ఇతర భాషల్లోకి ‘ఆహా’.. 2022టార్గెట్ ముందుగానే రీచ్ అయ్యాం!

ఇతర భాషల్లోకి ‘ఆహా’.. 2022టార్గెట్ ముందుగానే రీచ్ అయ్యాం!

తెలుగులో ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆహా.. మొదటి వార్షికోత్సవంలో వ్యవస్థాపకుల్లో ఒకరైన, మైహోమ్ డైరెక్టర్ జూపల్లి రాము రావు తన ఆనందాన్ని కార్యక్రమంలో పంచుకున్నారు. ‘ఆహా’ విజయవంతం కావడంలో పాత్రదారులైన ప్రతి ఒక్కరికీ రాము రావు కృతజ్ఞతలు తెలిపారు. ఆహాను ఆదరిస్తున్న ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా కృత‌జ్ఞతలు తెలియజేశారు. కేవలం ఏడాది కాలంలోనే ‘ఆహా’ 8.5 మిలియన్ల డౌన్‌లోడ్‌లు అయినట్లుగా వెల్లడించారు.

తెలుగు భాషలో మాత్రమే ఉండి ఓటీటీల్లో ఇంత పాపులారిటీ దక్కించుకోవడం గొప్ప విషయం అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రీజనల్ ఓటీటీ యాప్‌లలో ఆహానే నెం.1 అని గర్వంగా చెప్పగలను అన్నారు. ‘ఆహా’ ప్రయాణం ఇంతటితో ఆగదని.. ఇతర భాషల్లో కూడా అడుగుపెట్టబోతున్నట్లు చెప్పారు. ఏడాది కాలంగా ‘ఆహా’కు మద్ధతుగా నిలిచిన మీడియాకు, ప్రేక్షకులకు కృత‌జ్ఞతలు చెప్పారు.

అనంతరం ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ మాట్లాడుతూ.. ప్రతి షో గురించి, ప్రతీ ఈవెంట్ గురించి రాస్తూ.. చూపిస్తూ.. ఎంకరేజ్ చేసిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభించే సమయంలో 2022నాటికి ఇప్పుడు వచ్చిన నంబర్లు రావాలని అనుకున్నామని, కానీ, రెండేళ్ల ముందుగానే ఆ టార్గెట్ రీచ్ అయ్యామని చెప్పారు.