Singer Mangli: మంగ్లీ బోనం పాటపై దుమారం.. ఎందుకీ వివాదం?

ఈ మధ్యకాలంలో సినిమాలు.. అందులో వచ్చే సన్నివేశాలు.. అందులో పాటలు.. పాత్రల పేర్లు కూడా వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. అందునా సున్నితమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆథ్యాత్మికం అంశాలలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే విమర్శల పాలవడం గ్యారంటీ. అలా ఇప్పుడు తెలంగాణ బోనాల జాతర మీద రూపొందించిన పాట వివాదాస్పదమవుతోంది.

Singer Mangli: మంగ్లీ బోనం పాటపై దుమారం.. ఎందుకీ వివాదం?

Singer Mangli

Singer Mangli: ఈ మధ్యకాలంలో సినిమాలు.. అందులో వచ్చే సన్నివేశాలు.. అందులో పాటలు.. పాత్రల పేర్లు కూడా వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. అందునా సున్నితమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆథ్యాత్మికం అంశాలలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే విమర్శల పాలవడం గ్యారంటీ. అలా ఇప్పుడు తెలంగాణ బోనాల జాతర మీద రూపొందించిన పాట వివాదాస్పదమవుతోంది. అమ్మవారిని కీర్తించారా.. విమర్శించారా అన్నది అర్థంకాకపోవడంతో బోనాల పాటపై విమర్శలు వినిపిస్తున్నాయి.

జానపద, పల్లె పాటలు, దేవుళ్ళ పాటలకు సింగర్ మంగ్లీ చాల ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. భిన్నమైన స్వరం కలిగిన ఆమె ఒకవైపు ఇలా ఆల్బమ్స్ పాటలలో పేరు తెచ్చుకుంటూనే మరోవైపు సినిమాలలో ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ఆమె పాడిన పలు సినిమాల పాటలతో పాటు వివిధ పండగల సమయంలో రూపొందించిన వీడియోలు యూట్యూబ్‌లో సందడి చేయగా తెలంగాణలో బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ‘చెట్టుకింద కూసున్నవమ్మా’ అంటూ సాగే బోనాల పాటని తీసుకొచ్చింది.

ఇందులో తనే నర్తిస్తూ పాట పాడారు. జులై 11న యూట్యూబ్‌ వేదికగా విడుదలైన ఈ పాట లక్షలమందిని అలరించి ట్రెండింగ్‌లో కూడా నిలిచింది. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు ఈ పాటే ఆమెకు విమర్శలు తెచ్చిపెడుతుంది. ఈ సాంగ్ లోని లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని కొందరు మండిపడుతున్నారు. పాటలోని కొన్ని లిరిక్స్ గ్రామ దేవతలను విమర్శిస్తున్నట్లు ఉన్నాయని వాళ్ళ వాదన. భక్తుల మొక్కులు, పూజలు చెట్టుకింద కూర్చున్న నీకు కనిపించినా.. ఎందుకు మొక్కులు తీర్చవని అర్థం వచ్చేలా ఉండడం వివాదానికి కారణమైంది.

ఈ విషయంలో కొందరు సింగర్ మంగ్లీని తీవ్రంగా తప్పుబడుతున్నారు. గతంలో పాటలు ఎలా ఉండేవి.. ఇప్పుడెలా ఉంటున్నాయో చూసుకుంటున్నావా అంటూ మంగ్లీని టార్గెట్ చేసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరో రాసిన పాటను ఆమె పాడి డాన్స్ చేయడం ఆమె తప్పేలా అవుతుందని మరికొందరు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పాట వివాదంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పాటను రామస్వామి అనే లిరిసిస్ట్ రాయగా, రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. ఢీ షో పండు కొరియోగ్రఫీ చేశాడు.