‘ఆచార్య’ పై కాపీ ఆరోపణలు.. నా కథే అంటున్న దర్శకుడు అనిల్ కన్నెగంటి..

  • Published By: sekhar ,Published On : August 24, 2020 / 05:24 PM IST
‘ఆచార్య’ పై కాపీ ఆరోపణలు.. నా కథే అంటున్న దర్శకుడు అనిల్ కన్నెగంటి..

copy allegations on Acharya Movie: సినిమా పరిశ్రమలో కాపీ ఆరోపణలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వినిపిస్తుంటాయి. కథ, సన్నివేశం లేదా టైటిల్ విషయంలో తరచుగా ఇటువంటి ఆరోపణలు వస్తుంటాయి. క్రియేటివ్ ఫీల్డ్‌లో కాపీ ఆరోపణలనేవి కామన్ అనే వారూ లేకపోలేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’పై కూడా కాపీ ఆరోపణలు మొదలయ్యాయి.
చిరు, కొరటాల కలయికలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి మెగాస్టార్ బర్త్‌డే కానుకగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఇది నా కథే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అనిల్, కళ్యాణ్ రామ్ ‘అసాధ్యుడు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత మంచు మనోజ్‌తో ‘మిస్టర్ నూకయ్య’, సందీప్‌ కిషన్‌తో ‘రన్’ సినిమాలు చేశాడు. ఇంతకీ అనిల్ ఏమంటున్నాడంటే.. ‘ఆచార్య’ టైటిల్ తర్వాత వచ్చే సన్నివేశం తను రాసుకున్న కథలోని సన్నివేశంలానే ఉందని ఆరోపిస్తున్నాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన కథను ‘పుణ్యభూమి’ అనే టైటిల్‌తో 2006లో రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేయించినట్లుగా చెబుతున్నాడు.

కొరటాల శివ రచయితగా పనిచేసినప్పుడు అతని కథలను మాటలతో సహా కాపీ కొట్టినవాళ్లున్నారు. మన కష్టాన్ని ఇంకొకరు దోచుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన శివ ‘ఆచార్య’ విషయంలో కాపీ ఆరోపణలు ఎదుర్కోవడం ఏంటి?  అయితే ఇలాంటి ఆరోపణలు స్టార్ హీరోల, దర్శకుల సినిమాల విషయంలో చేసి ఒక్కసారిగా వెలుగులోకి రావాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. మరి ఇవి అలాంటి ఆరోపణలో లేక నిజంగానే కొరటాల కాపీ చేశారో తెలియాలంటే.. ‘ఆచార్య’ టీమ్ స్పందించాల్సిందే.