AP Govt : సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌

సినిమా ధియేటర్లలో అధిక రేట్లు, బ్లాక్ మార్కెటింగ్‌కు జగన్ సర్కార్ చెక్ పెట్టబోతోంది. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకురానున్నట్లు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

AP Govt : సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌

Movie Ticket

Special Website Booking Movie Tickets : ఓ వైపు సినిమా టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరుగుతున్న వేళ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక రేట్లతో సినీ ప్రేక్షకులతోపాటు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న వారికి చెక్‌ పెట్టబోతోంది. ఇకపై సినిమా టికెట్ల కోసం ఓ ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

సినిమా ధియేటర్లలో అధిక రేట్లు, బ్లాక్ మార్కెటింగ్‌కు జగన్ సర్కార్ చెక్ పెట్టబోతోంది. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. సినిమా టికెట్‌ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు త్వరలోనే పోర్టల్‌ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో ఈ పోర్టల్‌ రూపొందించనున్నట్టు తెలిపింది.

తమిళనాడు‌ తరహాలో.. సినిమా టికెట్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించబోతోంది ఏపీ ప్రభుత్వం. తమిళనాడులోని థియేటర్లన్నింటిని ఆన్‌లైన్ చేసే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం ఎప్పుడో మొదలుపెట్టింది. బి,సి సెంటర్స్‌లోని థియేటర్లని కూడా అక్కడ ఆన్‌లైన్ చేస్తోంది. అక్కడి సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే ప్రక్రియను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రంలోనూ దాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

ఓ వైపు టికెట్ల ధరల దుమారంపై.. హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 35 పై నిర్మాత నట్టికుమార్ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు అధిక రేట్లకు బ్లాక్‌ లో టికెట్లు అమ్ముతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 35 రూపాయల టిక్కెట్లను కొంతమంది థియేటర్ యజమానులు 100 రూపాయలకు బహిరంగంగా అమ్ముతున్నారని కోర్టుకు వివరించారు. ఈ బ్లాక్ మార్కెట్ కారణంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందన్నారు.

నిర్మాత నట్టి కుమార్ లేవనెత్తిన అంశంపై దృష్టి సారించిన ఏపీ సర్కార్.. రాష్ట్రంలోని థియేటర్స్‌లో అమలవుతున్న టికెట్ల విక్రయ ప్రక్రియను నిశితంగా గమనించింది. ఆ తర్వాతే రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను స్వాగతించారు నిర్మాత నట్టికుమార్. ప్రభుత్వ నిర్ణయం సినీపరిశ్రమకు శుభపరిణామన్నారు.

టికెట్ల విక్రయం కోసం రూపొందించబోయే పోర్టల్ వ్యవహారాలను ఏపీ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షించనుంది. ఇందుకు సంబంధించిన విధి, విధానాలు… అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకోనుంది.