కరాటేకు పూర్వ వైభవం తీసుకు రావడానికి సపోర్ట్‌గా ఉంటా..

  • Published By: sekhar ,Published On : October 4, 2020 / 06:17 PM IST
కరాటేకు పూర్వ వైభవం తీసుకు రావడానికి సపోర్ట్‌గా ఉంటా..

Karate Raju appointed as Chief Patron: నేను చిన్నప్పుడు ఒక గ్రౌండ్‌లో వందలమంది సేమ్ డ్రెస్ వేసుకుని కరాటే చేస్తుంటే చూసేందుకు చాలా ఆసక్తిగా, పండగలా అనిపించేది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.. కానీ మళ్ళీ అలాంటి వైభవం కరాటేకు రావాలని కోరుకుంటున్నాను అన్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్.

‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’ సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈ ఆదివారం జరిగిన తెలంగాణ కరాటే అసోసియేషన్, షోట్కాన్ కరాటే అకాడమీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ఫెలిసిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వక్ సేన్ తండ్రి అయిన నిర్మాత కరాటే రాజు కరాటే మాస్టర్‌గా ఎంతో ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. ఆయన కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చీప్ పాట్రాన్‌గా ఎంపికయ్యారు. అయన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌తో పాటు హీరో విశ్వక్ సేన్ ఇతర కరాటే అసోసియేషన్ ప్రముఖులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ కరాటే రాజు మాట్లాడుతూ.. ‘‘కరాటే అంటే అది యోగాకు ఫాస్ట్ వెర్షన్ అని చెప్పాలి. యోగాని స్పీడ్‌గా చేస్తే అది కరాటే అవుతుంది. కరాటే అంటే నాకు దైవంతో సమానం. కరాటే అన్నది రహస్యంగా ఉండేది, కానీ దాన్ని పోటీలు పెట్టి జనాలకు తెలిసేలా చేసింది నేనే. అప్పట్లో కరాటే ఎంత వైభోగంతో ఉండేదో మళ్ళీ అలాంటి వైభోగం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కరాటే నేటి పిల్లలకు చాలా అవసరం. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్‌లో కూడా కరాటే అన్నదాన్ని అందరు నేర్చుకునేలా చూడాలి. మనల్ని మనం కాపాడుకునే ఆయుధం కరాటే. ఈ కరాటే అభివృద్ధి చేసే విషయంలో నేను ఎప్పుడు మీ ముందుంటాను..’’ అని తెలిపారు.


నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘కరాటే రాజు నిర్మాతగానే నాకు తెలుసు కానీ ఆయన కరాటేలో మాస్టర్ అన్న విషయం ఈ మధ్యే తెలిసింది. ఓ వైపు నిర్మాతగా సినిమాలు చేస్తూనే మరోవైపు కరాటే విద్యకు సపోర్ట్ చేస్తూ మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. కరాటే అంటే అప్పట్లో హీరో సుమన్‌ని హీరోగా తీసుకోవడానికి కారణం అయన కరాటే మాస్టర్. అప్పట్లోనే సుమన్ కరాటే విద్యలో రాణించారు. అందుకే ఆయన హీరోగా ఎదిగాడు.


ఇప్పుడు అలాగే కరాటే విషయంలో మన హీరో విశ్వక్ సేన్ కూడా సపోర్ట్ అందించేందుకు తండ్రితో కలిసి ముందుకు వచ్చాడు. విశ్వక్ నువ్వు ఇప్పుడే హీరోగా రాణిస్తున్నావు, నువ్వు కూడా కరాటే నేపథ్యంలో ఓ సూపర్ యాక్షన్ సినిమా చేస్తే తప్పకుండా మంచి సక్సెస్ వస్తుంది, అలాగే కరాటేకు నువ్వు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలి..’’ అన్నారు.


హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘కరాటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మాకు అన్నం పెట్టింది కరాటే. అప్పట్లో మేము దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్నప్పుడు నాన్న ఎంతగా దానికోసం కష్టపడ్డాడో తెలుసు. ఓ చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ కష్టాలు మాకు తెలుసు, అయితే నాన్న గురించి ఓ బ్యాడ్ న్యూస్ ఉండేది. అదేమిటంటే .. ఆయన మాస్టర్‌గా చాలా కఠినంగా ఉంటాడని ప్రచారం ఉంది. ఒక వ్యక్తిని కఠినంగా పరీక్షించాకే ఒక బెల్ట్ నుంచి మరో బెల్ట్‌కు ప్రమోట్ చేస్తారని అంటుండేవారు. ఆయన హార్డ్ వర్క్ మమ్మల్ని ఇక్కడి వరకు తెచ్చింది. కరాటే ఇప్పుడు పూర్వ వైభవం కోల్పోయిందని నా అభిప్రాయం.


ఎందుకంటే నా చిన్నప్పుడు ఒక గ్రౌండ్‌లో వందలమంది సేమ్ డ్రెస్ వేసుకుని కరాటే చేస్తుంటే చూసేందుకు చాలా ఆసక్తిగా, పండగలా అనిపించేది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు .. కానీ మళ్ళీ అలాంటి వైభవం కరాటేకు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడున్న మాస్టర్స్ అందరూ నాకు తెలుసు, నేను చిన్నప్పుడు వీరిని మామ మామ అని పిలుస్తూ తిరిగే వాణ్ణి, కరాటేకు మళ్ళీ పూర్వ వైభవం రావాలి. దానికోసం నేను మీకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటాను..’’ అన్నారు.

Vishwak Sen,

Vishwak Sen,

Vishwak Sen,