్కసారి నా గురించి ఆలోచించు.. ఈ ఇన్నాళ్ల జీవితంలో నేను చూడనిదేముంది ? ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు.. నాకు ఈ సంతృప్తి చాలురా.. ! కీర్తిలాగే వయసు కూడా పెరుగుతూ పోయింది. మనసు నిత్యం ఉల్లాసంగా ఉరకలేసినా శరీరం బాగా అలసిపోయిందిరా.. నడవలేకపోతున్నా.. నా పనులు నేను చేసుకోలేకపోతున్నా..ఇలా ఇంకా ఉండి నేను ఇబ్బంది పడటం మాత్రం నీకు ఇష్టమా చెప్పు..? అందుకే ఇక ఈ ప్రయాణానికి స్వస్తి పలుకుతున్నానురా.. చెప్పాపెట్టాకుండా వెళుతున్నానని కోప్పడకురా..
అయినా రేపు ఉదయం లేవగానే నా గురించి తెలిసి ఎంతలా పగిలిపోతావో తెలుసు అయినా ఒక్కటి గుర్తుపెట్టుకోరా..!

సాగరసంగమం ఎన్నిసార్లు చూశావు..ఓరి.. నేను కూడా అన్నిసార్లు చూసి ఉండనేమో అనిపిస్తుంది. మరి ఆ చివరలో నేను చెప్పింది ఏమిటి ? There is no end for ART. హ.. నేను అంటే ఇదిగో ఈ ఒళ్ళు అనుకుంటే నేను ఈ రోజుతో వెళ్లిపోయినట్టు కానీ.. నేను అంటే నా కళ అని నువ్వు గుర్తుతెచ్చుకోగలిగితే నేను ఎక్కడికి వెళ్లినట్టు చెప్పు.. సంగీతం , సాహిత్యం, దర్శకత్వం ఇలాంటి కళల్ని నా కలలతో కలిపి నీకోసం ఎన్ని బహుమతులు తెచ్చాను శూన్యం లోంచి ఈ లోకంలోకి..ఆ చలన చిత్రాలన్నీ నా చిత్రాలే.. ఆ చిత్రాలన్నీ చూసిన ప్రతీసారి నీకోసం నే రాసిన ఉత్తరాలే అని చదువుకో..

ఇన్నేళ్లలో నా చిత్రాలు నాకు ఏం సంపాదించిపెట్టాయనుకున్నావ్ ? అవార్డులు, పేరుప్రతిష్టలు కాదు, నీలా ఎక్కడో ఒక మనసులో నా కల కళ స్ఫూర్తిగా వెలుగుతుంది చూడు.. ఇలాంటి కొన్ని కోట్ల మనసుల్ని సంపాదించుకున్నాను. ఒరే.. ఎప్పుడూ అడుగుదాం అనుకొని ఎందుకులే అని ఆగిపోతుంటాను. ఇక రేపు పొద్దు ఎరుపెక్కితే ఇక అడగలేనేమో..అందుకే అడిగేస్తున్నా.. నేనంటే అంత ఇష్టం అంటావు కదా.. నా చిత్రాలు అంటే అంత పిచ్చి పిచ్చిగా మళ్లీ మళ్లీ మళ్లీ చూస్తావు కదా.. అందులో నీకు బాగా నచ్చిన చిత్రం ఏది ? రేపు నువ్వు చెప్పినా నేను వినలేను కానీ విన్నట్టే అనుకో.. కళ్ళు తుడుచుకోరా.. కాసిన్ని నీళ్లు తాగు.. అరెరే ఏమిటా దుఃఖం.

ఇలారా ఆ ఫోనులో ఆ పాటల అప్లికేషనో ఏదో ఉంటుందిగా తెరువు.. ఆ అదిగో ఆ my fav అని ఓ లిస్టులో నన్ను సుందరుడిని, మామని, రాజాని, సీతారాముడిని, బాలుని దాచుకున్నావు కదా.. ఆ ఏది ఓ మంచి పాట పెట్టు.. “నరుడి బ్రతుకు నటన.. ఈశ్వరుడి తలపు ఘటన.. ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన”
అబ్బ.. సుందరుడు నా మనసు చదివేసి రాసాడు అనిపిస్తుంది.. అర్థమవుతుందా..

ఈ మిగిలిన కాసిన్ని ఆఖరి క్షణాల్లో ఇన్నాళ్ల జీవితమంతా కళ్ళ ముందు నాకిష్టమైన సినిమాలాగే సాగుతుందిరా.. సినిమా షూటింగ్ అప్పుడు కాస్త గంభీరంగా ఉంటాను కానీ ఇదిగో ఇప్పుడు ఆ సినిమాలన్నీ గుర్తుకొస్తుంటే నేనెంత సున్నితమైనవాడినో అనిపిస్తుంది. ఎక్కడ మొదలుపెట్టాను ? ఎక్కడి వరకు వచ్చాను ? ఎన్ని శాఖల్లో పనిచేశాను ? ఆఖరికి అన్నీ పట్టు తెచ్చుకొని దర్శకుడు అనే కుర్చీలో కూర్చోడానికి ఎంత నలిగిపోయానో ! ఒక మంచి సినిమా తీయాలని ఎంత ఎంత మానసిక ఘర్షణకు గురయ్యేవాడినో తెలుసా..!

ఏడిద నాగేశ్వరరావు అయితే నన్ను చూసి కళ్లనీళ్లు పెట్టుకుంటూ నీకు ఇంత పిచ్చేమిటని నవ్వేవాడు కానీ నన్ను నమ్మేవాడు. నా చిత్రాన్ని కాగితంపై నుండి వెండితెర వరకూ వెళ్ళడానికి తన కష్టాన్ని కాసుల్ని వారధిగా మార్చేవాడు. ఒక్కసారి ఇప్పుడు తను కనిపిస్తే బాగుండు. ఒక్కసారి మనసారా కౌగిలించుకొని కృతజ్ఞత చెప్పుకోవాలని ఉందిరా..!

ఇప్పుడు తలుచుకుంటే నాకే చిత్రంగా ఉందిరా..ఒకవైపు కమర్షియల్ సినిమాల తుఫాను, మరోవైపు సమాజానికి సందేశాత్మక చిత్రాల పలకరింపులు.. అదిగో ఆ మధ్య కళ కళ అని వయసు పైబడి జీవిత చరమాంకంలో ఉన్న వ్యక్తిని నాయకుడిని చేసి శంకరాభరణం అన్నాను.. ఓడిపోయిన ఓ నాట్యకారుడిని తాగుబోతుగా చూపించి వాడు ప్రేమని, కళని ఎలా ఓడిపోయాడో చెబుతూ సాగరసంగమం తీసాను. యాక్షన్ హీరో చిరంజీవిని పట్టుకొచ్చి గోవులకు కాపు కాసేలా చేసి పిచ్చాసుపత్రిలో పడేసి ఆపద్భాందవుడు అని పేరెట్టాను. ఆ మెగాస్టార్ తోనే మళ్లీ చెప్పులు కుట్టించి స్వయంకృషి అని ఓ ప్రయోగం.. అదిగో ఆ కమల్ ని లోకం తెలియని అమాయకుడిని చేసి స్వాతిముత్యం , మమ్ముట్టిని పట్టుకొచ్చి స్వాతికిరణం, నాగేశ్వరరావుని బసవన్న పక్కన నడిపి సూత్రధారులు.. అమ్మో..అమ్మో..ఒకటా రెండా..అసలు మీరంతా ఎలా ఒప్పుకున్నారురా నా వింత ప్రయోగాల్ని .. అంత ఇష్టమారా నా సినిమాలంటే.. ఇటురా నీ నుదురు ముద్దాడి నీలోనే తెలుగువారందరిని చూసుకొని కృతజ్ఞత చెప్పుకుంటాను.

