Sirivennela: కన్నీళ్ల సాక్షిగా..! ముగిసిన అర్ధరాత్రి సూరీడి అంత్యక్రియలు- Live Updates

సిరివెన్నెలకు ప్రముఖులు, అభిమానుల అంతిమ వీడ్కోలు- Live Updates

10TV Telugu News

సిరివెన్నెలకు ప్రముఖులు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఫిలించాంబర్ లో సిరివెన్నెల భౌతికకాయం ఉంచారు. కడసారి నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ, పలు రంగాల ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. ఆయనతో అనుబంధం.. తమపై సిరివెన్నెల ప్రభావాన్ని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ మహాప్రస్థానంలో ‘సిరివెన్నెల’ అంత్యక్రియలు నిర్వహించారు.

 • ఇక సెలవ్..! ముగిసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు

  మహాప్రస్థానంలో  సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పెద్ద కొడుకు యోగి సిరివెన్నెలకు తల కొరివి పెట్టాడు. భారమైన హృదయంతో… అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు మహాప్రస్థానం విడిచి వెళ్లిపోయారు.

 • మహాప్రస్థానానికి సిరివెన్నెల పార్థివదేహం

  మహాప్రస్థానానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివ దేహం చేరుకుంది. ప్రత్యేక వాహనంలో.. ప్రముఖులు, అభిమానుల మధ్య అంతిమయాత్ర ముగింపునకు చేరింది.

 • సిరివెన్నెల అంతిమ యాత్ర.. అంత్యక్రియలు లైవ్ చూడండి

 • సిరివెన్నెల అంతిమయాత్ర

  సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమ యాత్రకు అంతా సిద్ధమైంది. ఫిలిం ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర జరగనుంది. ఇప్పటికే ఫిలింఛాంబర్లో సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళులు అర్పించారు సినీ,రాజకీయ ప్రముఖులు. మరికొద్ది సేపట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

 • నా బాధ చెప్పేందుకు సిరివెన్నెల కలం కావాలి – NTR

  “కొన్నిసార్లు మన ఆవేదన, బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా మాటలు రావు. అలాంటి మాటలనే ఆ మహానుభావుడే తన కలంతో వ్యక్తపరచాలి. నా ఆవేదనను కూడా ఆయన కలంతోనే ఆయనే వ్యక్తపరిస్తే బాగుండేది. ఆయన కలం ఆగినా.. ఆయన రాసిన మాటలు, పాటలు, సాహిత్యం… తెలుగు జాతి, భాష బతికున్నంత కాలం చిరస్మరణీయంగా బతికే ఉంటుంది. రాబోయే తరానికి ఆ సాహిత్యం బంగారు బాట వేయాలి. తెలుగు సాహిత్యం వైపు ఆయన చల్లని చూపు ఎల్లపుడూ ఉండాలి అని కోరుకుంటున్నా” అని ఎన్టీఆర్ చెప్పారు.

 • నివాళులు అర్పించిన ప్రముఖులు

  ఈ ఉదయం కిమ్స్ నుంచి ఫిలిం చాంబర్ కు సిరివెన్నెల పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. అక్కడ సిరివెన్నెల పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులు అర్పించారు.

  దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ఎమ్మెస్ రాజు, అశ్విని దత్, సాయి కుమార్, కళ్యాణి మాలిక్, కాసర్ల శ్యామ్, సి కళ్యాణ్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్,  సజ్జనార్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, డి వి వి దానయ్య, బుర్రా సాయి మాధవ్, నిర్మాత అల్లు అరవింద్, మురళి మోహన్, నిర్మాత ఛత్రపతి ప్రసాద్, నిర్మాత కె ఎల్ నారాయణ, తనికెళ్ల భరణి, రావు రమేష్, డైరెక్టర్ మారుతి, చోటా కే నాయుడు, క్రిష్, మలినేని గోపీచంద్, బాబీ, శ్రీకాంత్ అడ్డాల, స్వప్న దత్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నాగార్జున, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, జీవిత రాజశేఖర్, జగపతి బాబు సింగర్ కౌసల్య, ఘంటాడి కృష్ణ, శర్వా నంద్, నాగబాబు, శివాజీ రాజా, నరేష్, మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు కడసారి నివాళులు అర్పించారు.

 • ఆ పాట మరిచిపోలేను- నాగార్జున నివాళి

  సిరివెన్నెలతో తనకు ఎప్పటినుంచో స్నేహం ఉందని గుర్తుచేసుకున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున. హైదరాబాద్ ఫిలించాంబర్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో మాట్లాడారు.

