ఇంట్లో పనివాడే నాపై అత్యాచారం చేయబోయాడు : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్తీసింగ్

  • Published By: chvmurthy ,Published On : January 12, 2020 / 09:52 AM IST
ఇంట్లో పనివాడే నాపై అత్యాచారం చేయబోయాడు : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్తీసింగ్

తమ ఇంట్లో పనిచేసే పనివాడే తనపై అత్యాచారం చేశాడని… ఆ షాక్ నుంచి తేరుకోడానికి ఏడాది పైగా టైం పట్టిందని బిగ్ బాస్-13 కంటెస్టెంట్ ఆర్తీ సింగ్ తెలిపారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌  హౌస్ లోకి….  సినిమా ప్రమోషన్లో భాగంగా ‘ఛపాక్‌’ సినిమా యూనిట్ వచ్చిన సందర్భంలో ఆమె  ఈ సంచలన విషయాలు బయటపెట్టారు. 

యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌తో పాటు హీరోయిన్‌ దీపిక పదుకొనే, హీరో విక్రాంత్‌ మాస్సే  బిగ్ బాస్  హౌస్ లోకి వచ్చారు.  ‘మిమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన విషయాలను పంచుకోండి’ అని దీపికా పదుకొనే బిగ్‌బాస్ ఇంటి సభ్యులను కోరగా… ఆర్తీసింగ్ తనకు 13 ఏళ్ల వయసులో ఎదురైన ఈ దారుణ అనుభవాన్ని వివరించారు. 

“అప్పుడు నాకు 13 ఏళ్లు… ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిద్రపోతున్నప్పుడు మా ఇంట్లో పని చేసే వ్యక్తి నాపై అత్యాచారం చేయబోయాడు. దీంతో భయపడిపోయి నేను ఏడ్చాను, అరిచాను,  అతడిని ప్రతిఘటించాను… అతని బట్టలను చింపాను, బయటివాళ్ల సహాయం కోసం గొంతు చించుకుని అరిచాను. అతడి నుంచి తప్పించుకోటానికి రెండో అంతస్థు నుంచి దూకేశాను.ఆ సమయంలోనే నాలో ఎంతటి శక్తి దాగుందో తెలిసింది.. అలా నన్ను నేను కాపాడుకున్నాను. 

కానీ ఈ ఘటన తర్వాత నేను చాలా కుంగిపోయాను. నాకు తరచూ ప్యానిక్ అటాక్స్ వచ్చేవి. అలాంటి మానసిక స్థితి నుంచి బయటపడేయడానికి నా తల్లి, సోదరుడు ఇచ్చిన మానసిక స్ధైర్యంతో బయట పడ్డాను. ఇప్పుడు కూడా దీని గురించి మాట్లాడుతుంటే నా చేతులు వణుకుతున్నాయి. ఇప్పటికీ ఒంటరిగా నిద్రించాలంటేనే వెన్నులో వణుకు పడుతుంది. అందుకే ఇప్పటికి  భయంతో నా గది తెలుపులు తెరుచుకునే నేను నిద్రపోతాను’ అని ఆమె చెప్పింది.

అయితే తనకు జరిగిన చేదు ఘటన గురించి సరైన వేదికపైనే మాట్లాడాలనుకున్నానని ఆర్తి సింగ్‌ తెలిపింది. దానివల్ల తాను చెప్పాలనుకున్న విషయం ఎక్కువ మంది మహిళలకు చేరుతుందని చెప్పుకొచ్చింది. కాగా మహిళలు తమపై జరిగే దాడులను తప్పనిసరిగా బయట పెట్టాలని కోరింది. కనీసం తల్లిదండ్రులతోనైనా చెప్పుకోవాలని సూచించింది. ఇక మిగతా కంటెస్టెంట్లు సైతం తాము ఎదుర్కొన్న ఘటనల గురించి చెప్తూ  కన్నీటి పర్యంతమయ్యారు.