CVL Narasimha Rao: దాసరి చెప్పారు.. మంచు విష్ణుకే నా సపోర్ట్!

నటుడు సీవీఎల్ నరసింహారావు మంచు విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

CVL Narasimha Rao: దాసరి చెప్పారు.. మంచు విష్ణుకే నా సపోర్ట్!

Cvl Narasimha Rao

CVL Narasimha Rao: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేసి మ్యానిఫెస్టో విడుదల చేసిన తర్వాత.. అనూహ్యంగా తప్పుకున్న నటుడు సీవీఎల్ నరసింహారావు.. లేటెస్ట్‌గా మంచు విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేసిన సీవీఎల్.. మంచు విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ ఇస్తున్నట్లుగా, దాసరి గారే తనతో విష్ణుకి సపోర్ట్ చేయమని చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు.

‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. దాసరిగారు నాకు కలలోకి వచ్చారు. కాస్త వెటకారంగా అనిపించినా.. ఇదే నిజం.. సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారు లేని లోటు సుస్పష్టంగా కనిపిస్తుంది. దాసరి గారే ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని నాకనిపించింది. దాసరి గారిని ఏంటండీ ఇదంతా అని అడిగాను(కలలో). అందుకు దాసరిగారు.. ‘మీరంతా నేనున్నానని అంటుంటారుగా? మీరంతా ఏం చేస్తున్నారు.

తండ్రికి మించిన తనయుడు, గురువును మించిన శిష్యుడు అంటుంటారుగా? మోహన్ బాబు నన్ను తండ్రిగా భావిస్తుంటారు. నేను అతన్ని కొడుకుగా, శిష్యుడిగా భావించాను. నా కొడుకుకి కొడుకు విష్ణు ఇప్పుడు పోటీ పడుతున్నాడు. అతడిని గెలిపించమని చెప్పను.. కానీ మోహన్ బాబుకి నేను నేర్పిన సంస్కారం, బాబు వాళ్ల అబ్బాయికి నేర్పారు. ఆ సంస్కారం వల్లే పెద్దవాళ్లందరూ కలిసి తప్పుకోమంటే తప్పుకుంటానని విష్ణు అన్నారు.

సరే ఆ విషయం పక్కన పెడితే.. మీ వ్యవహారం ఏంటి?’ అని అడిగారు. దీనికి నేను.. పెద్దవారందరినీ కూర్చోబెట్టి యునానిమస్‌గా చేయడానికి నా దగ్గర వాళ్లందరి నెంబర్లు లేవు సార్.. అని చెప్పా. అయితే మీరు చేసేది మీరు చేయండి.. నేను చేసేది నేను చేస్తానని దాసరిగారు చెప్పారు” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఇక ఇదే సమయంలో కృష్ణగారు, కృష్ణంరాజుగారు, విజయ్ చందర్‌గారు, గిరిబాబుగారు లాంటి పెద్దవారిని, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారందరూ ఒక్క గంటో, అరగంటో టైమ్ కేటాయిస్తే, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అయితే, మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించాలని సీవీఎల్ కోరారు. విష్ణు ప్యానల్‌లో బాబూమోహన్‌ని, ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో ఉత్తేజ్‌ని గెలిపించాలని కోరారు. దేశం అన్నా, దేవుడు అన్నా చులకన భావం ఉన్న ప్రకాశ్ రాజ్‌ను ఓడించాలని అభ్యర్థించారు.