సోనూసూద్ పై శివసేన తీవ్ర విమర్శలు..సాయం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్

  • Published By: venkaiahnaidu ,Published On : June 7, 2020 / 04:31 PM IST
సోనూసూద్ పై శివసేన తీవ్ర విమర్శలు..సాయం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలసకార్మికులను తమ స్వస్థలాకు చేర్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న పనికి ఆయనపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేయడంలో మానవత్వం ప్రదర్శించి, అందరితో శభాష్ అనిపించుకుంటున్న సోనూ సూద్‌ పై మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన మాత్రం విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించింది. మహారాష్ట్రలో చిక్కుకున్న ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చిన కార్మికులకు సహాయం అందించడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పేలవంగా చూపించడానికి ప్రతిపక్ష బీజేపీ సోనూ సూద్ ని ప్రోత్సహించిందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు.

శివ‌సేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్…శివసేన మౌత్‌పీస్‌ ‘సామ్నా’ వేదికగా సోనూసూద్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కరోనా క‌రాళ నృత్యం చేస్తున్న‌వేళ దేశంలో ‘కొత్త మహాత్ముడు’ ఊడిపడ్డాడని వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. సోనూ కార్యక్రమాల్లో రాజకీయ కోణం కూడా దాగి ఉందన్నారు.  ఆయనకు మద్దతుగా బీజేపీ నేతలు నిలవడమే దీనికి నిదర్శనమని సంజయ్ రౌత్ అన్నారు. సోనూసూద్ త్వరలోనే ప్రధాని మోడీని కలిసి ‘సెలెబ్రిటీ మేనేజర్ ఆఫ్ ముంబై’ అయిపోతారని సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వలస కార్మికులకు మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ అండగా ఉంటోందని… ఈ క్రమంలోనే తన సొంత ఖర్చుతో నటుడు సోనూసుద్‌ కొంతమంది కార్మికులను వారి స్వస్థలాలకు పంపించారని, ఆయన సహాయం వెనుక స్థానిక ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం చూసుకున్న విధంగా మరే రాష్ట్రమూ వలస కార్మికులను చూసుకోలేదన్నారు. లాక్‌డౌన్ కాలంలో సోనూసూద్ లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించారని, అయితే లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ సమయంలో ఆయ‌న అన్ని బస్సులను ఎలా స‌మ‌కూర్చారో  ఎవరూ ప్రశ్నించలేదన్నారు. గవర్న‌ర్ కోశ్యారీ కూడా ‘మహాత్మా సూద్’ అని ప్రశంసించారని సంజ‌య్‌రౌత్ గుర్తు చేశారు. లాక్‌డౌన్ కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను రాష్ట్రాల్లోకి అనుమతించలేదని, అలాంటి సమయంలో సోనూసూద్ పంపిన కార్మికులు ఎక్క‌డికి వెళ్లారో చెప్పాలని రౌత్ ప్ర‌శ్నించారు.

సోనూసూద్ చాలా మంచి నటుడని, మంచిప‌నే చేశాడ‌ని, కానీ ఆ ప‌ని వెనుక ఎవరో రాజకీయ దర్శకుడు ఉండే ఉంటాడ‌ని రౌత్ అన్నారు. సోనూ సూద్ ఒక నటుడని.. అతని వృత్తి మరొకరు రాసిచ్చిన స్క్రిప్ట్ లోని డైలాగ్ లు చెప్పడం మరియు దాని నుండి బయటపడటం అని సంజయ్ రౌత్ అన్నారు. బాగా డబ్బులు చెల్లిస్తే ఏ రాజకీయ పార్టీనైనా ప్రమోట్ చేయడానికి సోనూ సూద్ లాంటి చాలామంది నటులు ఉన్నారంటూ..2019 లో సార్వత్రిక ఎన్నికలకు ముందు “స్టింగ్ ఆపరేషన్” గురించి రౌత్ ప్రస్తావించారు. తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వివిధ ప్లాట్ ఫామ్స్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయడానికి సోనూసూద్ అంగీకరించినట్లు ఉన్న ఆరోపణలను ఈ సందర్భగా రౌత్ ప్రస్తావించారు.

హఠాత్తుగా కార్మికుల పట్ల సానుభూతిని పెంపొందించుకుని, వారిని పెద్ద సంఖ్యలో తిరిగి స్వస్థలాలకు పంపించే నటుడిని ఏ తెలివైన వ్యక్తి నమ్మడు అని సోనూపై శివసేన సెటైర్లు వేసింది. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా మహారాష్ట్రలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తనసొంత ఖర్చులతో విమానాలు,బస్సుల ద్వారా వారిని స్వస్థలాలకు తరలిండమే కాకుండా నిసర్గ తుపాను ముంచుకొస్తున్న సమయంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి సోనూ గొప్ప మనసు చాటుకున్న విషయం తెలిసిందే. సోనూ సహాయం దేశంలో నిజమైన హీరోగా ఆయన్ని నిలబెట్టిందంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.