  “సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. ఎప్పుడు కలిసినా ఏం మిత్రమా అనే వారు. క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా పాట… నా కెరీర్ లోనే మరిచిపోలేనిది. ఆ పాటను నేను ఆయన పక్కన కూర్చొని రాయించుకున్నా. ఈ పాట మదిలో మెదిలినప్పుడల్లా సిరివెన్నెల నాకు గుర్తొస్తూనే ఉంటారు. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలు స్ఫూర్తినిస్తాయి. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా పాటలు వినిపిస్తుంటారు” అని నాగార్జున అన్నారు.

 • సిరివెన్నెల పదవిన్యాసం ఓ చెరగని ముద్ర- మంత్రి పేర్ని నాని

  హైదరాబాద్ ఫిలించాంబర్ లో సిరివెన్నెల పార్థివదేహానికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని నివాళులు అర్పించారు. “తెలుగు అక్షరాలు 56 అయినా కూడా.. వాటిని తన పద విన్యాసం జోడించారు. సినీ పరిశ్రమ పైన మాత్రమే కాకుండా తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారిపై తన ముద్ర వేసిన వ్యక్తి సిరివెన్నెల. తెలుగు జాతి గర్వపడేలా గేయాలు రాసిన వ్యక్తి సిరివెన్నెల. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం” అన్నారు పేర్ని నాని.

 • పోలీసులంటే సిరివెన్నెలకు ఎంతో ఇష్టం – సజ్జనార్

  సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నివాళులు అర్పించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పారు. సిరివెన్నెలతో  తనకు చాలా పరిచయం ఉందని.. సైబరాబాద్ సీపీ గా ఉన్నప్పుడు కరోనా సమయంలో పోలీస్ వ్యవస్థ మీద ఒక పాట కూడా రాశారని గుర్తుచేశారు. తానే స్వయంగా వచ్చి పాటను రీలీజ్ చేశారన్నారు. పోలీస్ అంటే సిరివెన్నెల కు ఎంతో ప్రేమ ,అభిమానం అనీ.. రెండేళ్ల నుండి సిరివెన్నెలతో బాగా పరిచయం ఏర్పడిందని అన్నారు. వారం రోజుల క్రితం సిరివెన్నెలతో మాట్లాడననీ.. రాబోయే సినీ రైటర్స్ సిరివెన్నెలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు సజ్జనార్.

 • హీరో నాని నివాళులు

  సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులు అర్పించారు హీరో నాని.

 • ఏం మాట్లాడాలో తెలియడం లేదన్న బాలయ్య

  సిరివెన్నెలకు నివాళి అర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు బాలకృష్ణ. “ఈరోజు చాలా దుర్దినం. ఇది నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తెలుగు భాషకు, సాహిత్యానికి సిరివెన్నెల భూషణం.
  తాను పుట్టిన జాతికి వన్నె తెచ్చాడు. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మహానుభావుడు. ఎప్పుడు కలిసినా ఎంతో చలాకీగా మాట్లాడేవారు. నాకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం, ఆ విషయంలో సిరివెన్నెల స్ఫూర్తిగా నిలిచారు. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఇంకా ఎంతో సేవలందించాల్సిన ఆయన లేకపోవడం బాధాకరం” అన్నారు బాలయ్య.

 • ఈ వార్త ఊహించలేకపోతున్నా – చిరంజీవి

  సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులు అర్పించారు మెగా స్టార్ చిరంజీవి. నిన్న కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి హాస్పిటల్ బెడ్ పై ఉన్న సిరివెన్నెలను చూసి భావోద్వేగానికి లోనయ్యారాయన. నెలాఖరుకు చెన్నై వెళ్దామని ఇటీవలే చెప్పిన సిరివెన్నెల ఇలా శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లడం తనను చాలా బాధపెడుతోందన్నారు చిరంజీవి.

  “చిత్రపరిశ్రమకు సిరివెన్నెల తీరని లోటు. ఆయన లేని లోటు, ఎవరూ కూడా భర్తీ చేయలేరు. సమాజాన్ని మేలుకొలిపే సమాజం ఆలోచింపజేసేలా ఆయన మాటలు పాటలు ఉండేవి. కొద్ది రోజుల క్రితమే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని చెన్నై వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పాను. నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చెన్నై వెళ్దామని సిరివెన్నెలకు చెప్పాను. ఇంతలోనే ఇలాంటి వార్త వింటామని ఊహించలేదు. కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లే ముందే నాతో ఫోన్లో మాట్లాడారు. పుట్టిన వెంటనే ఎవరు కూడా మెగాస్టార్ కాలేరని చాలా సందర్భాల్లో నాతో అనేవారు.” అని చెప్పారు చిరంజీవి.

×