అమెజాన్ గోడౌన్లుగా మారుతున్న థియేటర్లు…యాజమాన్యాలతో లీజు ఒప్పందం

  • Published By: bheemraj ,Published On : December 15, 2020 / 12:05 PM IST
అమెజాన్ గోడౌన్లుగా మారుతున్న థియేటర్లు…యాజమాన్యాలతో లీజు ఒప్పందం

Amazon Special focus on single screen theaters : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కన్ను…ఇప్పుడు థియేటర్లపై పడింది. ప్రైమ్‌తో ఓటీటీలో ప్రభంజనం సృష్టించిన
అమెజాన్… సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే…అమెజాన్‌ థియేటర్లను తీసుకుంటోంది సినిమాల కోసం కాదు. రెడీమేడ్ గోడౌన్లగా మార్చేందుకు. భారత్‌లో రీటెయిల్ మార్కెట్‌పై పట్టు సాధించాలన్నది అమెజాన్ లక్ష్యం. ఆర్డర్‌ చేసిన ఐటెమ్‌ను అత్యంత వేగంగా కస్టమర్‌కు చేరవేయడం ద్వారా రీటెయిల్‌ రంగంలో ఆధిపత్యం సాధించవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మూతపడడానికి సిద్ధంగా ఉన్న థియేటర్లను తీసుకుని…ఎక్కడికక్కడ గోడౌన్లు సిద్ధం చేయాలని నిర్ణయించింది.

కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది మార్చిలో మూతపడ్డ సింగిల్ థియేటర్లు ఇప్పటిదాకా తెరుచుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనల మధ్య థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా…యాజమాన్యాలు ఆసక్తి చూపడం లేదు. ప్రేక్షకులెవరూ థియేటర్ల వైపు రారన్న భయమే ఇందుకు కారణం. ఇప్పటికే థియేటర్లు మూతపడి పది నెలలయింది. ఇంకెంత కాలం ఈ పరిస్థితి ఉంటుందో తెలియదు. సింగిల్ థియేటర్ల యజమానులకు కరోనా కారణంగా ఇప్పటికే అపారనష్టం కలిగింది.

వ్యాక్సిన్ అందుబాటులోకొచ్చి…కొన్ని నెలల తర్వాత జనజీవనం సాధారణ స్థితికి చేరినా…థియేటర్లు మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటాయన్న గ్యారంటీ లేదు. కరోనాకు ముందే నగరంలో మల్టీప్లెక్స్ కల్చర్‌ బాగా పెరిగిపోయింది. దీనికి తోడు ఓటీటీల ప్రభావంతో సింగిల్‌ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. వాటిని తెగనమ్ముకోలేక, నడిపించలేక పడరాని పాట్లు పడుతున్నారు యజమానులు. ఇదే అమెజాన్‌ను ఆకర్షించింది. రెట్టింపు ఆదాయం ఆఫర్ చేసి థియేటర్లను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

రీటెయిల్ మార్కెట్ కోసం హైదరాబాద్‌లో ఇప్పటికే అతిపెద్ద కేంద్రం ఏర్పాటు చేసుకుంది అమెజాన్. ఇక స్థానికంగా ఎక్కడికక్కడ గోడౌన్‌లు ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టింది. సింగిల్ థియేటర్లన్నీ నగరంలో ఎక్కువగా జనసమ్మర్ధ ప్రాంతాల్లోనే ఉన్నాయి. థియేటర్లు, చుట్టూరా ఉండే స్థలం కూడా గోడౌన్‌ లేదా లాజిస్టిక్ సెంటర్‌కు సరిగ్గా సరిపోతుంది. సాధారణంగా థియేటర్లలో ఓ సినిమా విడుదలై హిట్ టాక్ సంపాదిస్తే ఖర్చులన్నీ పోగా…నెలకు పది నుంచి 12లక్షల ఆదాయం వస్తుంది.

అమెజాన్ ఇంతకు రెట్టింపు డబ్బులు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మామూలుగా థియేటర్లకు సినిమా హిట్ అయితేనే లాభాలు. సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే…భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సిందే. అమెజాన్ ఆఫర్‌లో ఈ హిట్టు, ఫ్లాప్పులకు సంబంధం లేదు. థియేటర్లకు నికరంగా 25లక్షల దాకా ఆదాయం లభిస్తుంది. నష్టాలతో సతమవుతున్న థియేటర్ల యాజమాన్యాన్ని అమెజాన్ ఆఫర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మెహిదీపట్నం, నారాయణ గూడ, వనస్థలిపురంలోని పలు థియేటర్లతో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

అటు అమెజాన్‌కు, ఇటు థియేటర్ల యాజమాన్యాలకు… ఇద్దరికీ ఈ డీల్ లాభదాయకమంటున్నారు మార్కెట్ నిపుణులు. థియేటర్లు నష్టాల నుంచి బయటపడితే…ఆర్డర్ చేసిన ఐటెమ్స్‌ను స్థానిక గోడౌన్ల నుంచి వేగంగా సరఫరా చేయడం ద్వారా అమెజాన్ రీటెయిల్ మార్కెట్‌లో పై చేయి సాధించే అవకాశముందని భావిస్తున్నారు.