వెబ్ సిరీస్‌గా చలం ‘మైదానం’.. తెలుగు ఓటీటీ ఆహాలో..

  • Published By: sekhar ,Published On : July 13, 2020 / 05:18 PM IST
వెబ్ సిరీస్‌గా చలం ‘మైదానం’.. తెలుగు ఓటీటీ ఆహాలో..

డిజిట‌ల్ మీడియాకు ప్రాధాన్య‌త పెరుగుతోన్న నేప‌థ్యంలో కొత్త కొత్త కాన్సెప్ట్‌లు ప్రేక్ష‌కుల‌ను చేర‌డానికి మార్గాలు సుల‌భ‌మ‌వుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూత పడడంతో ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల నాడిని పట్టుకోవడానికి ముందుండే మ‌న మేక‌ర్స్ తెలుగు సాహిత్యంలో టాప్ మోస్ట్ న‌వ‌ల‌లు, సీరియ‌ల్స్‌పై క‌న్నేశారు.

అందులో భాగంగా ఇప్ప‌టికే మధుబాబు ‘షాడో’ న‌వ‌ల‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్ర‌క‌టించింది. ఇప్పుడు మ‌రో ప్రముఖ న‌వ‌ల వెబ్ సిరీస్ రూపంలో తెర‌కెక్క‌నుంది. వివ‌రాల్లోకివెళ్తే.. చ‌లం రాసిన ‘మైదానం’ న‌వ‌ల ఆధారంగా వెబ్ సిరీస్ రూపొంద‌నుంది.

‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రస్తుతం రానా దగ్గుబాటితో ‘విరాటపర్వం’ సినిమాను తెరకెక్కిస్తున్న యువ ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల నిర్మాత‌గా మారి ‘మైదానం’ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు‌. తెలుగు ఓటీటీ ఆహా కోసం ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్న‌ట్లు వేణు ఊడుగుల తెలిపారు. కొత్త కంటెంట్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాలతో తొలి తెలుగు ఓటీటీ ఆహా డిజిటల్ రంగంలో రోజురోజుకీ దూసుకుపోతోంది.