Shruti Das : నల్లగా ఉన్నా అందుకే అవకాశాలు.. దారుణమైన ట్రోలింగ్.. పోలీసులకు నటి శ్రుతి ఫిర్యాదు

Shruti Das : నల్లగా ఉన్నా అందుకే అవకాశాలు.. దారుణమైన ట్రోలింగ్.. పోలీసులకు నటి శ్రుతి ఫిర్యాదు

Shruti Das

Shruti Das : బెంగాలీ బుల్లితెర నటి శ్రుతి దాస్ (25) పోలీసులను ఆశ్రయించారు. తన శరీర రంగును(స్కిన్ టోన్) అపహాస్యం చేస్తూ ట్రోలింగ్ కు పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. గత రెండేళ్లుగా తాను ఈ వేధింపులను భరిస్తున్నానని, కానీ ఇటీవల మితిమిరిన స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండడంతో కోల్ కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శ్రుతి దాస్ వెల్లడించారు.

సోషల్ మీడియా ట్రోలింగ్ ను పట్టించుకోవద్దని తనకు చాలామంది సూచించారని, ఆ విధంగానే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని తెలిపారు. తన మొట్టమొదటి టీవీ సీరియల్ త్రినయని దర్శకుడితో ప్రేమలో ఉన్నానని, ఈ విషయం వెల్లడి కావడంతో సోషల్ మీడియాలో వేధింపులు అధికం అయ్యాయని శ్రుతి వాపోయారు. తన వ్యక్తిత్వాన్ని, తన ప్రతిభను కించపరిచేలా కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్స్‏లో అవకాశాల కోసం దర్శకులకు కమిట్‏మెంట్స్ ఇస్తున్నానని.. అందుకే తనకు ఛాన్సులు వస్తున్నాయని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారని నటి శ్రుతి వాపోయారు.

కాగా, ఈమెయిల్ ద్వారా బెంగాలీ నటి శ్రుతి దాస్ ఫిర్యాదును స్వీకరించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

”బ్లాక్ బోర్డ్, నలుపు అమ్మాయి అనే పేర్లతో నన్ను వేధిస్తున్నారు. అసలు నీలాంటి వాళ్లను హీరోయిన్లుగా ఎలా పెట్టుకుంటున్నారంటూ కించపరుస్తున్నారు. అంతేకాదు.. మెయిన్ రోల్స్ కోసం నేను దర్శకులకు కమిట్‏మెంట్ ఇస్తున్నానని.. అందుకే నాకు లీడ్ రోల్స్ వస్తునాయని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నేను ఓ డైరెక్టర్‍తో రిలేషన్ షిప్ లో ఉన్నానని.. అందుకే నాకు ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. కానీ అవన్ని నిజం కావు. నా ప్రతిభే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఎవరి వల్లనో నాకు అవకాశాలు రావడం లేదు. ప్రేక్షకులు నన్ను అంగీకరించకపోతే ఇక్కడివరకు వచ్చేదాన్ని కాదు.. గత రెండేళ్లుగా నాపై ఇలాంటి మాటలు వస్తూనే ఉన్నాయి. ఇక భరించేది లేదు” అని శ్రుతి దాస్ అంది.

ప్రస్తుతం ఆమె.. ‘దశేర్‌ మాతీ’ అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో శృతితో పాటు పాయల్‌ దే, రుక్మా రే అనే మరో ఇద్దరు నటీమణులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మేని ఛాయతో శృతి స్కిన్‌ కలర్‌ను పోలుస్తూ ఈ విధంగా ట్రోల్స్‌ తో రెచ్చిపోతున్నారు.