అలీని హాలీవుడ్ తీసుకెళ్తున్న దర్శకుడు ఎవరు?

ప్రముఖ హాస్యనటుడు అలీ నటిస్తున్న హాలీవుడ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల..

  • Published By: sekhar ,Published On : February 10, 2020 / 06:40 AM IST
అలీని హాలీవుడ్ తీసుకెళ్తున్న దర్శకుడు ఎవరు?

ప్రముఖ హాస్యనటుడు అలీ నటిస్తున్న హాలీవుడ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల..

అలీ.. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘సీతాకోకచిలుక’ సినిమాతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటినుండి నేటి వరకు నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. హాస్యనటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టెలివిజన్ హోస్టుగా పలు విభిన్న పాత్రలు పోషిస్తూ.. తనకున్న దానిలో సమాజసేవ చేస్తూ.. వివాదాలకు దూరంగా ఉంటూ అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన నటజీవితంలో మరో ఘనత సాధించారు.. అబ్దుల్ కలాం బయోపిక్ ద్వారా అలీ హాలీవుడ్‌లో సత్తా చాటబోతున్నారు.  

టిప్పూ ఫేమ్, ఫిల్మమేకర్ జగదీస్ దానేటి, హాలీవుడ్ ప్రొడ్యూషర్ మార్టినీ ఫిల్స్ అధినేత జానీ మార్టిన్ తో కలసి సినిమాలు నిర్మించబోతున్నారు.  అందులో భాగమే కలామ్ బయోపిక్.  

హాలీవుడ్ దిగ్గజాలను భారత గడ్డపై దింపి, తన కథలతో ఇండో- అమెరికన్ సినిమా  ఒప్పందాలను కుదుర్చుకున్న భారతీయ హాలీవుడ్ యువ దర్శకుడు జగదీష్ దానేటిపై కేంద్ర ప్రసార, సమాచార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసల వర్షం కురిపించారు. హాలీవుడ్‌లో ప్రత్యక్షంగా కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్ దానేటి అని ఆయన అన్నారు.

అలీ

 

లాస్ ఏంజిల్స్, అమెరికాకు చెందిన పింక్ జాగ్వర్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత జానీ మార్టిన్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో జగదీష్ దానేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న అబ్దుల్ కలాం బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంత్రి జవదేకర్ నిన్న ఢిల్లీలో ఆవిష్కరించారు.  కలాం ప్రాజెక్టుకూ, భారత దేశంలో వారు తలపెట్టిన ఇండో హాలీవుడ్ ఫిల్మ్ వెంచర్స్‌కూ భారత ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు  తెలిపారు. 

తెలుగులో బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించి 41 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటులు మహమ్మద్ అలీ 1111 చిత్రంగా అబ్దుల్ కలాం బయోపిక్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. 

అలీ

కలాం గారి పాత్ర పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఆలీ.  హాలీవుడ్‌లో నటుడిగా అడుగు పెట్టే అవకాశమిచ్చిన దర్శకుడు జగదీష్‌కు రుణపడి ఉంటానన్నారు. హాలీవుడ్ దిగ్గజం జానీ మార్టిన్ మాట్లాడుతూ : జగదీష్ దానేటిని కథల గనిగా అభివర్ణించారు. జగదీష్ చెప్పిన ఐదు కథలు తనను 
ఎంతగానో ఆకర్షించాయని, ఈ ఇండో అమెరికన్ చిత్రాల నిర్మాణంలో భాగస్వామి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పింక్ జాగ్వర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సువర్ణ పప్పు, ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల ఫిల్మ్ ఫండ్‌తో ఈ ఇండో అమెరికన్ చిత్రాల నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు.

 

జగదీష్ దానేటి రచన, దర్శకత్వంలో రాబోతున్న చిత్రాలను భారత దేశంలోని ఐదు ప్రముఖ నగరాలలో ప్రకటించనున్నట్లు తెలిపారు. భారత దేశంలో ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ టెక్నాలజీ, మీడియా పవర్ హౌసెస్, తద్వారా ఆగ్ మెంటెడ్ రియాలిటీ , వర్చ్యువల్ రియాలిటీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
జగదీష్ దానేటి మాట్లాడుతూ : ఈ నెల 16 వరకు జరుపుతున్న భారత పర్యటనలో హాలీవుడ్, ఇండో అమెరికన్ ఫిల్మ్ ప్రాజెక్టులుగా నిర్మితమవుతున్న ఐదు చిత్రాల వివరాలను ప్రకటిస్తామన్నారు. అబ్దుల్ కలాం గారి బయోపిక్‌కి  దర్శకత్వం వహించటం భారత కీర్తిని ప్రపంచ దేశాలకు తెలియజేసే బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. 
 

అలీ