Chandan Kumar : కన్నడ నటుడు చందన్ కుమార్ పై బ్యాన్.. తెలుగు టీవీ ఫెడరేషన్

ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ''ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి, ఒక నటుడికి జరిగిన సమస్య. కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది, కానీ అతను కన్నడ మీడియా ముందు చాలా తప్పుగా మాట్లాడాడు. ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చాడు.............

Chandan Kumar : కన్నడ నటుడు చందన్ కుమార్ పై బ్యాన్.. తెలుగు టీవీ ఫెడరేషన్

Telugu Tv Fedaration :  రెండు రోజుల క్రితం సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో తెలుగులో గుర్తింపు పొందిన బుల్లితెర హీరో, కన్నడ నటుడు చందన్ కుమార్ సీరియల్ షూటింగ్ లో సీరియల్ కి పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిడుతూ, అతన్ని కొట్టి హంగామా చేశాడు. దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కారణం లేకుండానే బూతులు తిట్టాడని, నా తల్లిని దూషించాడని అతనితో వాదనకి దిగాడు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న వారంతా హీరోపై సీరియస్ అయ్యారు. అతనిని క్షమాపణ చెప్పమనడంతో చందన్ కుమార్ నేనేంటో చూపిస్తా అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్ ని అందరి ముందే కొట్టాడు.

‘శ్రీమతి శ్రీనివాస్‌’ సీరియల్ షూటింగ్ టైంలో ఈ గొడవ జరిగింది. చుట్టూ ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించగా చందన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడితో గొడవ ముగిసింది అనుకుంటే చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమపై అసత్యాలు ప్రచారం చేస్తూ, తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడాడు. దీంతో ఈ ఇష్యూ పెద్దదైంది. తెలుగు పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడినందుకు నేడు తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేసింది.

తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశంలో బాధితుడు అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ..”షాట్ రెడీ అని నాలుగు సార్లు పిలిచాను, అయినా రాకుండా నన్ను కొట్టి, బూతులు తిట్టాడు. డైరెక్టర్ సర్ కి కంప్లైంట్ చేస్తే బయటకి రా దమ్ముంటే నేనెంతో చూపిస్త అన్నాడు” అని తెలిపాడు.

పలువురు ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ”ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి, ఒక నటుడికి జరిగిన సమస్య. కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది, కానీ అతను కన్నడ మీడియా ముందు చాలా తప్పుగా మాట్లాడాడు. ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చాడు. తెలుగులో సరిగ్గా చూడట్లేదు, కొట్టారు అని ఏవేవో మాట్లాడి సమస్యని తప్పు దోవ పట్టించి, పెద్దది చేశాడు. కన్నడ నుంచి చాలా మంది ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి నటిస్తున్నారు. వాళ్ళెవ్వరికి రాని సమస్య అతనికే వచ్చింది అంటే తప్పెవరిదో ఆలోచించండి.

Telugu Serials : తెలుగు బుల్లితెరపై కన్నడ నటీనటుల బ్యాన్..?

తెలుగులో దాదాపు 60సీరియల్స్ జరుగుతుంటే కనీసం 200 మంది కన్నడ ఆర్టిస్ట్ లు పని చేస్తున్నారు. అతని మీద గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. అతని యాటిట్యూడ్ ఏంటో అందరికి తెలుసు. అతను చేసిన తప్పుకు కన్నడ ఆర్టిస్టులందర్నీ సపరేట్ చేయాలని చూస్తున్నారు. తెలుగులో టాలెంటెడ్ వాళ్ళు లేక ఇక్కడి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నామని అన్నాడు. మేము ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నాము. ఇక్కడ ఆర్టిస్టులు లేక కాదు. మీరు తెలుగు వాళ్ళని బ్యాన్ చేస్తే మహా అయితే ఓ 20 మందికి నష్టం. అదే మేము కన్నడ వాళ్ళని బ్యాన్ చేస్తే 200 మంది ఆర్టిస్టులు నష్టపోతారు. మీకే నష్టం, మాకేం కాదు.

ఇద్దరి వ్యక్తుల మధ్య సమస్యని ప్రాంతీయ సమస్యగా చూపిస్తున్నాడు చందన్. ముందు కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ కి క్షమాపణ చెప్తే చాలు అనుకున్నాం. కానీ అతను ప్రెస్ మీట్ పెట్టి చాలా తప్పుగా మాట్లాడాడు. అందుకే చందన్ కుమార్ పై తెలుగు సీరియల్స్ లో బ్యాన్ విధిస్తున్నాం. అతన్ని తెలుగులో ఇకపై ఏ సీరియల్ కి తీసుకోము. దీనికి ఫెడరేషన్ మొత్తం ఒప్పుకుంది. అక్కడి వాళ్ళు కూడా నిజాలు తెలుసుకోవాలి. కావాలంటే కూర్చొని మాట్లాడతాము. అతను చేసిన తప్పుకి మేము కన్నడ నటులందర్నీ తప్పుగా చూడము. చాలా రోజుల నుంచి వాళ్ళు మాతో కలిసి నటిస్తూ మా ఫ్యామిలిలో భాగమయ్యారు” అని తెలిపారు.