చూడు.. నీ గురించి ఆలోచిస్తూ.. మెల్లిమెల్లిగా నా గురించి నేను ఆలోచించుకుంటూ గతంలోకి వెళ్ళిపోయాను. ఆ గతమేగా ఇక ఇప్పటినుండి నా సంపూర్ణ జీవితం.అందుకే తలుచుకుంటున్నానేమో.. ఆ జీవితమంతా చూసుకుంటే నాకు కనిపిస్తున్నది మీరే కదరా.. ఇన్నాళ్లు నన్ను నడిపించారు. నన్ను ప్రోత్సహించారు. ప్రేమించారు. కొందరు కాస్త తిట్టారు, ద్వేషించారనుకో.. అది కూడా మంచికే అనుకుందాం.

అదిగో మబ్బుల నుండి ఏదో వెలుగు.. ఏదో రథం వస్తుంది. ఎక్కువ సమయం లేదురా.. ఇదిగో ఇప్పుడు గుర్తొస్తున్నాయి నా చిరకాల కోరికలు.. అరె నీకు కూడా తెలియదేమో కదా.. లేదు చాలాసార్లు చెప్పానురా.. మర్చిపోయావేమో..అవే బాపు వద్ద, బాలచందర్ వద్ద ఒక్కరోజైనా అసిస్టెంట్ గా పనిచేయాలని ఉండేదిరా.. అలాగే పూర్తవక ఆగిపోయిన నా సిరిమువ్వల సింహనాదం సినిమాని పూర్తిచేసి విడుదల చేయాలని.. ఈ రెండు కోరికలు మిగిలిపోయాయిరా..ఈ జన్మకి. అదిగో వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు.. వెళ్ళొస్తానురా ఇక. నిన్ను చూస్తుంటే నిన్ను ఇలా వదిలి వెళుతుంటే ఇప్పుడు నాకు కళ్ళ నీళ్లు వస్తున్నాయిరా..

బాగా బ్రతుకురా.. కళల్ని ,కలల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకు. సరేనా.. సాహిత్యం విలువ అందరికి అర్థం అయ్యేలా చేయరా.. నా చిట్టి తండ్రివి కదూ.. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందిరా.. నాకోసం ఒక్క పని చేసిపెడతావా?  ఎప్పటికైనా సరే చలనచిత్రం కేవలం వినోదం కాదు , ఏ కళ అయినా కేవలం కాలక్షేపం కాదు అని అందరూ స్పృహ పొందేలా ఓ తుఫాను సృష్టించరా.. నేను పైనుండి చూస్తాను.. నీకిష్టమైన సుందరుడితో, సీతారాముడితో కూడా నీ గురించి చెబుతాను. లేదులే నీ గురించి చెప్పడం మొదలుపెడితే వాళ్ళే నీ గురించి నాకు చెబుతారేమో వాడు మా శిష్యుడు మాకెందుకు తెలియదు అని.. సరేనా.. రథం కదులుతుంది. సమయం ముగుస్తుంది. పొద్దు నలుపు చిక్కదనం కరుగుతుంది. నీ మనసుని నా చిత్రాలు నడిపిస్తాయి. నువ్వు కళని వెలిగించాలి. వెలిగిస్తావురా.. తథాస్తు..!
…………………………………………

K Viswanath : ఒక్కొక్కరిగా.. దివికేగిన సినిమా త్రయం.. బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల, కె.విశ్వనాథ్..

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చదివిన ప్రతీ విశ్వనాధ్ అభిమానే కాదు. కళని, సాహిత్యాన్ని, సినిమాని ప్రేమించే వాళ్ళని, ప్రేక్షకుడు అనే ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టిస్తుంది. అయన వెళ్ళిపోయినా ఆయన సినిమాలు, ఆయన సినిమాల్లోని పాటలు, ఆయన సినిమాల్లోని పాత్రలు మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాయి.