ఏ పార్టీకి మద్దతివ్వను…అభిమానులకు అమిర్ బర్త్ డే మెసేజ్

10TV Telugu News

రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గురువారం(మార్చి-14,2019)తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన అభిమానులకు స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఏడాదిలానే ముంబైలోని బ్రాందాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావ్, మీడియా సమక్షంలో అమిర్ ఖాన్ కేక్ కట్ చేశారు.అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని,ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తారా అని అడిగినప్పుడు…తాను ఏ రాజకీయ పార్టీని ప్రమోట్ చేయనని సృష్టం చేశారు. విదేశాల్లో ఉండే భారతీయులు, అనారోగ్య కారణాల వల్ల బ్యాలెట్ బాక్స్ వరకు రాని వాళ్ల కోసం ఎన్నికల సంఘం ఏదైనా పరిష్కారం ఆలోచించాలని అమిర్ కోరాడు.పరిష్కారం ఏంటో తనకు తెలియదని కానీ వాళ్లందరి గురించి మనం ఆలోచించాలన్నారు.

ముఖ్యంగా మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న యువతకు అమిర్ ప్రత్యేక మెసేజ్ ఇచ్చారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ఎవరికి ఓటు వేయాలి,ఎలా ఓటు వేయాలి అని తాను ప్రజలకు చెప్పనని, తమ నియోజకవర్గంలో పోటీ చేసే వాళ్లు ప్రజల సమస్యలను పరిష్కరిస్తారో లేదో చూసి ఓటు వేయాలని మాత్రమే తాను చెప్పగలనన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదయ్యేలా ఓటర్లను ప్రోత్సహించాలని బుధవారం  క్రీడా,రాజకీయ,వ్యాపార ప్రముఖులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలకు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని సెలబ్రిటీలందరికీ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్-11న ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలుగా మే-19న ముగుస్తాయి.మే-23న ఫలితాలు వెలువడనున్నాయి.

×