బిగ్ బాస్ విజేత రాహుల్: చిరంజీవి చేతుల మీదుగా టైటిల్

  • Published By: vamsi ,Published On : November 3, 2019 / 04:56 AM IST
బిగ్ బాస్ విజేత రాహుల్: చిరంజీవి చేతుల మీదుగా టైటిల్

అన్ని భాషల్లోనూ కలిపి ఇప్పటివరకు 32 బిగ్‌బాస్ షోలు జరిగాయి. నాలుగు ఇంకా రన్నింగులో ఉన్నాయి. తెలుగులో ఇప్పుడు పూర్తయ్యింది మూడవ సీజన్. అసలు తెలుగులో ఈ షోకి ఇంత ఆదరణ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అయితే ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడంతో తెలుగులో కూడా ఈ షో పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ సీజన్‌లో శివబాలాజీ విజేత కాగా, రన్నరప్ ఆదర్శ్… ఇక నానీ హోస్టుగా చేసిన రెండో సీజన్ గీతామాధురి మొదటి నుంచీ బాగా ఆడింది అయితే చివరకు కౌశల్‌ విజేతగా నిలిచారు.

ఇప్పుడు మూడవ సీజన్ పదిహేడు మంది కంటెస్టెంట్లతో జులై 21న అట్టహాసంగా ప్రారంభం కాగా.. వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105రోజుల పాటు సాగింది. చివరకు ఇవాళ(03 నవంబర్ 2019) ముగిసింది. నాగార్జున హోస్ట్‌గా సాగిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో చివరకు ఐదుగురు ఇంటి సభ్యులు శ్రీముఖి, రాహుల్‌ సిప్లింగజ్‌, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజా ఫైనల్‌కు చేరుకున్నారు.

వంద రోజులకు పైగా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎట్టకేలకు ముగిసింది. ఫైనల్ షో లో భాగంగా గ్రాండ్‌ ఫినాలె నుంచి ఎలిమినేట్‌ అయిన తొలి కంటెస్టెంట్‌గా టీవీ నటుడు అలీ రెజా నిలిచారు. డైరెక్టర్ మారుతి, హీరోయిన్‌ రాశీ ఖన్నా అలీని బయటకు తీసుకొచ్చారు. అంటే ఐదవ ప్లేస్‌లో అలీ నిలవగా.. తర్వాత నాల్గవ ప్లేస్‌లో వరుణ్ సందేశ్ నిలిచారు. టాప్‌-5లో ఉన్న కంటెస్టెంట్లలో అలీ రెజా బయటకు వచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ ను హీరో శ్రీకాంత్ బయటకు తీసుకుని వచ్చారు. అంతకుముందు బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌ని తీసుకోలేదు వరుణ్ సందేశ్.

ఇక మూడవ ప్లేస్‌లో బయటకు వచ్చారు బాబా భాస్కర్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు హీరోయిన్ అంజలి బాబా భాస్కర్‌ను బయటకు తీసుకుని వచ్చారు. ఇక తర్వాత నాగార్జున నేరుగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి మిగిలిన శ్రీముఖి, రాహుల్‌ని బయటకు తీసుకుని వచ్చారు.  చివరకు వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్ధంగా షో ఆడిన శ్రీముఖి రన్నరప్‌గా నిలవగా..  ఏ ప్లానింగూ, ఎటువంటి వ్యూహాలు లేకుండా నేచురల్‌గా ఉన్న రాహుల్ చివరకు బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన రాహుల్‌కు మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ టైటిల్ అందజేశాడు.