కోడి రామకృష్ణకు సినీ ప్రముఖుల అశ్రు నివాళి

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 07:44 AM IST
కోడి రామకృష్ణకు సినీ ప్రముఖుల అశ్రు నివాళి

హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించారు. అంతకుముందు ఆయన నివాసానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు కృష్ణంరాజు, సంగీత దర్శకుడు కోటి, జగపతిబాబు, కైకాల సత్యనారాయణ, బాలకృష్ణ, సుమన్, డైరెక్టర్ శంకర్, జగపతి బాబుతోపాటు పలువురు నటులు కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మృతి పట్ల పలువురు సినీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 
దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ కోడి రామకృష్ణ స్నేహితుడిలా, బంధువుగా ఎంతో కలిసిమెలసి ఉండేవారని తెలిపారు. 140 సినిమాలు తీశారని, ప్రతి సినిమాకూ వైవిధ్యం ఉండేటట్లు అన్ని రకాల సినిమాలు తీసిన చరిత్ర ఆయనదన్నారు. రోజూ ఏదో ఒక స్క్రిప్ట్‌ రాసేవారని.. ఎప్పడు కలిసినా సినిమాలు తీయాలన్న తాపత్రయంతో ఉండేవారని చెప్పారు. ఆయన అకాల మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన అకాల మృతికి కోడి రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భూమి మీద అందరూ పుడుతారు గిడుతారు. కానీ ఎవరైతే మరణం అనంతరం శాశ్వతంగా ప్రజల్లో నిలిచిపోతారో వారి జన్మకే సార్థకత, పరిపక్వత, ఒక పరమార్థం ఉన్నట్లని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. ఆ కోవకు చెందిన వారే దర్శకుడు కోడి రామకృష్ణ అని కొనియాడారు. ఆయన లేరన్నది నమ్మలేని సత్యమన్నారు. తెలుగు చిత్ర రంగంలో కోడి రామకృష్ణ లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన అద్భుతమైన వినోదాత్మక, సందేశాత్మక, సమాజిక స్పృహ కలిగిన చిత్రాలను తీశారని పేర్కొన్నారు. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారని తెలిపారు. ఆయన దర్శకత్వంలో అనేక సినిమాల్లో తాను నటించానని.. ఎన్నో సినిమాలు మైలురాళ్లుగా నిలిచాయన్నారు. అది తన పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కోడి రామకృష్ణతో తనకున్న అనుబంధాన్ని గురించి సంగీత దర్శకుడు కోటి వివరించారు. చలన చిత్ర పరిశ్రమకే కాదు.. స్నేహితుడిగా, ఒక బంధువుగా తీరని లోటని అన్నారు. ఎన్నో మంచి, గొప్ప సినిమాలు తీశారని.. తనతో ఆరు సినిమాలు చేశారని సినీనటుడు జగపతి బాబు అన్నారు. ఆయన ఎప్పటికీ మనతో ఉంటారని.. ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు. అనేక జోన్లర్లలో సినిమాలు తీశారని..ఎంతో మంది కొత్తవారికి అవకాశాలు కల్పించారని డైరెక్టర్ శంకర్ తెలిపారు. ఎంతోమంది శిశ్యులను తయారు చేసి ఇండస్ట్రీకి అందించారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి, డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

రామకృష్ణ మరణం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని కైకాల సత్యనారాయణ అన్నారు. ఆయన తనను ఎప్పుడూ గురువుగారు అని పిలిచేవారన్నారు. ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను సినీ పరిశ్రమకు పరిచయం చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కోడి రామకృష్ణ వండర్ ఫుల్ డైరెక్టర్ అని సినీ నటుడు సుమన్ అభివర్ణించారు. డైలాగ్స్ తో సహా యాక్ట్ చేసి చూపించేవారని తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ..కోడి రామకృష్ణ చిరునవ్వుతో ఉండేవారని.. పనే ప్రాణంగా భావించేవాడని తెలిపారు. ఆయనతో పని చేస్తుంటే స్నేహితుడిలా కనిపించేవారని కొనియాడారు.