సరిలేరు మీకెవ్వరు, నెల్లూరు కుర్రాళ్ల టాలెంట్‌కు సినీ ఇండస్ట్రీ ఫిదా.. అద్భుతంగా బసవ, రమణ లోడ్ ఎత్తాలిరా ఫైట్ సీన్లు షూటింగ్

  • Published By: naveen ,Published On : August 13, 2020 / 12:20 PM IST
సరిలేరు మీకెవ్వరు, నెల్లూరు కుర్రాళ్ల టాలెంట్‌కు సినీ ఇండస్ట్రీ ఫిదా.. అద్భుతంగా బసవ, రమణ లోడ్ ఎత్తాలిరా ఫైట్ సీన్లు షూటింగ్

కోట్ల రూపాయల పెట్టుబడితో రోజులు తరబడి శ్రమించినా రాని ఔట్ పుట్ ను సింపుల్ గా స్మార్ట్ వర్క్ తో రాబట్టారు ఆ కుర్రాళ్లు. సినీ ఫీల్డ్ లో తలపండిన ఉద్దండులతో శభాష్ అనిపించుకున్నారు. వాళ్ల టాలెంట్ చూసి నెటిజన్లంతా అదుర్స్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ వారు ఏం చేశారో తెలుసా. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ ఫైట్ సీన్ ను రీ క్రియేట్ చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. వారి వీడియో, ఒరిజినల్ సినిమాను మైమరిపించేలా ఉందని కితాబిస్తున్నారు. ఆ కుర్రాళ్ల వీడియోకు సినిమా ఇండస్ట్రీ ఫిదా అయ్యిందంటే వారి టాలెంట్ ఏంటో అర్థమవుతుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ సీన్ రీ క్రియేట్:
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. దీన్ని మరోసారి ప్రూవ్ చేశారు నెల్లూరు కుర్రాళ్లు. వారు చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినీ పరిశ్రమ దృష్టిని అట్రాక్ట్ చేసింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ సీన్ తీసి అదరగొట్టారు. పిల్లలతో కలిసి ఒరిజినల్ సినిమాను తలపించేలా వీడియో క్రియేట్ చేసి బర్త్‌డే గిఫ్ట్‌గా మహేష్ కి విషెష్ చెప్పారు. రాత్రికి రాత్రే ఇది వైరల్ కావడంతో ఇప్పుడు ఆ నెల్లూరు కుర్రాళ్లు సెలబ్రెటీలు అయిపోయారు. వారి టాలెంట్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయిన 18ఏళ్ల కుర్రాడు:
ఈ వీడియో వెనుక ఉన్న కుర్రాడి పేరు మీనంగారి కిరణ్ (18). కిరణ్ ఆధ్వర్యంలో తీసిన ఈ వీడియో సంచలనం క్రియేట్ చేసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న పిల్లలతో కొండారెడ్డి బురుజు దగ్గర జరిగే ఫైట్ సీన్ ని కిరణ్ రీ క్రియేట్ చేశాడు. సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా డైలాగులు, ఫైట్ సీన్, యాక్షన్ అన్నింటిని జోడించాడు. ఏ మాత్రం టెక్నాలజీని వాడకుండా సొంత తెలివితో ఈ పని చేశాడు. ఏకంగా సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ వీడియో చూసి మురిసిపోయాడు. ఆయన దీన్ని రీ ట్వీట్ చేయడంతో వైరల్ అయింది. అంతేకాదు రమణ లోడెత్తాలిరా అనే ఫైట్ సీన్ కూడా తీశాడు. దీంతో ఒక్కసారిగా కిరణ్ పేరు మారుమోగుతోంది. కిరణ్ ఎవరు, అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని అంతా తెగ వెతికేస్తుండగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

చదివింది 9వ తరగతి వరకే, అపారమైన టాలెంట్ సొంతం:
ఏ మాత్రం సపోర్ట్ లేకుండా క్రియేటివిటినీ నమ్ముకున్నాడు కిరణ్. 9వ తరగతి వరకు మాత్రమే చదివినా కూడా తనలోని టాలెంట్‌కు కొదవ లేదని నిరూపించాడు. కిరణ్ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఉంటున్నాడు. ఓ పెంకుల తయారీ పరిశ్రమలో పని చేస్తూనే.. తల్లితో పాటు చేపలు పట్టే వృత్తి కొనసాగిస్తున్నాడు. పేదరికాన్ని అధిగమించి సత్తా చాటాడు. కాగా అంతకు ముందు ‘సర్కార్’, ‘కాటమరాయుడు’ సినిమా ఫైట్స్ కూడా తీశానని కిరణ్ చెప్పాడు. కానీ ఈ ఫైట్ సీన్‌తో తనకు మంచి గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నాడు.

సెల్ ఫోన్ సాయంతో ఫైట్ సీన్లు చిత్రీకరణ:
కిరణ్ కు పట్టుమని 18ఏళ్లు కూడా లేవు. నెల్లూరు జిల్లా భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. తల్లి రమణమ్మ చేపలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తోంది. సినిమాలపై కిరణ్ కు ఆసక్తి ఉండటంతో అతడిని హైదరాబాద్ లోని ఓ యాక్టింగ్ స్కూల్ లో చేర్పించింది. అయితే డబ్బు సమయానికి అందకపోవడంతో కిరణ్ మనసు చంపుకుని మళ్లీ తల్లి దగ్గరికి వచ్చేశాడు. 9వ తరగతి నుంచే సినిమాల్లోకి వెళ్లాలని కిరణ్ అనుకున్నాడు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. నటన, డైరెక్షన్ పై మక్కువను చంపుకోలేకపోయాడు కిరణ్. అనుకున్నది సాధించాలని అనుకున్నాడు. లాక్ డౌన్ సమయాన్ని స్నేహితులతో కలిసి సద్వినియోగం చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని రెండు ఫైట్ సన్నివేశాలను సెల్ ఫోన్ సాయంతో షూట్ చేశాడు.

కిరణ్ టాలెంట్ కు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫిదా:
సాధారణంగా సినిమా దృశ్యాలంటే రియాల్టీకి దూరంగా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం, గ్రాఫిక్స్ సాయంతో ప్రమాదకర సీన్లను చిత్రీకరిస్తారు. సినిమాలో అవన్నీ కనిపించకుండా ఎడిట్ చేస్తారు. కానీ కిరణ్ మాత్రం ఎలాంటి టెక్నాలజీ వాడకుండా, గ్రాఫిక్స్ సాయం తీసుకోకుండా ఎంతో నేచురల్ గా ఒక్క రోజులోనే రమణ లోడ్ ఎత్తాలిరా ఫైట్ సీన్ ను యాస్ ఇటీజ్ గా దింపేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. గంటల వ్యవధిలోనే లక్షల వ్యూవ్స్ వచ్చాయి. అప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని కిరణ్ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. సినిమాలంటే తనకు ప్రాణం అని, మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ గా రెండు ఫైట్ సీన్లు షూట్ చేశానని చెప్పాడు. బసవ ఫైట్ ను ఒక్కటిన్నర రోజులో, రమణ ఫైట్ ను ఒక్క రోజులో కంప్లీట్ చేశానన్నాడు. తాను తీసిన వీడియో వైరల్ కావడం, డైరెక్టర్ అనిల్ రావిపూడి వాటిని రీట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు.