ఫిదా కాంబినేషన్.. కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు

  • Edited By: veegamteam , September 9, 2019 / 10:22 AM IST
ఫిదా కాంబినేషన్.. కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో కొత్త సినిమాకు ముహూర్తం పెట్టారు. చాలా రోజులుగా ఆలస్యమవుతున్న ఈ చిత్రం ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లింది. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ములతోపాటు హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. నిర్మాతలు సునీల్ దాస్ కె నారంగ్, ఎఫ్ డిసి ఛైర్మన్ పి.రామ్మోహన్ రావు, భరత్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, డిస్ట్రిబ్యూటర్లు సదానంద్, శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఓ ఊరు నుంచి పట్నానికి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథ ఇది..తర్వాత తాను చేస్తున్న ఫస్ట్ ఫ్రెష్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది అన్నారు. ఈ ప్రేమకథలో నాగ చైతన్య, సాయిపల్లవి ఒదిగిపోతారని అనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ యాసని నాగ చైతన్య బాగా ఇష్టపడి నేర్చుకున్నాడని, ఆయనే సినిమాకు హైలెట్ అవుతాడని చెప్పారు. సాయి పల్లవి కూడా మరోసారి తెలంగాణ అమ్మాయిగా నటించబోతుందన్నారు. మూడు నెలల్లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేస్తామన్నారు శేఖర్ కమ్ముల.

ఇదే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మజిలీ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న సినిమా ఇది. ఏఆర్ రెహమాన్ శిష్యుడు ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Also Read : వాల్మీకి సినిమాపై హైకోర్టులో పిటిషన్